తినేస్తున్నారు..!
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:59 PM
మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు అందినకాడికి దోచేస్తున్నారు. అడిగేవారే లేరని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.
మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో ఏజెన్సీ దోపిడీ
పిల్లల సంఖ్యకు.. బియ్యం కోటాలో తేడాలు
వంట మనుషుల గౌరవ వేనంలోనూ నొక్కుడే
ఆదోని అగ్రికల్చర్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు అందినకాడికి దోచేస్తున్నారు. అడిగేవారే లేరని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ పురపాలక ఉన్నత పాఠశాలలో 1952 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండడంతో భారీగా మిగులుతుందని వంట నిర్వహణకు పోటీ పడ్డారు. వైసీపీ ప్రభుత్వం మారి కూటమి అధికారంలోకి రావడంతో వంట ఏజెన్సీ నిర్వాహకులను కూడా మార్చారు. అధికార పార్టీకి చెందిన ఓ మహిళ నాయకురాలు తన డ్రైవర్‌కు చెందిన మహాలక్ష్మి గ్రూప్ ఏజెన్సీకి వంట చేసే బాధ్యతను అప్పగించేలా చేసుకున్నారు. సెప్టెంబరు 1 నుంచి మహాలక్ష్మి గ్రూప్ చెందిన భరత అనే వ్యక్తి వంట చేసే బాధ్యతను తీసుకున్నారు. 1952 మంది విద్యార్థుల్లో 150 మందిని డ్రాప్‌ఔట్ కింద చూపుతున్నారు. 1800 మంది ఉన్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. శుక్రవారం 1321వ ుంది విద్యార్థులు బడికి హాజరయ్యారు. 1140 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నట్లు ఆనలైనలో పొందుపరిచారు.
ఫ 70 కేజీల బియ్యం ఎక్కడికి వెళ్లినట్లు..?
1321 మంది హాజరైతే 1140 మధ్యాహ్న భోజనం తింటున్నట్లు లెక్కలు చూపిస్తూ.. ఒక్కో విద్యార్థికి 150 గ్రాముల చొప్పున బియ్యం ప్రభుత్వం అందిస్తోంది. ఈ లెక్కన 171 కేజీల బియ్యాన్ని విద్యార్థులకు వడ్డించాల్సి ఉంది. మరి గురువారం వంద కేజీల బియ్యం మాత్రమే వండారు. అంటే మిగతా 71 కేజీల బియ్యం ఎక్కడికి వెళ్లాయో తెలియాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క రోజే కాదు ప్రతిరోజూ విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న లెక్కల్లో, బియ్యం కొలతల్లోనూ వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫ గౌరవ వేతనంలోనూ నొక్కుడే..
1800 మంది విద్యార్థులు ఉండడంతో పది మందికి ఓ కుక్, హెల్పర్లను నియమించుకోవచ్చని ఏజెన్సీలకు సూచించింది. ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల గౌరవ వేతనం అందిస్తోంది. పూర్తిగా వారి గౌరవేతనం డ్రా చేస్తున్నప్పటికీ వంట చేసేది మాత్రం కేవలం ఆరుగురు మాత్రమే. ఇందులోనూ నెలకు రూ.12 వేలు నొక్కేస్తున్నారు.
ఫ ప్రభుత్వమే అన్ని ఇస్తున్నా..
కూటమి ప్రభుత్వం మారాక మధ్యాహ్న భోజన పథకం మెనూలో భారీగా మార్పులు చేసింది. గురువారం ఆకుకూర పప్పు, అన్నంతో పాటు గుడ్డు అందించాలి. బియ్యం, గుడ్డు ప్రభుత్వమే నేరుగా పాఠశాలలకు కాంట్రాక్టర్ ద్వారా సరఫరా చేస్తోంది. వంట చేసేందుకు, ఇతర ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థికి రూ.8.17 పైసలను చెల్లిస్తోంది. ఈ లెక్కన్న రోజుకు రూ.9313 విద్యార్థుల సంఖ్యను బట్టి వారికి చెల్లిస్తోంది. అయినప్పటికీ ఏజెన్సీ నిర్వాహకులు భారీగా దోచేస్తున్నారు.
ఫ విద్యార్థుల హాజరు అడిగితే హెచఎం చిందులు
విద్యార్థుల హాజరు అడిగితే ఆంధ్రజ్యోతిపై హెచఎం చిందులు వేశారు. విద్యార్థుల హాజరు.. భోజనం తింటున్న విద్యార్థుల సంఖ్య, భోజనం తయారీకి బియ్యం వేసిన లెక్కను అడిగితే ఆ పాఠశాల హెచఎం అలిం సిద్ధికి అసహనం వ్యక్తం వేశారు. తన పర్మిషన లేకుండా ఎలా వస్తారని, ఏదైనా వివరాలు కావాలంటే రాతపూర్వకంగా ఇవ్వాలంటూ ఎదురు దాడికి దిగారు. ‘మీకెందుకు చెప్పాలి.. మాకు నిబంధనలు ఉన్నాయి. అంటూ రిపోర్టర్ ఫొటోను తన సెల్ ఫోనలో తీసుకున్నారు.
ఫ కొరవడిన పర్యవేక్షణ
విద్యాశాఖ అధికారులు తూతూ మంత్రంగా మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షణ చేసి వెళుతున్నారు. పాఠశాల హెచఎం, వంట ఏజెన్సీ వారు చెప్పిందే లెక్క.. గుడ్డిగా సంతకం చేసి తనిఖీ చేసినట్లు వెళ్లిపోతున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. ఇంత తతంగం జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
నిబంధనలు పాటించకపోతే చర్యలు
- శ్యామ్యూల్ పాల్, డీఈఓ, కర్నూలు
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులకు భోజనం వడ్డించాలి. ప్రభుత్వం మధ్యాహ్నం భోజన పథకంలో ఖచ్చితమైన నిబంధనలు పాటించాలని సూచించింది. పాఠశాలలోని విద్యార్థులంతా భోజనం చేసేలా వారిని ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. వంట ఏజెన్సీలు సైతం మెనూ పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా వంట మనిషితో పాటు సహాయకులు ఉండాల్సిందే. నిబంధనలు పాటించకుండా బియ్యం వినియోగంలో తారతమ్యం ఉంటే సహించే ప్రసక్తే లేదు. చర్యలు తీసుకుంటాం. ఆ పాఠశాలలో విద్యార్ధులు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన రికార్డులను తెప్పించుకుని పరిశీలిస్తాం.
Updated Date - Nov 29 , 2024 | 11:59 PM