గ్యాస్ పైప్‌లైన్ లీకేజీలను ఎప్పటికప్పుడు గుర్తించాలి
ABN, Publish Date - Sep 27 , 2024 | 12:08 AM
జిల్లాలోని గ్యాస్ పైపులైను లీకేజీలను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే అరికట్టే దిశగా చమురు సంస్థలు, జిల్లా అగ్నిమాపక శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, అగ్నిమాపక శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
అమలాపురం టౌన్, సెప్టెంబరు 26: జిల్లాలోని గ్యాస్ పైపులైను లీకేజీలను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే అరికట్టే దిశగా చమురు సంస్థలు, జిల్లా అగ్నిమాపక శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, అగ్నిమాపక శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో చమురు, సహజ వాయువుల వనరుల లభ్యత ప్రాంతాలు, వాటికి అనుబందంగా ఏర్పాటు చేసిన గ్యాస్ పైపులైన్లు, ఇంటర్మీడియట్ స్టేషన్లు, గ్యాస్ వినియోగించే కంపెనీలు, గ్యాస్ లీకేజీల నివారణపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. జిల్లాలో అన్ని చమురు గ్యాస్ నిక్షేపాలను వెలికితీసి సరఫరా చేస్తున్న సంస్థలు ఆయా పైపులైన్లను మ్యాపింగ్ చేసి జిల్లా అగ్నిమాపక స్పందన సంస్థల స్టేషన్‌లో అందించాలన్నారు. చమురు సంస్థలు వారివారి జంక్షన్ పాయింట్లు, ఇంటర్మీడియట్ స్టేషన్‌లలో లీకేజీలు ఏర్పడడానికి అవకాశం ఉన్న స్పాట్‌లను మ్యాపింగ్ చేస్తూ నివేదిక రూపొందించాలన్నారు. పైపులైన్ల లీకేజీ సమస్యలు ఉత్పన్నం కాకుండా నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. జిల్లా అగ్నిమాపక విపత్తు స్పందన అధికారి ఎన్.పార్థసారథి, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ మేనేజర్ సుందర్‌కుమార్, సీనియర్ ఫైర్ సేఫ్టీ అధికారి అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 27 , 2024 | 12:08 AM