టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు
ABN, Publish Date - Sep 28 , 2024 | 11:47 PM
జిల్లాలో టెంపుల్ టూరిజంతో పాటు ఎకో టూరిజం అభివృద్ధి ద్వారా సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. పర్యాటక రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
అమలాపురం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో టెంపుల్ టూరిజంతో పాటు ఎకో టూరిజం అభివృద్ధి ద్వారా సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. పర్యాటక రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి అధికారులతో కోనసీమలో ఇప్పటికే స్థాపించిన టూరిజం కేంద్రాల నిర్వహణ స్థితిగతులపై కలెక్టర్ సమీక్షించారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోటిపల్లి, పాశర్లపూడి, ఆదుర్రు, అంతర్వేది, ఎస్.యానాం, దిండి ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలు విశేషంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయన్నారు. జిల్లాలో 17 బీచ్ పాయింట్లు ఉన్నాయని, వీటికి అనుబంధంగా పర్యాటకరంగ అభివృద్ధికి అనువైన వాతావరణం ఉన్నదీ లేనిదీ క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించాలన్నారు. పర్యాటక ప్రదేశాలను కలిపి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలన్నారు. టూరిజంతో పాటు ఇతర రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎందరికో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. టెంపుల్ టూరిజానికి నూతనంగా ప్రవేశపెట్టిన స్వదేశీదర్శన్, ప్రసాద్ దర్శన్ పథకాలకు స్థానిక ప్రాంతాలు అనువైనదీ కానిదీ గుర్తించాలన్నారు. ఐదు టూరిజం ప్రాజెక్టులకు బోటింగ్ టెర్మినల్ జెట్టీలు, బార్ అండ్ రెస్టారెంట్‌లు, రిసార్ట్స్‌లు ఉన్నదీ లేనిదీ ఆరా తీశారు. కేవలం దిండి రిసార్ట్స్‌లో మాత్రమే ఉన్నట్టు అధికారులు వివరించారు. గోగుల్లంక, పశువుల్లంక, చింతలమోరి, శివకోడులంకల్లో కూడా పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశాలు పరిశీలించాలన్నారు. జిల్లా ఇన్‌చార్జి పర్యాటక అధికారి డి.వెంకటాచలం, ప్రాంతీయ సంచాలకుడు స్వామినాయుడు, డివిజనల్ మేనేజర్ పవన్‌కుమార్, మేనేజర్ గంగబాబు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారుల అంశంపై సమీక్ష
ప్రాంతాల మధ్య ఆర్థిక ప్రగతి బహుముఖంగా విస్తరించడానికి జాతీయ రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. రహదారి విస్తరణ, అభివృద్ధికి సంబంధించి ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులు సామాజిక బాధ్యతతో తమవంతు సహకారం అందించాలన్నారు. కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం జాతీయ రహదారులకు సంబంధించిన ఇంజనీర్లు రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పాశర్లపూడి-దిండి వరకు నిర్వహిస్తున్న రహదారి విస్తరణ అభివృద్ధి పనులకు సంబంధించి అభ్యంతరాలు, పెండింగ్ అంశాలపై సమీక్షించారు. మూడేళ్ల కిత్రం ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులు ప్రస్తుతం నష్టపరిహారం పెంచాలని అభ్యంతరాలు లేవనెత్తుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ ద్వారా సమగ్రాభివృద్ధికి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. జిల్లాలో జాతీయ రహదారి పాశర్లపూడి-దిండి రోడ్డు విస్తరణ, జాతీయ రహదారులు, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో మొదటి ప్యాకేజీ విస్తరణ పనులు 2022 నవంబరులో పూర్తి అయ్యాయని, రెండో ప్యాకేజీ దిండి నుంచి ప్రారంభమైందన్నారు. భూసేకరణకు ఎదురైన ఇబ్బందులపై చర్చించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, మంత్రిత్వశాఖ పీడీ సాయిశ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ బి.రాము, రామకృష్ణ, సీహెచ్‌ఎన్‌వీ కృష్ణారెడ్డి, ఈఈ రవికుమార్, ఈఈ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Updated Date - Sep 28 , 2024 | 11:47 PM