ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉధృతంగానే ఏలేరు వరద

ABN, Publish Date - Sep 12 , 2024 | 04:01 AM

ఏలేరు రిజర్వాయర్‌ నుంచి వరద జలాల విడుదల గణనీయంగా తగ్గించినా కాకినాడ జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది.

ముంపులోనే 65 గ్రామాలు

హైవేపై కొనసాగుతున్న నీరు

వాహనాల రాకపోకలపై ఆంక్షలు

పిఠాపురానికి పెరిగిన ముంపు

కిర్లంపూడిలో ఒకరి గల్లంతు

పిఠాపురం/ఏలేశ్వరం, సెప్టెంబరు 11: ఏలేరు రిజర్వాయర్‌ నుంచి వరద జలాల విడుదల గణనీయంగా తగ్గించినా కాకినాడ జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. 8 మండలాల పరిధిలోని 65 గ్రామాల్లో పంట పొలాలు ముంపులోనే కొనసాగుతున్నాయి. కాకినాడ-కత్తిపూడి మధ్య గల 216వ జాతీయ రహదారిపై పిఠాపురం, గొల్లప్రోలు వద్ద, ఇతర ప్రధాన రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగిస్తున్నారు. పిఠాపురం, గొల్లప్రోలు బైపా్‌సరోడ్డు, పట్టణాల పరిధిలోని పంటపొలాలు వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు ఏలేరు ప్రాజెక్టులో నీటినిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఇన్‌ఫ్లో తగ్గడంతో ఏలేరు కాల్వలకు నీటి విడుదల కూడా తగ్గించారు. అయినప్పటికీ ముంపు తగ్గలేదు. ఏలేరు ఆయకట్టుకు శివారు ప్రాంతంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ముంపు ప్రభావం పెరిగింది. దీంతోపాటు కొత్తపల్లి మండలాన్ని కూడా వరద ముంచెత్తుతోంది.

నేడు మరింత పెరిగే చాన్స్‌

పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలతోపాటు కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురం, సామర్లకోట, ఏలేశ్వరం మండలాల్లో పంటపొలాలు, పలు గ్రామాల్లో గృహాలు వరద నీటిలోనే ఉన్నాయి. ఎగువ ప్రాంతాలనుంచి వస్తున్న వరద నీరు పిఠాపురం, గొల్లప్రోలు మండలాల మీదుగా కొత్తపల్లి మండలానికి చేరుతోంది. ఈ మండలంలోని 4 గ్రామాల్లో 750 ఇళ్లు ముంపులో చిక్కుకున్నాయి. పంటపొలాలు కూడా ముంపునకు గురయ్యాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వరద తీవ్రత పెరుగుతూనే ఉంది. ఈ మండలం మీదుగానే వరద జలాలు సముద్రంలో కలుస్తాయి. దీంతో గురువారం ఇక్కడ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కాకినాడ-కత్తిపూడి మధ్య 216వ జాతీయరహదారిపై పిఠాపురం బైపా్‌సరోడ్డు అగ్రహారం, ఇల్లింద్రాడవద్ద, గొల్లప్రోలు టోల్‌గేటుకు ఇరువైపులా ఏలేరు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గురువారానికి జాతీయ రహదారిపై వరద పూర్తిగా తగ్గుతుందని భావిస్తున్నారు. పిఠాపురం పట్టణంలోని కోర్టుల నుంచి ఇల్లింద్రాడ వరకు అర కిలోమీటరు మేర వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. కాకినాడ-కత్తిపూడి మధ్య సాయంత్రం నుంచి ఆర్టీసీ బస్సులను పాక్షికంగా పునరుద్ధరించారు. పిఠాపురం పట్టణంలోని రాపర్తిరోడ్డు, అగ్రహారం మెట్ట శివారు ప్రాంతాల్లోని ఇళ్లు కూడా ముంపునకు గురయ్యాయి.


నీటి నిల్వలు తగ్గుముఖం

ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గడంతో ఏలేరు ప్రాజెక్టులో నీటినిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇన్‌ఫ్లో తగ్గడంతో ఔట్‌ఫ్లో కూడా తగ్గాయి. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఏలేరు రిజర్వాయర్‌లోకి 2,275 క్యూసెక్కుల వరద వస్తుండగా దిగువకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి నిల్వ 24.11 టీఎంసీలకు గాను 21.80 టీఎంసీలుగా ఉంది. విశాఖ అవసరాల నిమిత్తం 275 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

అంత్యక్రియలకు యాతన

గొల్లప్రోలు పట్టణ శివారు సూరంపేట ప్రాంతానికి చెందిన ఇసరపు సూరిబాబు(62) బుధవారం మరణించారు. అయితే, ఏలేరు, సుద్దగడ్డ వరద నీటి కారణంగా అంతిమ సంస్కారాలకు ఇబ్బంది ఎదురైంది. దీంతో గొల్లప్రోలు తహసీల్దారు ఓ బోటును ఏర్పాటు చేసి మృతదేహాన్ని పట్టణంలోకి తీసుకువచ్చి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలావుంటే, కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన గొంతిన సుబ్బారావు(35) వరద నీటిలో గల్లంతయ్యారు. మంగళవారం రాత్రి వరద బాధితులకు భోజనం పంపిణీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఏలేరు వరద నీటి ప్రవాహంలో కొట్టుకు పోయినట్టు అధికారులు నిర్ధారించారు. బుధవారం ఉదయం ముంపు కాలనీలో ఓ చోట సుబ్బారావు మృతదేహం తేలియాడింది.

Updated Date - Sep 12 , 2024 | 04:01 AM

Advertising
Advertising