చట్టసభల్లోకి వర్మ కచ్చితంగా అడుగుపెడతారు
ABN, Publish Date - May 17 , 2024 | 11:51 PM
పిఠాపురం, మే 17: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎస్వీఎస్‌ఎన్ వర్మ భవిష్యత్తులో కచ్చితంగా చట్టసభల్లోకి అడుగుపెట్టి ప్రజల తరపున పనిచేస్తారని బలంగా నమ్ముతున్నట్టు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాన
జనసేన అధినేత పవన్‌కల్యాణ్
పిఠాపురం, మే 17: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎస్వీఎస్‌ఎన్ వర్మ భవిష్యత్తులో కచ్చితంగా చట్టసభల్లోకి అడుగుపెట్టి ప్రజల తరపున పనిచేస్తారని బలంగా నమ్ముతున్నట్టు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని తెలియగానే ఎంతో బలమైన క్యాడర్ ఉన్నప్పటికి తన సీటు త్యాగం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వర్మ కు, వారి కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. తానే అభ్యర్థి మాదిరిగా కష్టపడి పనిచేశారని కితాబునిచ్చారు. ఈ ఎన్నికల్లో వర్మ అందించిన సహకారం మరువలేనిదని తెలిపారు. రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం వర్మ అనుభవాన్ని వినియోగించుకుంటూ కలిసికట్టుగా ముందుకు వెళ్లతామని చెప్పారు. నిండునూరేళ్లు ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాజీవితంలో కొనసాగాలని, శ్రీపాదశ్రీవల్లభుల ఆశీస్సులు వర్మపై ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ తెలిపారు.
‘టీమ్ అట్లాంటా సేవలు అభినందనీయం’
జనసేన సిద్ధాంతాలకు మద్దతుగా టీమ్ అట్లాంటా జనసేన(తాజ్) అందించిన సేవలు అభినందనీయమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా జనసేనకు విరాళాలు అందించడంతో పాటు వివిధ పరికరాలు సమకూర్చారని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో తన తరపున గణనీయమైన సేవలు అందించారని తెలిపారు. నా సేన నా వంతు కార్యక్రమంలో ప్రతి నెలా భాగస్వాములు అయ్యారని చెప్పారు. ఖండాంతరాలు అవతల ఉన్నప్పటికి పుట్టిన భూమికి తన వంతుగా సేవ చేయాలనే దృఢసంకల్పంతో ముందుకు వచ్చి విజయం కోసం మేము సైతం అంటూ పాటుపడిన తాజ్ టీమ్‌కు ఆయన అభినందనలు తెలిపారు.
Updated Date - May 17 , 2024 | 11:51 PM