ఆరు సర్కిళ్లు..150 మద్యం షాపులు
ABN, Publish Date - Sep 30 , 2024 | 11:22 PM
జిల్లాలో ఆరు ఎక్సైజ్ సర్కిల్ పోలీసుస్టేషన్ల పరిధిలో 150 మద్యం షాపులు ఏర్పాటుకు గుర్తించినట్టు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అమర్‌బాబు తెలిపారు. 2024-26 నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు అబ్కారీ శాఖ సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు, డీఎస్పీలతో నూతన మద్యం పాలసీ అమలుపై ముందస్తు సమావేశం నిర్వహించారు.
అమలాపురం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆరు ఎక్సైజ్ సర్కిల్ పోలీసుస్టేషన్ల పరిధిలో 150 మద్యం షాపులు ఏర్పాటుకు గుర్తించినట్టు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అమర్‌బాబు తెలిపారు. 2024-26 నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు అబ్కారీ శాఖ సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు, డీఎస్పీలతో నూతన మద్యం పాలసీ అమలుపై ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆరు సర్కిళ్లలో మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు అందుబాటులో ఉంచామన్నారు. పది మంది డిజిటల్ అసిస్టెంట్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుల సరఫరా, స్వీకరణ ప్రక్రియ కోసం నియమించామన్నారు. జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ కేశవవర్మ మాట్లాడుతూ ఔత్సాహిక దుకాణదారులు షాపుల నిర్వహణకు సంబంధించి లైసెన్సు ఫీజు డిపాజిట్ చెక్కులు ఒరిజినలా డూప్లికేటా అనే కోణంలో నిశిత పరిశీలన కోసం ఆరుగురు బ్యాంకు సిబ్బందిని ఆరు సర్కిళ్లలో నియమిస్తామన్నారు. గత మూడేళ్లుగా మద్యం దుకాణాల్లో అమ్మకాల గణాంక వివరాలను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేటు మద్యం వ్యాపారంలోకి మారుతున్న నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి శాంతి భద్రతల సమస్యలు రాకుండా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో నిలిచిపోయిన బ్రాండెండ్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. లైసెన్సు ఫీజులను ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసిందన్నారు. రెండేళ్ల కాలపరిమితితో మద్యం దుకాణాలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఎస్పీలు రామకృష్ణప్రసాద్, ఎక్సైజ్ సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Updated Date - Sep 30 , 2024 | 11:23 PM