పంచాయతీ సర్పంచ్ చెక్‌పవర్ రద్దు
ABN, Publish Date - Oct 16 , 2024 | 12:19 AM
మండపేట మండలం ద్వారపూడి పంచా యతీ గ్రామ సర్పంచ్ ఈతకోట కిన్నెర చెక్‌పవర్‌ను రద్దు చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీలో నిర్మించిన సుబ్రహ్మణ్యేశ్వర షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో పాలకవర్గం అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలతో పాటు పంచాయతీ బైలాను అమలు చేయకుండా పాలకవర్గం ఇష్టానుసారం వ్యవహరించిన తీరును అధికారులు తప్పుబట్టారు.
మండపేట, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): మండపేట మండలం ద్వారపూడి పంచా యతీ గ్రామ సర్పంచ్ ఈతకోట కిన్నెర చెక్‌పవర్‌ను రద్దు చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీలో నిర్మించిన సుబ్రహ్మణ్యేశ్వర షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో పాలకవర్గం అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలతో పాటు పంచాయతీ బైలాను అమలు చేయకుండా పాలకవర్గం ఇష్టానుసారం వ్యవహరించిన తీరును అధికారులు తప్పుబట్టారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఫిర్యాదుపై జిల్లా పంచాయతీ అధికారి దర్యాప్తు చేయగా అవకతవకలు జరగడాన్ని గుర్తించారు. ఇందులో భాగస్వాములు అయిన సర్పంచ్ చెక్‌పవర్‌ను రద్దు చేయటంతో పాటు అప్పట్లో ఇక్కడ పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసిన ఇద్దరు కార్యదర్శులకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సర్పంచ్, ఉప సర్పంచ్.. గతంలో ఇక్కడ పనిచేసి మరో చోటుకు బదిలీ అయిన ఇద్దరు కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం దుకాణ సముదాయం నిర్మాణానికి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ప్రతిపాదనలు తయారు చేయాలి కానీ అలా జరగలేదు. పాలకవర్గం కనుసన్నల్లో దుకాణ సము దాయం పనులు చేపట్టి పూర్తి చేశారు. దీంతో పాటు షాపుల నిర్మాణం కోసం లబ్ధి దారుల నుంచి నగదు వసూలు చేశారు. ఈ మేరకు పాలకవర్గం వ్యవహార తీరు వల్ల పంచాయతీకీ తీవ్రనష్టం కలిగిందని నివేదికలో వెల్లడించారు. దీంతో నిబంధనలను అనుసరించి గ్రామ సర్పంచ్ ఈతకోట కిన్నెర చెక్‌పవర్‌ను మూడు నెలల పాటు రద్దు చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్ చెక్ పవర్‌ను రద్దుచేసిన నేపథ్యంలో ప్రస్తుతం మండపేట మండల ఈవోపీఆర్‌డీ దాసరి శ్రీనివాస్‌కు చెక్‌పవర్‌ను ఇచ్చారు. అప్పటిలో ఇక్కడ పనిచేసిన కార్యదర్శుల పాత్రపై కూడా విచారణ అనంతరం చర్యలు తప్పక పోవచ్చని తెలిసింది. ఇదిలా ఉండగా వైసీపీకి చెందిన సర్పంచ్ చెక్‌పవర్ పునరుద్ధరణ కోసం రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది..
Updated Date - Oct 16 , 2024 | 12:19 AM