చెత్త తరలింపును అడ్డుకున్న వార్డు ప్రజలు
ABN, Publish Date - Nov 14 , 2024 | 12:56 AM
45రోజుల అనంతరం బండారులంకలో ట్రాక్టర్లపై చెత్తను సేకరించారు. గతంలో అధికారులు ఇచ్చిన హామీ మేరకు చెత్తను పాత ప్రాంతంలో డంపింగ్ చేయడానికి వీలులేదంటూ 16వవార్డు ప్రజలు బుధవారం స్థానిక వీరభద్రస్వామి గుడి సెంటర్‌లో ఆందోళనకు దిగారు.
అమలాపురంరూరల్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): 45రోజుల అనంతరం బండారులంకలో ట్రాక్టర్లపై చెత్తను సేకరించారు. గతంలో అధికారులు ఇచ్చిన హామీ మేరకు చెత్తను పాత ప్రాంతంలో డంపింగ్ చేయడానికి వీలులేదంటూ 16వవార్డు ప్రజలు బుధవారం స్థానిక వీరభద్రస్వామి గుడి సెంటర్‌లో ఆందోళనకు దిగారు. అప్పటికే ఆర్డీవో కె.మాధవి ఆదేశాల మేరకు పోలీసులు, ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తర్జనభర్జనలు జరిగాయి. చివరకు పోలీసులు టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు పిచ్చిక శ్యామ్‌తో సహా 40మందిని అదుపులోకి తీసుకుని తాలూకా పోలీసుస్టేషన్‌కు తరలించారు. గ్రామంలోని చెత్తను యథావిధిగా డంపింగ్ యార్డుకు ట్రాక్టర్లతో తరలించే కార్యక్రమం పంచాయతీ చేపట్టింది.
ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని..
అమలాపురం ఆర్డీవో కె.మాధవి, డీఎల్‌పీవో పి.బొజ్జిరాజు, తహశీల్దార్ కిశోర్‌బాబుతో సహా పలువురు అధికారులు గ్రామపెద్దలతో చర్చలు జరిపారు. సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో పాటు పేరుకుపోయిన చెత్తతో ప్రజారోగ్యం దెబ్బతింటుందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆర్డీవో ఆదేశాలతో బుధవారం ఉదయం డివిజన్, మండలస్థాయి అధికారులు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు గ్రామానికి చేరుకున్నారు. అమలాపురం తాలూకా, అల్లవరం, ఉప్పలగుప్తం ఎస్‌ఐలు వై.శేఖర్‌బాబు, జి.హరీష్, రాజేష్, చిరంజీవి, పోలీసు బలగాలు, ప్రత్యేక బలగాలు గ్రామానికి చేరుకున్నాయి. ప్రజారోగ్యం దృష్ట్యా చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నామని చెప్పి ట్రాక్టర్లపై ప్రత్యేకంగా నియమించిన సిబ్బందితో చెత్తను సేకరించారు. అప్పటికే వీరభద్రస్వామి గుడిసెంటర్‌లో వార్డుప్రజలు చేరుకుని ట్రాక్టర్లను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు టీడీపీగ్రామకమిటీ అధ్యక్షుడు శ్యామ్‌తో సహా పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. వ్యక్తిగత పూచీకత్తులపై విడిచిపెడతామని పోలీసులు చెప్పినప్పటికీ సమస్యను పరిష్క రించాలని, చెత్తవేయకుండా ఇచ్చిన హామీని అమలు చేయాలని, తమను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని వారంతా రాత్రివరకు భీష్మించుకుని పోలీసుస్టేషన్‌లోనేఉండిపోయారు. మాజీ జడ్పీటీసీ శంకరమూర్తి పోలీసుస్టేషన్‌కు చేరుకుని అధికారులతో చర్చిస్తున్నారు.
Updated Date - Nov 14 , 2024 | 12:56 AM