ఫెర్రీ రేవు మూతపడడంతో ప్రయాణికుల ఇబ్బందులు
ABN, Publish Date - Oct 04 , 2024 | 12:22 AM
కోటిపల్లి-ముక్తేశ్వరం ఫెర్రీ రేవు మూతపడడంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం వెళ్లడానికి రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల ప్రజలతో పాటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లే అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.
కె.గంగవరం, అక్టోబరు 3: కోటిపల్లి-ముక్తేశ్వరం ఫెర్రీ రేవు మూతపడడంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం వెళ్లడానికి రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల ప్రజలతో పాటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లే అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. జూన్ 15న వరదల కారణంగా ఫెర్రీ రేవులో రాకపోకలు నిలిపివేశారు. వరదలు తగ్గినా నేటికి పునరుద్ధరించలేదు. కోటిపల్లి ఫెర్రీలో రేవు దాటితే కేవలం పది నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చాలు జిల్లా కేంద్రంలోని కార్యాలయాలకు చేరుకోవచ్చు. ఇది రామచంద్రపురం, మండపేట నియోజకవర్గ ప్రజలకు చాలా సులభంగా ఉంటుంది. ఫెర్రీలో రాకపోకల లేకపోవడంతో ఏ పనిమీదనైనా జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే అటు బాలయోగి వారధి, ఇటు రావులపాలెం-జొన్నాడ వంతెన దాటి వెళ్లాల్సి వస్తుంది. దీని వల్ల సుమారు 60 నుంచి 80 కిలోమీటర్ల అదనపు ప్రయాణంతో పాటు సమయం వృధా అవుతుంది. తరచూ జిల్లా కేంద్రంలోని వివిధ కార్యాలయాలకు, వివిధ పనులపై వెళ్లే అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జూలై నెలలో గోదావరి నదికి వరదలు వచ్చాయి. గోదావరి ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడం ధవళేశ్వరం బ్యారేజీకి వరద నీరు చేరింది. అక్కడ నుంచి సముద్రంలోకి వదిలిన వరద నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహించింది. ఈ కారణంగా 15 జూలై, 2024న కోటిపల్లి ఫెర్రీలో రాకపోకలు నిలిపివేశారు. తర్వాత గోదావరి ఒకసారి తగ్గుతూ, మరల పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం గోదావరి తగ్గింది. ఈ తరుణంలో ఫెర్రీలో సుంకాలు వసూలుకు మండల పరిషత్ అధికారులు టెండర్లు పిలిచి, రేవు నిర్వహణ అప్పగించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే సోమవారం జరగాల్సిన బహిరంగ వేలం వాయిదా పడింది. దీంతో రేవులో రాకపోకలు ఎప్పుడు పునరుద్ధరిస్తారో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. బహిరంగ వేలం నిర్వహించకపోయినా, ప్రత్యామ్నాయ మార్గాల్లో రేవు నిర్వహణ చేసి ఫెర్రీలో రాకపోకలు ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Oct 04 , 2024 | 12:22 AM