వెబ్‌సైట్‌లో స్వర్ణాంధ్ర-2047
ABN, Publish Date - Sep 20 , 2024 | 12:55 AM
నీతి అయోగ్ సహకారంతో రూపొందించిన స్వర్ణాంధ్ర-2047 విజన్ ముసాయిదా నివేదికను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూపొందించిన వెబ్‌సైట్‌లో ప్రజలందరికీ అందుబాటులో ఉంచినట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ చెప్పారు.
అమలాపురం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): నీతి అయోగ్ సహకారంతో రూపొందించిన స్వర్ణాంధ్ర-2047 విజన్ ముసాయిదా నివేదికను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూపొందించిన వెబ్‌సైట్‌లో ప్రజలందరికీ అందుబాటులో ఉంచినట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ చెప్పారు. అన్నివర్గాల ప్రజల సలహాలు, సూచనలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దీనికి అనుగుణంగా వచ్చే ఐదేళ్లలో జిల్లా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం అమరావతి నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించగా కలెక్టరేట్ నుంచి మహేష్‌కుమార్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ ముసాయిదాకు అనుగుణంగా జిల్లా, మండలస్థాయిల్లో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించే అంశాలపై కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ నెల 21 నుంచి అక్టోబరు 5 వరకు విజన్ ముసాయిదా ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. నెలాఖరు నాటికి మండలస్థాయిలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. స్థానికంగా లభించే వనరులు, విలువ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయ, ఉద్యాన, ఆక్వారంగం తదితర అంశాలను పొందుపరుస్తూ జిల్లా యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేయాలని కలెక్టర్లకు సూచించారు. పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించి క్రోడీ కరించాలన్నారు. దీనిలో భాగంగా పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయిల్లో వ్యాసరచన, వృక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. జిల్లా అధికారులందరికీ సీపీవో సహకరిస్తారని, మండల, జిల్లా స్థాయిల్లో డేటా సమగ్రత స్థిరత్వాన్ని పక్కాగా నిర్థారించుకోవాలన్నారు. తుది ముసాయిదాను అక్టోబరు 22న ముఖ్యమంత్రికి సమర్పిస్తామన్నారు. 2024-29 జిల్లా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి సమ్మిళిత వృద్ధి సాధనకు అందరూ అంకితభావంతో కృషి చేయాలని కోరారు.
Updated Date - Sep 20 , 2024 | 07:48 AM