అలా చూసొద్దాం!
ABN, Publish Date - Dec 15 , 2024 | 01:19 AM
వీకెండ్ సంస్కృతి గోదావరి జిల్లాలకు వచ్చేసింది.. శనివారం వస్తుందంటే చాలు. కుటుంబంతో హాయిగా ఎక్కడికో చోటకు ఎగిరిపోవాలి.. ఆదివారమంతా ఆనందంగా గడపాలి.. ప్రతి నెలా చాలామందికి ఇదో పెద్ద టాస్క్.. ఇదో క్వశ్చన్ మార్క్? ఎందుకంటే మన దగ్గర ఏ ప్రాంతాలు ఉన్నాయి.. ఎలా వెళ్లాలి..? చుట్టూ ఉన్న అందం.. ఆహ్లాదం గురించి చాలామందికి అవగాహనే లేదు.
ఎన్నెన్నో అందాల సమాహారం
పర్యాటకులకు స్వర్గధామం
పాపికొండలు చూస్తే మరువలేం
దిండి వెళితే.. వదిలి రాలేం
ప్రకృతి ఊరు..చింతూరు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
వీకెండ్ సంస్కృతి గోదావరి జిల్లాలకు వచ్చేసింది.. శనివారం వస్తుందంటే చాలు. కుటుంబంతో హాయిగా ఎక్కడికో చోటకు ఎగిరిపోవాలి.. ఆదివారమంతా ఆనందంగా గడపాలి.. ప్రతి నెలా చాలామందికి ఇదో పెద్ద టాస్క్.. ఇదో క్వశ్చన్ మార్క్? ఎందుకంటే మన దగ్గర ఏ ప్రాంతాలు ఉన్నాయి.. ఎలా వెళ్లాలి..? చుట్టూ ఉన్న అందం.. ఆహ్లాదం గురించి చాలామందికి అవగాహనే లేదు. ఒకసారి గోదావరిలో విహరించామంటే ఆ ఆనందమే వేరు.. కుటుంబంతో హాయిగా గడపొచ్చు.. కొత్త అనుభూతిని పొందొచ్చు..చుట్టూ కొండల మధ్య గోదారి అందాలను ఆస్వాదించి.. పేరంటాలపల్లిలో శివుడిని చూసి.. భద్రాచలం రాములోరి దర్శనం చేసుకుని.. ఇలా ప్రయాణం సాగిస్తే.. ఆ ఆనందం.. ఆ అనుభూతే వేరు.. ఇక కోనసీమలోని దిండి రిసార్ట్స్.. చింతూరు వెళ్లామా మూడు నదుల సంగమం చూసిరావొచ్చు.. ఒకసారి చూసి వచ్చామా.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి.. మనసుకు అంత ఆహ్లాదం.. ఆనందాన్ని అందిస్తాయి.. అంత దూరం వెళ్లలేమా గోదావరిలో లోకల్ బోటింగ్ ఆహ్వానం పలుకుతోంది. లాహిరి లాహిరి లాహి రిలో అంటూ ఈ వీకెండ్ ఒకసారి అలా వెళ్లి.. మన గోదావరిని చూసొద్దాం.. మరో లోకంలో విహరించి వద్దాం..కుటుంబంతో కలిసిన మధుర స్మృతులను జ్ఞాపకంగా మలుచుకుందాం.
లోకల్ అందాలకూ బోట్లు
రాజమహేంద్రవరంలో లోకల్ అందాలను తిలకించడానికి టూరిజంశాఖ ఐదు బోట్లను నడుపుతోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం చీకటిపడే వరకూ వీటిని అందుబా టులో ఉంచుతున్నారు. రోడ్ కం రైలు బ్రిడ్జి నుంచి పాత వంతెన వరకూ 20 నిమిషాల పాటు హాయిగా సోయగాలను తిలకించవచ్చు. మేజు వాణి, చిత్రాంగి, ఫాంటూన్ బోట్లకు పెద్ద లకు రూ.70, పిల్లలకు రూ.50, ధరణిలో పెద్ద లకు రూ.150, పిల్లలకు రూ.120 రుసుం నిర్ణ యించారు. ఫాంటూన్ బోటు పుష్కరఘాట్ నుం చి, మిగతా మూడూ మార్కండేయస్వామి సమీ పంలో ఉన్న పర్యాటకశాఖ జలవిహార నియంత్ర ణ కేంద్రం నుంచి ఆపరేట్ చేస్తున్నారు. స్పీడు బోటులో రూ.500 చెల్లించి ఓ పది నిమిషాల పాటు రైడ్ చేయొచ్చు. ఈ స్పీడు బోటుకు డిమాండ్ ఉంది. ఆదివారాల్లో రద్దీగా ఉంటుంది.
పాపికొండల నడుమ..
పాపికొండలు రమణీయమైన ప్రదేశం. ఒక రోజు టూర్ ప్యాకేజీ. రాజమహేంద్రవరం టూరిజం కార్యాలయం వద్దకు ఉదయం 7 గంటలకు చేరుకుంటే ప్రత్యేక వాహనంలో గండి పోచమ్మ ఆలయం వరకూ తీసుకెళతారు. అక్కడి నుంచి పాపికొండలకు బోట్లు బయలుదేరతాయి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందజేస్తారు. ఎంటర్‌టైన్ మెంట్‌కి కొదవ ఉండదు. జాలీగా సాగిపోతుంది. పేరంటాల పల్లి వద్ద కాసేపు హాల్ట్‌లో శివుడిని దర్శిం చుకోవచ్చు. సాయంత్రం 5 గంటలకు గండి పోచమ్మ ఆలయానికి చేరుకుని అక్కడి నుంచి వాహనాల్లో 7 గంటలకు రాజమహేంద్రవరం తిరిగి వస్తారు. ఈ ప్రయాణానికి పెద్దలకు రూ.1250, పిల్లలకు రూ.1050. గండిపోచమ్మ ఆలయం వద్ద ఉండే బోటు దగ్గరకు నేరుగా వస్తామంటే పెద్దలకు రూ.వెయ్యి, పిల్లలకు రూ.800 చెల్లిస్తే సరిపోతుంది.
భద్రాచలం ఇలా వెళ్లొచ్చు..
పాపికొండలకు వెళ్లినట్టే రాజమహేంద్రవరం నుంచి పేరంటాలపల్లి వరకూ బోటులో వెళతారు. అక్కడ వేరే బోటు ద్వారా సాయం త్రం 4 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. ఒక వైపు ప్రయాణానికి రూ.2500. తిరుగు ప్రయాణంలో బోటులో రావాలంటే మరో రూ.2500 చెల్లించి మరుసటి రోజు ఉదయం బయలుదేరే బోటులో రావొచ్చు.
ప్రకృతి సోయగాల టూరు..చింతూరు
(చింతూరు-ఆంధ్రజ్యోతి)
అది మూడు రాష్ట్రాల ముఖద్వారం.. మూడు నదుల సంగమం.. జలపాతాల సోయగం.. పాపి కొండల విహారం చింతూరు డివిజన్‌కే సొంతం. ప్రకృతి ఆరాధకులకు ఇదో ముచ్చటైన ప్రదేశం. హింది, ఒడియా, ఆదివాసీ, తెలుగు భాషల కల యిక ఇక్కడ మనం వినవచ్చు. ఛత్తీస్‌గడ్ నుంచి వచ్చే శబరి, ఒడిశా నుంచి వచ్చే సీలేరు నదులు చింతూరు మండల శివారు గ్రామమైన కల్లేరు వద్ద సంగమమవుతుంటాయి. అక్కడి నుంచి మరో 18 కిలోమీటర్ల దూరం పయనించి కూనవరం వద్ద గోదావరి ప్రవాహంలో ఈ రెండు నదులు కలు స్తుంటాయి. చింతూరుకు 8 కిలోమీటర్ల దూరంలో ఒడిశా, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల ప్రవేశాలను చూడొచ్చు. మోతుగూడెం వద్ద పొల్లూరు జలపాతాలు, చిం తూరు, మారేడుమిల్లి నడుమ సోకిలేరు వ్యూ పాయింట్ అబ్బురపరుస్తుంటాయి. వరరామచం ద్రపురం నుంచి బోట్లపై పాపికొండల విహార యాత్రతో పులకరించవచ్చు. మోతుగూడెంలో 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రానికి చెందిన నీటి కాల్వలు, రిజర్వాయర్ చూడముచ్చట గొలుపు తాయి. చింతూరు నుంచి 30 కిలోమీటర్ల దూరం లో కూనవరం వద్ద మూడు నదుల సంగమం చూ డవచ్చు. అక్కడి నుంచి 22 కిలోమీటర్లు ప్రయా ణిస్తే పోచవరం వస్తుంది. అక్కడి నుంచి 20 కిలో మీటర్ల దూరం బోటుపై ప్రయాణించి పాపికొం డలు చేరుకోవచ్చు. పోచవరం నుంచి పాపికొండ లకు ఒక్కొక్కరికి బోటు ఛార్జి రూ.1000 వంతున చెల్లించాలి. ఈ ఛార్జిలోనే భోజనం, టీ, టిఫిన్, స్నాక్స్ బోటులోనే సమకూరుస్తారు.
దిండి వెళితే.. మరచిపోలేమండి..
(అమలాపురం- ఆంధ్రజ్యోతి)
గలగలపారుతున్న గోదావరిలో పడవ ప్రయా ణం ఓ మధురానుభూతి. కోనసీమ జిల్లాలోని వశిష్ఠ నది చెంతన మలికిపురం మండలం దిండిలో కేరళ తరహా హౌస్‌బోట్లలో నదీ విహారం చేయొచ్చు. దిండి రిసార్ట్స్‌లో అత్యాధునిక సౌకర్యా లతో కూడిన వసతి గదులతోపాటు హౌస్‌బోట్లు, వశిష్ఠ బోటు, స్పీడు బోట్లు ఉన్నాయి. ఇక్కడ గం టల వారీ ప్యాకేజీలు అమలవుతాయి. వైనతేయ నదీపాయ పేరుతో హౌస్‌బోటులో ప్రత్యేక హంగులతో పర్యాటకులకు నదీ విహారం చేయనుంది. గోదావరి, వశిష్ఠ, ఆత్రేయ పేర్లతో బోట్లు ఉన్నాయి. హౌస్‌బోటులో నలుగురు పెద్దవారు, నలుగురు పిల్లలకు ప్యాకేజీ రూ.15 వేలు. గోదావరి బోటులో 20 మంది, వశిష్ఠ బోటులో 20 మంది, ఆత్రేయ బోటులో పదిమంది పర్యాటకులు ఉంటే నదీ విహారానికి బయలుదేరతాయి. వీటిని ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ బోట్ ప్యాకేజీ కోసం దిండి రిసార్ట్స్ సెల్ నెంబరు 98487 80524లో సంప్రదించవవచ్చు. దిండిలో మరో మూడు ప్రైవేటు రిసార్ట్స్ ఉన్నాయి. సోంపల్లిలో కోనసీమ రిసార్ట్స్, ఓడల రేవులో సముద్ర రిసార్ట్స్, అయినవిల్లిలో విల్లా రిసార్ట్స్, పాశర్లపూడి, యానాం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు రిసార్ట్స్ ఉన్నాయి.ఙ
బోటింగ్ సాగుతుందిలా..
యానాం నుంచి సావేరీ బోటు ద్వారా సాగర సంగమ విహారం, బోడసకుర్రు, పాశర్లపూడి, ఆదుర్రు, సోంపల్లి, అంతర్వేది, సఖినేటిపల్లి, ఎదుర్లంక, దిండితో వివిధ నదీ పరివాహక ప్రాంతాల్లో బోటు షికార్లకు ఏర్పాటు చేశారు. వీటితోపాటు కాట్రేనకోన మండలం కందికుప్ప, తాళ్లరేవు మండలం కోరంగి నుంచి మడ అడవుల్లో పడవల ద్వారా విహారయాత్ర సాగించడానికి అటవీశాఖ ఏర్పాట్లు చేసింది.
ఆన్‌లైన్‌లో బుకింగ్ సౌకర్యం
పాపికొండలు, భద్రాచలం, దిండి వెళ్లడానికి ఆన్‌లైన్‌లో కూడా టికెట్లు అందుబాటులో ఉంటాయి. రాజమహేంద్రవరంలోని టూరిజం కార్యాలయాల్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.98486 29341, 99519 68200, 98488 83091 నెంబర్లలో సంప్రదించి మరిన్ని వివరాలను తెలుసుకోవడంతోపాటు టికెట్లు కొనుగోలు చేయవచ్చు. లోకల్ రైడింగ్‌కి అక్కడికక్కడే టికెట్లు ఇస్తారు. టూర్ ఆపరేటర్ల ద్వారా కూడా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. దిండి రిసార్ట్స్‌కు ఆన్‌లైన్ సదుపాయం అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు, రూమ్‌లు బుక్ చేసుకోవచ్చు.
Updated Date - Dec 15 , 2024 | 01:19 AM