Mukesh Kumar Meena: అప్రమత్తంగా ఉండండి
ABN, Publish Date - Jun 02 , 2024 | 06:24 AM
ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజున, ఆ తర్వాత అత్యంత శ్రద్ధతో శాంతిభద్రతలను పరిరక్షించడం అవశ్యం అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు. శనివారం ఈ మేరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలకు ఆయన లేఖ రాశారు.
ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలకు మీనా లేఖ
అమరావతి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజున, ఆ తర్వాత అత్యంత శ్రద్ధతో శాంతిభద్రతలను పరిరక్షించడం అవశ్యం అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు. శనివారం ఈ మేరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలకు ఆయన లేఖ రాశారు.
ఇప్పటి వరకు ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, చాలా వరకు శాంతియుతంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరినీ ప్రశంసిస్తూ మీనా ధన్యవాదాలు తెలిపారు. ఆ లేఖలో... ‘ఎన్నికల ప్రక్రియ ఓట్ల లెక్కింపు అనే క్లిష్టమైన దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎంతో వ్యూహాత్మకంగా సవాళ్లను ఎదుర్కోవాలి.
తీవ్రమైన పోటీ కారణంగా భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజన, తర్వాత అత్యంత శ్రద్ధతో శాంతిభద్రతలను నిర్వహించాలి. కౌంటింగ్ కేంద్రాల్లో ఆటంకాలు తలెత్తితే వాటిని ధృఢంగా, నిర్ణయాత్మకంగా పరిష్కరించాలి.
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించే లేదా ఆర్‌వో ఆదేశాలను పాటించడంలో విఫలమైన ఏ వ్యక్తిని అయినా ఓట్ల లెక్కింపు స్థలం నుంచి పంపించే అధికారం ఉంది. రాజకీయంగా సున్నితమైన ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలను కఠినంగా అదుపు చేయాలి.
సమస్యాత్మక ప్రాంతాలను, ఇబ్బంది కలిగించే వారిని నిరంతరం పర్యవేక్షించాలి. తప్పుడు వార్తలు, పుకార్లను వెంటనే ఖండించాలి. ఈ కీలకమైన కాలంలో శాంతిభద్రతలను కాపాడుకోవడంలో చేసే ప్రయత్నాలు ఎంతో అమ్యూలమైనవి. మీరంతా సమిష్టిగా సవాళ్లను ఎదుర్కొంటారనే నమ్మకం నాకు గట్టిగా ఉంది’ అని మీనా పేర్కొన్నారు.
Updated Date - Jun 02 , 2024 | 07:02 AM