డ్రోన్ టెక్నాలజీలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు
ABN, Publish Date - Nov 20 , 2024 | 12:51 AM
వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు రానున్నాయని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ అందించే ఇండియన్ ఇన్‌స్టిస్టూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (కర్నూలు) సాంకేతిక ప్రతినిధులు కె.కృష్ణనాయక్, నరేష్‌బాబు, విష్ణుమూర్తి కలెక్టర్‌తో సమావేశమై సమీక్షించారు.
అమలాపురం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు రానున్నాయని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ అందించే ఇండియన్ ఇన్‌స్టిస్టూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (కర్నూలు) సాంకేతిక ప్రతినిధులు కె.కృష్ణనాయక్, నరేష్‌బాబు, విష్ణుమూర్తి కలెక్టర్‌తో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహేష్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ శిక్షణా సంస్థ ద్వారా రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయంపై పైలెట్ ప్రాజెక్టుగా డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సత్యసాయి జిల్లాలను ఎంపిక చేసిందన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్స్ వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. గోదావరి భవన్‌లో శిక్షణ ఇవ్వడంతో పాటు స్థానిక జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రయోగాత్మకంగా డ్రోన్లను వినియోగిస్తారన్నారు. జిల్లాలోని మూడు డివిజన్‌ల నుంచి రెండేసి మండలాలను ఎంపికచేసి వంద మంది విద్యావంతులైన అభ్యుదయ రైతులు, మరో వంద మంది విద్యావంతులైన స్వయం సహాయక సంఘాల మహిళలను ఎంపిక చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. డ్రోన్స్ సాంకేతిక సహాయకులుగా మరో 30 మంది, అగ్రికల్చర్ బీఎస్సీ చదివిన విద్యార్థులను ఎంపికచేసి డిసెంబరు రెండో వారంలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. 1500 ఎకరాలకు ఒక డ్రోన్ చొప్పున ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ ఆధారిత మండలాల్లోని డ్వాక్రా సంఘాలకు డ్రోన్ దీదీ పథకం ద్వారా డ్రోన్స్ కొనుగోలుకు రూ.10 లక్షల వరకు రుణాలు మంజూరు చేయడంతో పాటు రూ.8 లక్షలు సబ్సిడీగా అందిస్తారన్నారు. మండల మహిళా సమాఖ్య రూ.2లక్షలు కంట్రిబ్యూషన్‌గా చెల్లిస్తుందన్నారు. డ్రోన్స్ సహాయంతో వ్యవసాయం వల్ల రైతులకు పెట్టుబడులు తగ్గి లాభదాయకంగా మారుతుందని వివరించారు. డ్రోన్స్ వినియోగం వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. శక్తివంతమైన సెన్సార్లు, హై రిసొల్యూషన్ కెమెరాలతో డ్రోన్లు రైతులు పండించే పంటలకు పట్టిన చీడపీడలు, పోషకాహార లోపాలు, నీటికొరత వంటి సమస్యలను గుర్తిస్తాయన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ డాక్టర్ వి.శివశంకరప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు, జిల్లా సహకార అధికారి మురళీకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - Nov 20 , 2024 | 12:51 AM