ఇక విద్యుత్ స్మార్ట్ మీటర్లు
ABN, Publish Date - Nov 29 , 2024 | 01:00 AM
జిల్లాలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి వచ్చేశాయి. తొలి విడతలో ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో ఉన్న పాత విద్యుత్ మీటర్లను తొలగించి వాటి స్థానంలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటిదాకా విద్యుత్ బిల్లులు రీడింగ్ తీసుకోవడానికి ఏజెన్సీలకు చెందిన సిబ్బంది వచ్చి ఐఆర్ మీటర్లు వద్ద తమ సెల్‌ఫోన్ ద్వారా రీడింగ్‌ను నమోదు చేసి వచ్చిన బిల్లులను ప్రింట్ తీసి ఇచ్చేవారు.
మండపేట, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి వచ్చేశాయి. తొలి విడతలో ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో ఉన్న పాత విద్యుత్ మీటర్లను తొలగించి వాటి స్థానంలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటిదాకా విద్యుత్ బిల్లులు రీడింగ్ తీసుకోవడానికి ఏజెన్సీలకు చెందిన సిబ్బంది వచ్చి ఐఆర్ మీటర్లు వద్ద తమ సెల్‌ఫోన్ ద్వారా రీడింగ్‌ను నమోదు చేసి వచ్చిన బిల్లులను ప్రింట్ తీసి ఇచ్చేవారు. సిబ్బంది వచ్చిన సమయంలో ఇంటి వద్ద ఎవరూ లేకపోతే ఇబ్బందులు పడేవారు. బిల్లు తీయడం కష్టంగా మారేది. దీనివల్ల బిల్లుల బకాయిలు పేరుకుపోయిన పరిస్థితి ఏర్పడేది. ఇక నుంచి ఇటువంటి సమస్యల పరిష్కారానికి స్మార్ట్ మీటర్లు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.
విద్యుత్ చౌర్యానికి చెక్
స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ద్వారా విద్యుత్ చౌర్యానికి చెక్ పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. సిబ్బంది ప్రతి నెల వచ్చి రీడింగ్ తీయాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్ ద్వారా మోనటరింగ్ కేంద్రానికి మీటర్ రీడింగ్ చేరుతుంది. ఎన్ని యూనిట్లు వాడారు? ఎంతమేర బిల్లు చెల్లించాలనే వివరాలను ఫోన్ మెసేజ్ ద్వారా తెలియపరుస్తారు. గడువులోగా బిల్లు చెల్లించకపోతే మానిటరింగ్ కేంద్రం నుంచే స్మార్ట్ మీటర్ ద్వారా విద్యుత్ సరఫరాను నిలుపుదల చేస్తారు. గతంలో మాదిరిగా విద్యుత్ ఫీజులు తొలగించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది లైన్‌మెన్ ఎవరూ ఇంటికి రావాల్సిన అవసరం ఉండదు. ఎవరైనా సరే విద్యుత్ చౌర్యానికి పాల్పడితే స్మార్ట్ మీటర్ మోనటరింగ్ కేంద్రానికి సమాచారం పంపుతుంది. దీంతో వెంటనే విద్యుత్ చౌర్యంను అరికట్టడమే కాకుండా సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఎక్కడ, ఎందుకు సరఫరా నిలిచిపోయింది. స్మార్ట్‌మీటర్ ద్వారా వెంటనే మోనటరింగ్ కేంద్రానికి సంకేతాలు వస్తాయి. సిబ్బంది నేరుగా అక్కడకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు.
తగ్గనున్న బకాయిల భారం..
తొలి దశలో ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్‌లో గృహాలకు కూడా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ శాఖ బకాయిల భారం తగ్గుతుంది. సౌర విద్యుత్‌ను కూడా అనుసంధానం చేయవచ్చు.
స్మార్ట్ మీటర్ వల్ల ప్రయోజనాలు
విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు ఉండవు. విద్యుత్ ఆదా అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు బిల్లు ఎంతయిందో తెలుసుకోవచ్చు. భవిష్యత్‌లో ఈ మీటర్లను ప్రీపెయిడ్‌గా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల విద్యుత్ సరఫరా ఎంత కావాలో అంతవరకు మాత్రమే ముందుగా బిల్లు చెల్లించుకునే వెసులుబాటు వినియోగదారుడికి ఉంది.
Updated Date - Nov 29 , 2024 | 01:00 AM