విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా మెనూలో మార్పు చేయాలి
ABN, Publish Date - Sep 10 , 2024 | 11:58 PM
విద్యార్థుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకంమెనూలో మార్పులు చేయాల్సి ఉందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు, విద్యార్థులు, అధికారులు, ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అమలాపురం టౌన్, సెప్టెంబరు 10: విద్యార్థుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకంమెనూలో మార్పులు చేయాల్సి ఉందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు, విద్యార్థులు, అధికారులు, ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అందరితో చర్చించి అభిప్రాయాలు సేకరించి మధ్యాహ్న భోజన పథకం మెనూపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం మెనూ స్థానిక అభిరుచులకు అనుగుణంగా ఉండాలని, దీనిపై అభిప్రాయాలు సేకరించి నివేదిక పంపాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు తెలిపారు. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో వివిధ రకాల ఆహారపు అలవాట్లు ఉంటాయని, స్థానికంగా విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడే ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. న్యూట్రిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానికంగా దొరికే కూరగాయలు, పప్పులు తదితర వంటకాలను మెనూలో చేర్చాలన్నారు. రాష్ట్రమంతా ఒకే మెనూ అమలు చేయడం వల్ల కొందరు విద్యార్థులు అయిష్టంగానే మధ్యాహ్న భోజనం చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించిందన్నారు. విద్యార్థులతో కూడా చర్చించాలని తెలిపారు. జిల్లాలో సుమారు లక్ష మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారని గుర్తించి అందరూ చర్చించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో డీఈవో ఎం.కమలకుమారి, మార్కెటింగ్ శాఖ అధికారులు, ఎంఈవోలు పాల్గొన్నారు.
Updated Date - Sep 10 , 2024 | 11:58 PM