అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
ABN, Publish Date - Oct 01 , 2024 | 11:55 PM
జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడి వివిధ రాష్ట్రాల్లో భారీగా దొంగతనాలు, దోపిడీలకు పాల్పడ్డ నలుగురు సభ్యుల అంతర్‌రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.70లక్షల విలువైన చోరీ సొత్తును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రూ.70లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం
40కు పైగా కేసుల్లో ఉన్న నలుగురు సభ్యుల ముఠా
కిమ్స్ వెంకటేశ్వరాలయం కేసు ఛేదించిన పోలీసులు
చోరీ సొత్తు బంగారం, వెండి మొత్తం రికవరీ
కేసు ఛేదించిన పోలీసులకు రివార్డులు అందించిన ఎస్పీ
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కృష్ణారావు
అమలాపురం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడి వివిధ రాష్ట్రాల్లో భారీగా దొంగతనాలు, దోపిడీలకు పాల్పడ్డ నలుగురు సభ్యుల అంతర్‌రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.70లక్షల విలువైన చోరీ సొత్తును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉభయ రాష్ట్రాల్లో 40కు పైగా చోరీలకు పాల్పడ్డ ఈ ముఠాను తొలిసారిగా అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు వెల్లడించారు. ఈ కీలక కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వివరించారు. అమలాపురం పట్టణానికి సమీపంలో ఉన్న కిమ్స్ వైద్య కళాశాలలో గల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గతనెల 4వ తేదీ అర్ధరాత్రి జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించి నిందితులను నుంచి సుమారు రూ.70లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 868 గ్రాముల బంగారు ఆభరణాలు, 8.56 కిలోల వెండి ఆభరణాలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ చెప్పారు. కిమ్స్‌లోని వేంకటేశ్వరాలయంలో చోరీ సొత్తు మొత్తం నిందితుల నుంచి రకవరీ చేసిన పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. శ్రీకాకుళం జిల్లా గుర్రాలమెట్ట గ్రామానికి చెందిన సవర సూర్యం అలియాస్ సూర్య (25), సవర చిన్నారావు అలియాస్ చిన్నా (24), జోగివలస గ్రామానికి చెందిన సవర రజనీ (24), తెలంగాణా రాష్ట్రంలోని మెదక్ జిల్లా మీమ్‌పూర్ గ్రామానికి చెందిన బత్తిన శ్రీకాంత్ (25) ఒక బృందంగా ఏర్పడి ఉభయ రాష్ట్రాలతో పాటు వివిఽధ ప్రాంతాల్లో భారీగా దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడ్డ వీరు వ్యూహాత్మకంగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి పక్కా వ్యూహంతో దోపిడీలు చేయడం అలవాటు చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు ఒక కారును అద్దెకు తీసుకుని చోరీ చేయాలనుకున్న దేవాలయాలవద్ద ముందుగా రెక్కీ నిర్వహించి ఆ తరువాత చోరీకి పాల్పడుతుంటారు. ఈవిధంగా అమలాపురంలోని కిమ్స్‌లోని వెంకటేశ్వరాలయానికి వచ్చి రెక్కీచేసి గతనెల 4వ తేదీ రాత్రి భారీ చోరీకి పాల్పడ్డారు. సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత చాకచక్యంగా ఈ దోపిడీకి పాల్పడ్డ ముఠాను గుర్తించడంలో క్రైమ్ పోలీసులు చేసిన కృషి ప్రశంసనీయం. అదనపు ఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్ నేతృత్వంలో అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబు, మరో సీఐ ప్రశాంత్‌కుమార్, రూరల్ ఎస్‌ఐ వై.శేఖర్‌బాబుతోపాటు మరికొందరు పోలీసులను మూడు బృందాలుగా ఏర్పాటుచేసి నెలరోజుల వ్యవధిలోనే కిమ్స్ దోపిడీ కేసును ఛేదించి సొత్తు రికవరీ చేశారు. నిందితుల నుంచి 868 గ్రాముల బంగారం, 8.56 కిలోల వెండి, హ్యుండాయ్ వెర్నా కారు, నాలుగు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ ముఠా సభ్యులు శ్రీకాకుళం జిల్లాలో 37, విశాఖపట్నం సిటీలో ఒకటి, ప్రకాశం జిల్లాలో ఒకటి, గుంటూరు జిల్లాలో ఒకటి, తెలంగాణాలోని మెదక్ జిల్లాలో ఒకటి దొంగతనాలు, దోపిడీలకు పాల్పడినట్టు ఎస్పీ కృష్ణారావు చెప్పారు. అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకోవడంలో కీలకపాత్ర వహించిన సీఐలు వీరబాబు, డి.ప్రశాంత్‌కుమార్, ఎస్‌ఐ శేఖర్‌బాబు, ఏఎస్‌ఐ అయితాబత్తుల బాలకృష్ణ, క్రైమ్ పార్టీ సభ్యులను ఎస్పీ కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. వీరందరికీ క్యాష్ రివార్డులను ఎస్పీ అందించారు. చాకచక్యంగా నెలరోజుల వ్యవధిలోనే భారీ దోపిడీ కేసులను ఛేదించిన పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు.
Updated Date - Oct 01 , 2024 | 11:55 PM