జగన్ హయాంలో జరిగిన హత్యకేసులపై పునర్విచారణ జరగాలి
ABN, Publish Date - Oct 28 , 2024 | 12:28 AM
ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు.. సినీ నటి జెత్వానీ కేసుల మాదిరిగానే గత జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన సంచలన హత్యలు, కేసులు పునర్విచారణ చేపట్టాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక (విదసం) రాష్ట్రసమితి సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు.
అమలాపురం టౌన్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు.. సినీ నటి జెత్వానీ కేసుల మాదిరిగానే గత జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన సంచలన హత్యలు, కేసులు పునర్విచారణ చేపట్టాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక (విదసం) రాష్ట్రసమితి సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. దళితులపై జరిగిన ఘటనలపై పునర్విచారణ జరిపించాలన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఐక్యవేదిక రాష్ట్ర కోకన్వీనర్ రేవు తిరుపతిరావు అధ్యక్షతన ఆదివారం ఈదరపల్లిలోని సామాజిక భవనంలో విదసం రాష్ట్ర సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ వెంకటరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దళితులపై సాగించిన హత్యాకాండలు, అక్రమ కేసులను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లేందుకు తీర్మానించామన్నారు. తొలుత బాధిత కుటుంబ సభ్యులు తమకు జరిగిన అన్యాయాలను వివరిస్తూ బ్యానర్లతో ప్రదర్శన నిర్వహించారు. విశాఖపట్నంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడి కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు సంస్థ టెర్రరిస్టు, ప్రత్యర్థి రాజకీయ కుట్రలు లేవని స్పష్టం చేసినందున కేసును ఎన్‌ఐఏ యాక్టు, క్లాజ్ నంబరు 7బి ప్రకారం ఏపీ పోలీసులకు బదిలీ చేయవచ్చునన్నారు. ఈ సందర్భంగా కోడికత్తి శ్రీను, సోదరుడు సుబ్బరాజుతో కలిసి తల్లి జనుపల్లి సావిత్రి మాట్లాడుతూ తన కొడుకును అన్యాయంగా జగన్ ఐదేళ్లు జైలులో పెట్టారని, సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సహాయంచేసి కేసును ఏపీ పోలీసులకుగానీ, సీఐడీకి గానీ బదిలీచేసి సత్వర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యంను అత్యంత దారుణంగా కొట్టి చంపారని పిట్టా వరప్రసాద్ వివరించారు. జగన్ మద్దతుతోనే అనంతబాబుకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు. సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం మాట్లాడుతూ తన కొడుకు హత్యలో అనంతబాబు భార్య, ఇతరులు కూడా ఉన్నారని, దీనిపై కోర్టులో మెమో వేసి కేసును పునఃసమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. అనంతబాబు బెయిల్‌ను రద్దుచేసేలా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలన్నారు. వెంకటాయపాలెం శిరోముండనం కేసుపై గుబ్బల శ్రీను మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దోషి అని నిర్ధారణ అయిందన్నారు. మూడేళ్లకు పైబడి శిక్ష పడాల్సిన కేసులో కోర్టు కేవలం 18 నెలలు జైలు శిక్ష మాత్రమే విధించిందన్నారు. ఆ శిక్షను కూడా రద్దు చేయాలని త్రిమూర్తులు హైకోర్టులో అప్పీల్ చేశారని, ప్రస్తుతం బెయిల్‌పై ఉండి కేసు నుంచి తప్పించుకునేందుకు జనసేనలో దూకే ప్రయత్నంలో ఉన్నట్టు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం స్పందించి తక్షణం క్రాస్ అప్పీల్ వేసి త్రిమూర్తులుకు విధించిన శిక్షను పునఃసమీక్ష చేయాలని డిమాండు చేశారు. గోపాలపురం హోటల్‌లో పేపరు ప్లేట్లపై అంబేడ్కర్ బొమ్మవేసిన కేసుపై వాసు మాట్లాడుతూ హోటల్ యజమానిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన దళిత యువకులపై అప్పటి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు 120బి సెక్షన్‌తో కేసు నమోదు చేసి 15 రోజులు రిమాండ్‌కు పంపించారని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించిన హోటల్ యజమాని వెంకటరెడ్డిపై ఇప్పటికీ కేసు నమోదు చేయలేదన్నారు. కక్ష సాధింపుతో ఫిర్యాదుదారులపైనే తప్పుడు కేసులు పెట్టించారని ఈ ఘటనపై ప్రభుత్వం పునర్విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విదసం నాయకులు ఓంకార్, ప్రసాద్, దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు జంగా బాబూరావు, ఇసుకపట్ల రఘుబాబు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, కొంకి రాజామణితో పాటు వివిధ సంఘాల నాయకులు కొండా దుర్గారావు, నాగాబత్తుల ప్రసాదరావు, దేవరపల్లి శాంతికుమార్, శెట్టిబత్తుల తులసీరావు, నాగాబత్తుల నరసింహమూర్తి, నెల్లి ప్రసాద్, అమలదాసు బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 28 , 2024 | 12:28 AM