అసలేమైందో..
ABN, Publish Date - Dec 04 , 2024 | 12:44 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన పిల్లి దుర్గారావు(28), ఎన్.సాయిసుస్మిత(25) విశాఖపట్నంలో ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం కలిగించింది. ఇద్దరిదీ అమలాపురం పట్టణ పరిధే కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
అమలాపురం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన పిల్లి దుర్గారావు(28), ఎన్.సాయిసుస్మిత(25) విశాఖపట్నంలో ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం కలిగించింది. ఇద్దరిదీ అమలాపురం పట్టణ పరిధే కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. అమలాపురం పట్టణంలోని మద్దాలవారిపేట సమీపంలో గల రంగ క్యాంటీన్ నిర్వాహకుడు పిల్లి శ్రీనివాసరావు రెండో కుమారుడు పిల్లి దుర్గారావు.. పట్టణంలోని విద్యుత్‌నగర్‌కు చెందిన ఎన్.పల్లంరాజు కుమార్తె సాయిసుస్మిత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. సుస్మిత బీటెక్ పూర్తిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. దుర్గారావు గత కొంతకాలంగా విశాఖపట్నంలోనే క్యాటరింగ్‌తో పాటు బిర్యానీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. అయితే వర్క్ ఫ్రమ్ హోం ఉండడంతో వారం కిందట సుస్మిత దుర్గారావు వద్దకు వచ్చినట్లు చెబుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున వారు విశాఖ నగరంలోని 69వ వార్డు పరిధిలో వెంకటేశ్వర కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి చనిపోయారు. అసలు వారి మధ్య ఏం జరిగిందనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా ఉంది. ఇంటిలో టీవీ రిమోట్ విరిగిపోయి, సామగ్రి చిందరవందరగా ఉండడంతో వారిద్దరి మధ్య తీవ్రమైన గొడవ ఏదైనా జరిగి, క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారా? అని అనుమానిస్తున్నారు. గొడవలే ఆత్మహత్యకు కారణమా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది..
Updated Date - Dec 04 , 2024 | 12:44 AM