AP Election 2024: అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు: చంద్రబాబు
ABN, Publish Date - Apr 13 , 2024 | 06:09 PM
ఎంతమంది వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నాడు. ఏపీ ఎన్నికలు 2024 ప్రచారంలో భాగంగా తాడికొండలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగన్ లాంటివాళ్లు వెయ్యి మంది వచ్చినా రాజధానిని కదల్చలేరని అన్నారు. వైసీపీ సర్కార్ రాజధాని రైతులను ఇబ్బందులు పెట్టారని పేర్కొన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా మారుస్తామని హామీ ఇచ్చారు.
తాటికొండ: ఎంతమంది వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నాడు. ఏపీ ఎన్నికలు 2024 (AP Election 2024) ప్రచారంలో భాగంగా తాడికొండలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగన్ లాంటివాళ్లు వెయ్యి మంది వచ్చినా రాజధానిని కదల్చలేరని అన్నారు. వైసీపీ సర్కార్ రాజధాని రైతులను ఇబ్బందులు పెట్టారని పేర్కొన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా మారుస్తామని హామీ ఇచ్చారు.
కేంద్రంలో మళ్లీ ఎన్డీఏనే వస్తుందని చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు. తాను వచ్చాక మళ్లీ ప్రజావేదికను నిర్మిస్తానని చెప్పారు. జగన్ సభలకు రూ.కోట్లు ఖర్చు చేసినా జనం రావడం లేదని ఎద్దేవా చేశారు. జగన్ పాలనతో ఈ రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ సర్కార్‌పై కక్ష తీర్చుకునే అవకాశం వచ్చిందని అన్నారు. ‘‘ నేను సీఎంగా ఉంటే 2020లోనే పోలవరం పూర్తయ్యేది. పోలవరం పూర్తి చేశాక నదుల అనుసంధానం చేద్దామనుకున్నాను. వైసీపీ నేతలకు కమిషన్లు ఇవ్వలేక పరిశ్రమలు పారిపోయాయి. రాష్ట్ర యువతకు వైసీపీ తీరని ద్రోహం చేసింది’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
కూటమి పాలనలో ఉద్యోగులు, పోలీసులను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని, బడికి రంగులు వేస్తే విద్యావ్యవస్థ మారిపోతుందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను జగన్ మోసం చేశారని ధ్వజమెత్తారు. ప్రజలంతా అండగా ఉంటే రాష్ట్రాన్ని బాగు చేసుకోవచ్చునని పేర్కొన్నారు.
జూన్ 4న ఇక్కడే విజయోత్సవాలు చేసుకుందాం
నాలుగు భవనాలు కడితే రాజధాని పూర్తయినట్లా? అని వైఎస్ జగన్ సర్కారుని చంద్రబాబు నిలదీశారు. రాజధాని అంటే ఆంధ్రు ఆత్మగౌరవం.. ఆత్మవిశ్వాసం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు పోటీగా అమరావతిని నిర్మించాలని అనుకున్నానన్నారు. ‘‘ నేను, పవన్, మోదీ కలిసి అమరావతిని అభివృద్ధి చేస్తాం. జూన్ 4న ఇక్కడే విజయోత్సవాలు చేసుకుందాం. అమరావతి రక్షణ.. జగనాసుర వధ రెండూ జరుగుతాయి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
‘‘ ఇది తాడికొండ కాదు.. ఇది అమరావతి.. రాజధాని ప్రాంతం. అమరావతికి వచ్చా.. అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నా. అమరావతిని ఎవరూ కూడా కదల్చలేరు. అమరావతికి కేంద్రం కూడా సహకరించింది. ఎన్నికలకు మరో నెల రోజుల సమయం ఉంది. గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు వచ్చే పరిస్థితి లేదు. అమరావతి కోసం 29 వేల మంది రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారు. సైబరాబాద్ నిర్మించి హైదరాబాద్‌ను మహానగరంగా మార్చాను. అమరావతిని కూడా హైదరాబాద్‌లా మారుద్దామని ప్రణాళికలు వేశాం. విజయవాడ, గుంటూరుతో కలిపి ఆదర్శ రాజధాని చేయాలనుకున్నాను. ప్రపంచ దేశాలన్నీ అమరావతి వైపు చూడాలని ఆలోచించాను’’ అని చంద్రబాబు అన్నారు.
జన్మభూమికి సేవ కోసమే పెమ్మసాని పోటీ: చంద్రబాబు
జన్మభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే పెమ్మసాని ఇక్కడ పోటీ చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సంపద సృష్టించే కేంద్రంగా అమరావతిని తయారు చేయాలనుకున్నానని, ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. యువతకు ఇక్కడే ఉపాధి కల్పించాలని అనుకున్నానని, కానీ జగన్ వచ్చాక రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చివేశారని పేర్కొన్నారు. 3 ముక్కలాట ఆడుతూ తమాషాలు చేస్తున్నారని జగన్ సర్కారుని ఆయన హెచ్చరించారు. తానేం చెప్పినా జనం నమ్మేస్తారని జగన్ అనుకుంటున్నారని, ఆ భ్రమలన్నీ ఈ ఎన్నికల ద్వారా తేలిపోతుందని చెప్పారు.
Updated Date - Apr 13 , 2024 | 06:22 PM