పట్టా భూముల్లోనూ ఇసుక తీతలు
ABN, Publish Date - Oct 01 , 2024 | 11:58 PM
ఇక ఇసుక కొరత కొద్దిరోజులు మాత్రమే. పట్టా భూముల్లో కూడా ఇసుక తీతకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో గోదావరి లంకల్లోని పట్టా భూముల్లో ఇసుక కూడా తీసి ఉచిత ఇసుక విధానంలో సరఫరా చేయవచ్చు.
ఓపెన్ ర్యాంపులకు టెండర్లు పిలిచే యోచన
మొక్కుబడిగా మొదలైన ఇసుకతీత
ఇంకా అయోమయంలోనే బోట్స్‌మెన్ సొసైటీలు
గాయత్రీ రెండు ర్యాంపులకు కొలతలు
అనుమతి మేరకు ఇసుక తీయాలి: జేసీ చినరాముడు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి):
ఇక ఇసుక కొరత కొద్దిరోజులు మాత్రమే. పట్టా భూముల్లో కూడా ఇసుక తీతకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో గోదావరి లంకల్లోని పట్టా భూముల్లో ఇసుక కూడా తీసి ఉచిత ఇసుక విధానంలో సరఫరా చేయవచ్చు. బహుశా ఈనెల 15 తర్వాత ఓపెన్ ర్యాంపులు కూడా అమల్లోకి వచ్చే అవకాశ ముంది. ప్రస్తుతం బోట్స్‌మెన్ సొసైటీల ద్వారా డీసిల్టేషన్ కూడా మొదలవుతోంది. ఇవన్నీ మొదలైతే జిల్లాలో ఇసుక కొరత అనేదే ఉండదు. ఇతర ప్రాంతాలకు కూడా సరఫరా చేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం డీసిల్టేషన్ పాయింట్లలో ఇసుక తీత ఇంకా అయోమయంలోనే ఉంది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.చినరాముడు ఆధ్వ ర్యంలో ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్, మైన్స్ ఏడీ డి.ఫణిభూషణ్, ఇరిగేషన్ హెడ్‌వర్కు ఈఈ ఆర్.కాశీవిశేశ్వరరావు, మైన్స్ ఏజీ విఘ్నేష్, అర్బన్ తహశీల్దార్ పీహెచ్ పాపా రావు, డీఈఈలు, గాయత్రీ ర్యాంపులను పరిశీలించారు. బోట్స్‌మెన్ సొసైటీ సభ్యు లతో మాట్లాడారు. ఇసుకతీత వెంటనే ప్రారంభించాల్సిన అవసరాన్ని వివరించారు. గాయంత్రీ 1, 3 ర్యాంపులను ఒక ర్యాంపుగానూ, 2, 4 ర్యాంపులను మరో ర్యాంపుగా నూ గుర్తించి కొలతలు వేయించారు. కానీ అక్కడ ఇప్పటికే సుమారు 20 బోట్స్‌మెన్ సొసైటీలకు అనుమతిచ్చారు. కానీ ఏ పాయింట్‌లో ఎవరు ఇసుక పోగుపెట్టాలనేది స్పష్టం చేయలేదు. అధికారుల సూచన మేరకు కొందరు సుమారు 15వేల టన్నుల ఇసుకను తీసి గుట్టపెట్టారు. రేపోమాపో మరికొందరు ఇసుక తీస్తారు. కానీ వీరంతా ఇసుక ఎక్కడ వేయాలనేది కూడా స్పష్టత లేకపోవడంతో అందరూ అయోమయంలో పడ్డారు. వీరికి డబ్బు ఎవరిస్తారనేది కూడా ఇంకా స్పష్టత లేదు. ఈనెల 11వ తేదీ తర్వాత బోట్స్‌మెన్ సొసైటీలన్నింటి ద్వారా ఇసుక తీయించడానికి ఓ ఏజెన్సీ వస్తుందనే ప్రచారం ఉంది. అప్పటివరకూ ఈ ఇసుక తీత ఓ తతంగం మాదిరిగానే ఉండవచ్చనే అంచనా ఉంది. త్వరలో ఓపెన్ ర్యాంపులు కూడా అమలులోకి రానున్నాయి. అవి సుమారు 31 వరకూ ఉండవచ్చు. వాటి నిర్వహణకు టెండర్లు పిలిచే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం.
అనుమతి మేరకు ఇసుక తీయాలి: జేసీ చినరాముడు
ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకు ఇసుక తీత, సరఫరా ఉండాలని జా యింట్ కలెక్టర్ ఎస్.చినరాముడు చెప్పారు. గాయత్రీ ర్యాంపులను పరిశీలించిన ఆయన బోట్స్‌మెన్ సొసైటీ సభ్యులతో మాట్లాడారు. మంగళవారం 15వేల టన్నుల ఇసుక తీసినట్టు బోట్స్‌మెన్ సొసైటీలు చెప్పాయి. ఈ ర్యాంపుల నుంచి రెండు లక్షల మెట్రిక్ టన్ను ఇసుక లభ్యత ఉంటుందని అధికారులు జేసీకి తెలిపారు. ప్రతిరోజూ ఇసుక సరఫరా సామర్ధ్యాన్ని పెంచాలని జేసీ ఆదేశించారు.
Updated Date - Oct 01 , 2024 | 11:58 PM