పీఏసీఎస్‌లు బహుళ ప్రయోజనకరంగా ఉండాలి
ABN, Publish Date - Dec 13 , 2024 | 12:32 AM
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు బహుళ ప్రయోజనకరంగా ఉన్నప్పుడే శక్తివంతంగా, ఆర్థిక లాభదాయకంగా రూపాంతరం చెందగలవని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి చెప్పారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అమలు కమిటీ సమావేశం జేసీ అద్యక్షతన నిర్వహించారు.
అమలాపురం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు బహుళ ప్రయోజనకరంగా ఉన్నప్పుడే శక్తివంతంగా, ఆర్థిక లాభదాయకంగా రూపాంతరం చెందగలవని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి చెప్పారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అమలు కమిటీ సమావేశం జేసీ అద్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పీఏసీఎస్‌ల కంప్యూటరైజేషన్ ప్రక్రియను నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. సహకార సంఘాల్లో ఇతర వ్యాపారాలు అయిన పెట్రోలు బంకుల నిర్వహణ, జలజీవన్ మిషన్ కింద తాగునీటి పైపులైన్ల ఏర్పాటు, జన ఔషధీ కేంద్రాల నిర్వహణ, కామన్ సర్వీసు కేంద్రాలను రైతుల కోసం అమలు చేయాలన్నారు. ముమ్మిడివరంలో బహుళార్థ మల్టీపర్పస్ ప్రయోజన గోదాము నిర్మాణాన్ని పూర్తిచేసి ఆయా వసతులను నెలాఖరు నాటికి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పీఏసీఎస్‌లను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందన్నారు. మత్స్య, పశు సంవర్థక విభాగాల్లో మల్టీపర్పస్ సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. పాల ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ విధంగా చేయడంతో పీఏసీఎస్‌ల ఆదాయ వనరుల పెరగడంతో పాటు పాడి పరిశ్రమ, చేపల పెంపకం, నిల్వ వంటి బహుళ ప్రయోజనకర కొత్త రంగాల్లో కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కంప్యూటరీకరణ ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు బలోపేతం చేయాలన్నారు. పీఏసీఎస్‌లను నాబార్డుతో అనుసంధానం చేసి డిజిటలైజేషన్ సపోర్టు సిస్టమ్స్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను నాబార్డు రూపొందించిందన్నారు. తద్వారా ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. బ్యాంకుల మాదిరిగా సహకార సంఘాలను డిజిటలైజేషన్ చేసి అక్రమాలకు చెక్ పెట్టాలన్న లక్ష్యంగా సంఘాల్లో సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. సహకార సంఘాల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచడానికి ఆర్థిక చేయూతను అందించాలన్నారు. ప్రాంతీయ అసమతుల్యతలను తొలగించి వ్యవసాయ అనుబంధ రంగాల్లో సహకార అభివృద్ధిని వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో కమిటీ కన్వీనర్, జిల్లా సహకార అధికారి మురళీకృష్ణ, నాబార్డు డీజీఎం స్వామినాయుడు, జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు, మార్కెటింగ్ శాఖ ఏడీ కె.విశాలాక్షి, డీసీసీబీ సీఈవో రామచంద్రరావు, పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకుడు ఎల్.విజయారెడ్డి, పీఏసీఎస్ సీఈవోలు పాల్గొన్నారు.
Updated Date - Dec 13 , 2024 | 12:32 AM