విద్యారంగం బలోపేతానికి కృషి చేస్తా
ABN, Publish Date - Nov 10 , 2024 | 11:56 PM
జిల్లాలో విద్యారంగం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు.
ఎంపీ బస్తిపాటి నాగరాజు
కర్నూలు ఎడ్యుకేషన్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విద్యారంగం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. ఆదివారం స్థానిక టౌన మోడల్ హై స్కూల్‌లో జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన పదవి విరమణ చేసిన ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విద్యార్ధుల ఎదుగుదలలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణత పెంచాలని, అందుకు అవసరమైన మెటీరియల్స్‌ను, బుక్స్‌ను తన ఎంపీ నిధులతో విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు. అనంతరం జిల్లాలో 2024 జనవరి నుంచి అక్టోబరు నెల వరకు పదవీ విరమణ పొందిన 25 మంది ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులను ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామూల్ పాల్, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి హనుమంతరావు, ఎంఈవో ఓంకార్ యాదవ్, సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణ, కోశాధికారి హుశేన, చంద్రశేఖర్, రామచంద్రరెడ్డి, గోవిందరెడ్డి, ఆదాం బాషా, నాగరాజు, వనజ కుమారితో పాటు ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 10 , 2024 | 11:56 PM