ముగిసిన నామినేషన్ల స్వీకరణ
ABN, Publish Date - Nov 19 , 2024 | 01:17 AM
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం ఒక్క రోజే నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. వీరు నలుగురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించారు.
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు చివరి రోజు నాలుగు నామినేషన్ల దాఖలు
మొత్తం ఆరుకు చేరుకున్న నామినేషన్లు
నేడు పరిశీలన
ఈనెల 21 వరకు ఉపసంహరణలు
వచ్చేనెల 5న పోలింగ్
9న కౌంటింగ్
కలెక్టరేట్(కాకినాడ), నవంబరు 18(ఆంధ్రజ్యోతి): తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం ఒక్క రోజే నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. వీరు నలుగురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించారు. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన నామన వెంకటలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన కవల నాగేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన పులుగు దీపక్, మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన అహమద్‌షేక్ నామినేషన్లను సహాయ రిటర్నింగ్ అధికారి, కాకినాడ జిల్లా డీఆర్వో వెంకట్రావుకు అందజేశారు. ఈనెల 11వతేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా తొలుత బొర్రా గోపి మూర్తి, తర్వాత గంథం నారాయణరావు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో చివరిరోజైన సోమవారానికి నామినేషన్ల సంఖ్య ఆరుకు చేరుకుంది. మంగళవారం కాకినాడ కలెక్టరేట్‌లో నామినేషన్ల పరిశీలన క్రతువు జరుగుతుంది. ఈనెల 21వతేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ నిర్వహిస్తున్నారు. వచ్చేనెల 5న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల పోలింగ్ కోసం ఆరు జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12, తూర్పుగోదావరి జిల్లాలో 20, ఏలూరు జిల్లాలో 20, కాకినాడ జిల్లాలో 22, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 22, పశ్చిమగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 16,316మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనిలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 614 మంది ఓటర్లు, తూర్పుగోదావరి జిల్లాలో 2893, ఏలూరు జిల్లాలో 2605, కాకినాడ జిల్లాలో 3333, కోనసీమ జిల్లాలో 3209, పశ్చిమగోదావరి జిల్లాలో 3662 మంది ఓటర్లు ఉన్నారు. వచ్చేనెల 9న కౌంటింగ్ జరగనుంది. అదేరోజు ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
ప్రస్తుతానికి బరిలో ఆరుగురు
నామినేషన్ల స్వీకరణ గడువు ముగియడంతో ఆరు నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో ప్రస్తుతానికి ఎన్నికల బరిలో ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు. ఈనెల 21వతేదీ ఉపసంహరణల తర్వాత ఎన్నికల బరిలో ఎవరు నిలుస్తారో లెక్క తేలనుంది.
Updated Date - Nov 19 , 2024 | 01:17 AM