ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలి
ABN, Publish Date - Oct 24 , 2024 | 12:34 AM
ధాన్యం కొనుగోలులో సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి చెప్పారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ధాన్యం రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు సిబ్బందికి బుధవారం నిర్వహించిన సాంకేతిక శిక్షణా తరగతుల్లో ఆమె పాల్గొని మాట్లాడారు.
ముమ్మిడివరం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలులో సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి చెప్పారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ధాన్యం రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు సిబ్బందికి బుధవారం నిర్వహించిన సాంకేతిక శిక్షణా తరగతుల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నియమించిన సిబ్బంది ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రైతుల కళ్లాల్లోని తేమ ధాన్యాన్ని తేమ శాతం, నూకశాతం కనుగొనే పరిజ్ఞానాన్ని టెక్నికల్ సిబ్బంది అన్వయించుకుని ధాన్యం కొనుగోలును విజయవంతం చేయాలన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం, అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఆరుగాలం శ్రమించి ధాన్యం పండించిన రైతులకు కనీస మద్దతు ధరను కల్పించేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో గతంలో మాదిరిగా కాకుండా ఒకే కంపెనీ వారు మిల్లుల వద్ద, కొనుగోలు కేంద్రాల వద్ద తేమ శాతాన్ని పరీక్షించే పరికరాలను ట్యాలిబ్రేషన్ ప్రక్రియ చేపట్టారని, ఇకపై ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మిల్లర్ల వద్ద తేమశాతం పరికరాల్లో వ్యత్యాసాలు ఉత్పన్నం కావని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలో 376 రైతు సేవా కేంద్రాలను 219 క్లస్టర్లుగా విభజించామని, ఈ క్లస్టర్‌లో 219 మంది సాంకేతిక సహాయకులను, మరో 219 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను, 66 మంది హెల్పర్లను నియమించామన్నారు. జిల్లా స్థాయిలో ఈ నెల 21, 23 తేదీల్లో సాంకేతిక శిక్షణా తరగతులు పూర్తి చేశామన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం ర్యాండమైజేషన్ ప్రక్రియను రద్దు చేసిందని, రైతు తమకు ఇష్టమొచ్చిన రైసు మిల్లులకు తరలించుకుని విక్రయించుకునే వెసులుబాటు ఉందన్నారు. కస్టోడియన్ అధికారులు మిల్లుల వద్ద దిగుమతి ప్రక్రియను పరిశీలించి సకాలంలో వాహనాల రవాణాకు సిద్ధం చేస్తారన్నారు. సచివాలయ సిబ్బంది ధాన్యం రవాణా వాహనాలను జీపీఎస్ కోఆర్డినేటర్ ద్వారా పర్యవేక్షిస్తారన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ బాలసరస్వతి, జిల్లా పౌరసరఫరాల అధికారి ఉదయభాస్కర్, సహాయ మేనేజర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - Oct 24 , 2024 | 12:34 AM