ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పల్లెలు.. డిజిటల్‌

ABN, Publish Date - Dec 07 , 2024 | 12:13 AM

పంచాయతీల్లో ఇకపై డిజిటల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు వేగంగా, పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందనున్నాయి. జనన, మరణ ధృవీకరణ పత్రాలు కావాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే చాలు రెండు, మూడు రోజుల్లోనే జారీ కానున్నాయి

  • జనవరి నుంచి స్వర్ణ పంచాయతీల్లో డిజిటల్‌ సేవలు

  • ప్రజలకు వేగంగా.. పారదర్శకంగా సేవలు

  • ఆన్‌లైన్‌లో జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ

  • ఎక్కడి నుంచైనా ఆస్తిపన్ను చెల్లింపులకు అవకాశం..

  • వ్యాపార లైసెన్సులు పొందేందుకు వీలు

  • పంచాయతీ కార్యదర్శలకు డిజిటల్‌ కీ

  • రెండు, మూడురోజుల్లోనే సర్టిఫికెట్లు పొందొచ్చు

పంచాయతీల్లో ఇకపై డిజిటల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు వేగంగా, పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందనున్నాయి. జనన, మరణ ధృవీకరణ పత్రాలు కావాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే చాలు రెండు, మూడు రోజుల్లోనే జారీ కానున్నాయి. ఆన్‌లైన్‌లోనే ఆస్తిపన్ను చెల్లించొచ్చు.. వ్యాపార లైసెన్సులు కూడా పొందొచ్చు.. వీటికి సంబంధించి కార్యదర్శులకు డిజిటల్‌ కీ అందుబాటులోకి రానుంది. దీంతో ఏ ధ్రువీకరణ పత్రం కావాలన్నా ఆన్‌‘లైన్‌క్లియర్‌’గా ఉండనుంది. ఉమ్మడి జిల్లాల పరిధిలోని అన్ని పంచాయతీల్లో ఈ డిజిటల్‌ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

కార్పొరేషన్‌(కాకినాడ)/మండపేట, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 62 మండలాలు 1103 పంచాయతీలున్నాయి. అన్ని పంచాయతీల్లో కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. పంచాయతీలు జారీ చేసే వివిధ ధృవీకరణ పత్రాల కోసం నిరీక్షించాల్సిన అవసరంలేదు. సులభంగా సర్టిఫికెట్లు పొందేలా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కొత్తవిధానానికి శ్రీకారం చుట్టింది. మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే వాటిని కార్యదర్శులు పరిశీలించి డిజిటల్‌ సంతకాలు చేస్తారు. అనంతరం మీసేవా కేంద్రాల నుంచి సర్టిఫికెట్లు తీసుకునేలా చర్యలు చేపట్టారు.

కొత్త విధానం ఇలా..

పంచాయతీల ద్వారా జనన, మరణ ధృవీకరణ పత్రాలను మాన్యువల్‌ పద్ధతిలోనే జారీ చేస్తున్నారు. కొత్త విధానంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే అందులో నమోదు చేసిన ఫోన్‌ నెంబర్‌కి దరఖాస్తు సంఖ్య మెసేజ్‌ రూపంలో వస్తుంది. పత్రం సిద్ధం కాగానే దరఖాస్తుదారుడి ఫోన్‌ నెంబర్‌కు మెసేజ్‌ రూపంలో సమాచారం అందుతుంది. కొత్త విధానం అమల్లోకి రావడంతో పంచాయతీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. రెండు, మూడు రోజుల వ్యవధిలో సర్టిఫికెట్లు పొందడానికి అవకాశం ఉంటుంది.

ఎక్కడినుంచైనా చెల్లించవచ్చు

ప్రపంచంలో ఎక్కడ, ఏమూల ఉన్నా మీ సొంత ఊళ్లోని మీ ఇంటికి ఏటా ఆస్తిపన్ను చెల్లించాలంటే ఇక పంచాయతీ వరకు వెళ్లనక్కర్లేదు. ఉన్నచోటునుంచే నేరుగా ఆన్‌లైన్‌లో ఆస్తిపన్ను చెల్లించవచ్చు. జనవరి నుంచి స్వర్ణ పంచాయతీల్లో భాగంగా డిజిటల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వ్యాపార లైసెన్సులు, భవన నిర్మాణ అనుమతులు, వివాహ, జనన, మరణ ధృవీకరణ పత్రాలు ఇలా పలు సేవలను ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు.

పంచాయతీల్లో పీఓఎస్‌ పరికరాలు

ఆస్తిపన్ను వసూళ్లకు పంచాయతీల్లో పాయిం ట్‌ ఆఫ్‌ సేల్‌(పీవోఎస్‌) పరికరాలు సిద్ధం చేస్తున్నారు. వీటితో డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా బకాయిలు చెల్లించచ్చు. మరికొన్ని చోట్ల క్యూఆర్‌ కోడ్‌ద్వారా పన్ను బకాయిలు వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలనుంచి వసూ లు చేసిన మొత్తాలు పంచాయతీల పీడీ ఖాతా ల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

తొలి దశలో ముఖ్యమైన సేవలు

పంచాయతీల్లో తొలిదశలో ముఖ్యమైన సేవ లు ఆన్‌లైన్‌లోనే అందించనున్నారు. ఆస్తి విలువ ధ్రువీకరణ పత్రాలు, వ్యాపార లైసెన్సులు జారీ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జనన, మరణ, వివాహ ధ్రువీకరణ పత్రాలు, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు నిరభ్యంతర ధృవీకరణపత్రాలు, భవన నిర్మాణాలకు అనుమతులు ఆన్‌లైన్‌లో అందించనున్నారు. పంచాయతీల్లో అందించే 80 సేవలను క్రమంగా స్వర్ణ పంచాయతీ పోర్టల్లో అందుబాటులో పెట్టనున్నారు.

పోర్టల్‌ నిర్వహణలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం

ప్రజలకు సత్వరం సేవలు అందించే ఉద్దేశ్యం తో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం డిజిటల్‌ పంచాయతీలను అభివృద్ధి చేసి ఒక పోర్టల్‌ తీసుకొచ్చింది. దీని నిర్వహణను అప్పట్లో నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ)కి అప్ప గించింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్‌ఐసీ నిధులు ఇవ్వకపోవడంతో పోర్టల్‌ నిర్వహణ మూలనపడింది. కూటమి ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ నిర్వహణను రాష్ట్ర ఆర్థిక నిర్వహణ, సేవల సంస్థకు అప్పగిస్తోంది.

కార్యదర్శుల వివరాల సేకరణ పూర్తి..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 62 మండలాలు 1103 పంచాయతీలున్నాయి. అన్ని పంచాయతీల్లో కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శుల డిజిటల్‌ సంతకాలను బయోమెట్రిక్‌తో నమోదు చేశారు. డిజిటల్‌ టోకెన్లను జారీ చేయడానికి కార్యదర్శుల డిజిటల్‌ సంతకాలు, వివరాలను కంప్యూటర్‌ ఆపరేటర్‌ సేకరించారు. ప్రతి కార్యదర్శికి సంబంధించి సమగ్ర వివరాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే డిజిటల్‌ సంతకాల సేకరణ పూర్తి కాగా కార్యదర్శులకు డిజిటల్‌ కీలను జిల్లా ఉన్నత అధికారులు అందజేశారు.

Updated Date - Dec 07 , 2024 | 12:13 AM