ఉచిత ఇసుక దోపిడీని అరికట్టాలి
ABN, Publish Date - Nov 12 , 2024 | 01:20 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీతో ప్రజలకు మేలు జరగడంలేదని ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు తాటిపాక మధు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశారు.
కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికుల ధర్నా
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీతో ప్రజలకు మేలు జరగడంలేదని ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు తాటిపాక మధు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఇసుక పాలసీ అధికార పార్టీ నేతలకే అనుకూలంగా మారిందన్నారు. ఇసుక అక్రమాలకు పాల్పడుతున్న దళారీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సామాన్య ప్రజలకు ఇసుక దొరకడం లేదని, యూనిట్ ఇసుక రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు పందేళ్ల భాను ప్రసాద్ మాట్లాడుతూ ఇసుక నిల్వ స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయాలని, ఇసుకను భద్రత యూనియన్లకు అప్పగించాలని కోరారు. ముందుగా కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. ఇసుక మాఫియాను అరికట్టాలని, ఇసుకపై అధిక ధరలను నియంత్రించాలని, సంక్షేమ బోర్డు మళ్లీ ప్రారంభించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కె.రాంబాబు, జిల్లా కార్యదర్శి మహేష్‌బాబు, అచ్చయ్యనాయుడు, శ్యామల, రామకృష్ణ, కొండలరావు, సాయిబాబా, ఇతర కార్మిక సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 12 , 2024 | 01:21 AM