ధాన్యం కొనుగోళ్లకు సర్వసన్నద్ధం కావాలి
ABN, Publish Date - Oct 08 , 2024 | 12:29 AM
ధాన్యం సేకరణకు అధికారులు సర్వసన్నద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. కోనసీమ జిల్లాలో 4.05 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రస్తుత సీజన్‌లో విక్రయానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలు, పొరపాట్లు జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలన్నారు. నవంబరు మొదటి వారంలోనే ధాన్యం సేకరణ ప్రారంభమవుతుందన్నారు.
అమలాపురం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ధాన్యం సేకరణకు అధికారులు సర్వసన్నద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. కోనసీమ జిల్లాలో 4.05 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రస్తుత సీజన్‌లో విక్రయానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలు, పొరపాట్లు జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలన్నారు. నవంబరు మొదటి వారంలోనే ధాన్యం సేకరణ ప్రారంభమవుతుందన్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరించడానికి తేమ యంత్రాలు, బరువు తూచే వేయింగ్ బ్రిడ్జిలు, కాటా యంత్రాలు సిద్ధం చేయాలన్నారు. అవసరం మేరకు గోనె సంచులు సిద్ధం చేయాలన్నారు. వర్షాలను దృష్టిలో పెట్టుకుని టార్పాలిన్లను మిల్లుల వద్ద సిద్ధంగా ఉంచాలన్నారు. తుఫాన్లు వచ్చినా రైతులకు నష్టం జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు తమకు నచ్చిన రైసు మిల్లులకు ధాన్యాన్ని తరలించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. గత ఐదు సీజన్లలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన సిబ్బందిని మాత్రమే ధాన్యం కొనుగోలుకు నియమించాలని స్పష్టం చేశారు. మిల్లుల తనిఖీ ప్రక్రియ తహసీల్దార్లతో నిర్వహించాలన్నారు. ఈ నెల 25లోపు రైతు సదస్సులు నిర్వహించి ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రవాణాశాఖ అధికారులు వాహనాల జాబితాను సిద్ధంచేసి జీపీఎస్ డివైజ్ ఉందో లేదో నిర్దారించాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు రైతుల ఖాతాలకు సొమ్ములు జమ చేయాలని, రవాణా చార్జీలను వారం లోపల జమచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, డీఎస్వో ఉదయభాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు, డీసీవో మురళీకృష్ణ, తూనికలు, కొలతలశాఖ అసిస్టెంట్ కంట్రోలర్ రాజేష్, జిల్లా మార్కెటింగ్ ఏడీ విశాలాక్షి, డీటీవో శ్రీనివాసరావు, సివిల్ సప్లయ్సి సహాయ మేనేజర్ నాగేశ్వరరావు, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Oct 08 , 2024 | 12:29 AM