ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎర్రమట్టి దిబ్బలకు ఎసరు

ABN, Publish Date - Jul 17 , 2024 | 06:09 AM

భీమిలి కో-ఆపరేటివ్‌ సొసైటీకి కేటాయించిన భూములు ఎర్రమట్టి దిబ్బల్లోనే ఉన్నాయి. వారు అక్కడ లేఅవుట్‌ వేయడానికి 2016లో వుడా(ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ)కి దరఖాస్తు చేయగా, అనేక షరతులు విధించింది.

భీమిలిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు

గతంలో పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆందోళన

ప్రభుత్వం మారింది.. కానీ, ఆగని తవ్వకం

‘భీమిలి సొసైటీ’కి 373.95 ఎకరాలు

లేఅవుట్‌కు 2016లో వుడాకు దరఖాస్తు

ఈ దిబ్బలు వారసత్వ సంపద కావడంతో

సొసైటీకి పలు షరతులు పెట్టిన సంస్థ

అప్పటి నుంచి మౌనంగా ఉండి..

ఎన్నికలకు ముందు నుంచి పనులు

దిబ్బను చదువు చేస్తున్న భారీ యంత్రాలు

కూటమి ప్రభుత్వం వచ్చినా పడని బ్రేకులు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

భీమిలిలో భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలను ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలను తవ్వేసి వందల ఎకరాలను చదును చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో మొదలైన పనులు ఇప్పటికీ నిరాటంకంగా సాగడం గమనార్హం. గత ఏడాది వీఎంఆర్‌డీఏ అధికారులు ఎర్రమట్టి దిబ్బల సమీపంలో లేఅవుట్లకు అనుమతి ఇచ్చినప్పుడు కూడా ఇలాగే తవ్వేశారు. అప్పుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వచ్చి పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని, వైసీపీ నేతలు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అయినా, ఇప్పటికీ తవ్వకాలను వైసీపీ నేతలు కొనసాగడంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. భీమిలి మండలం నేరేళ్లవలస పంచాయతీ సర్వే నంబర్‌ 118 (పాత సర్వే నంబరు 49/1)లోని 1,067 ఎకరాల్లో ఎర్రమట్టి దిబ్బలు ఉండేవి. అందులో తూర్పు నౌకాదళం ఏర్పాటుచేసిన ఐఎన్‌ఎస్‌ కళింగకు 588 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఆ తరువాత భీమిలి మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీకి 373.95 ఎకరాలు ఇచ్చారు. మిగిలిన భూమిని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా భౌగోళిక వారసత్వ సంపదగా ప్రకటించింది. దానిని పరిరక్షించాలని ఆదేశించింది. '

ఆదేశాలు బేఖాతరు

భీమిలి కో-ఆపరేటివ్‌ సొసైటీకి కేటాయించిన భూములు ఎర్రమట్టి దిబ్బల్లోనే ఉన్నాయి. వారు అక్కడ లేఅవుట్‌ వేయడానికి 2016లో వుడా(ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ)కి దరఖాస్తు చేయగా, అనేక షరతులు విధించింది. ముందు భూ వినియోగ మార్పిడి ఫీజు చెల్లించాలని సూచించింది. దీనికి జిల్లా కలెక్టర్‌ నుంచి, ఏపీ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ జోన్‌ నుంచి, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి, నేషనల్‌ మాన్యుమెంట్‌ అథారిటీ నుంచి, రక్షణ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా సొసైటీదిగా చెబుతున్న భూమిలో వారసత్వ సంపదగా గుర్తించిన 94.65 ఎకరాలు ఉందని, అదిపోను 279.31 ఎకరాలు మాత్రమే సొసైటీదని వెల్లడించింది. లేఅవుట్‌ వేస్తే అందులో 75 ఎకరాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు లేఅవుట్‌ వేసి ఒక్కొక్కరికి 75 గజాలకు మించకుండా ప్లాట్లు కేటాయించాలని, వారంతా ఆర్థికంగా వెనుకబడిన వారే అయి ఉండాలని సూచించింది. జియో హెరిటేజ్‌ స్థలం పక్కనే ఉన్నందున బఫర్‌జోన్‌ ఏర్పాటు చేయాలని, భీమిలి బీచ్‌రోడ్డు అప్పటి మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 150 అడుగుల వెడల్పు ఉన్నందున ఆ మేరకు భూమి విడిచి పెట్టాలని సూచించింది. భూ విని యోగ మార్పిడి కింద సొసైటీ వుడాకు సుమారు రూ. 3కోట్లు వరకు అప్పుడు చెల్లించింది. అయితే మిగిలిన నిబంధనలు ఏవీ పాటించకపోవడంతో దరఖాస్తును వెనక్కి పంపారు. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ అక్కడ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇక్కడ లేఅవుట్‌ వేయడానికి ముందు వుడా నుంచి సొసైటీ నిర్వాహకులు అనుమతులు కోరారు. అక్కడే డబ్బులు కూడా కట్టారు. ఇప్పుడు పరిఽధి మారి జీవీఎంసీకి అధికారం కల్పించడంతో అక్కడ దరఖాస్తు చేసినట్టు తెలిసింది. అక్కడా లేఅవుట్‌ దరఖాస్తు సమర్పించలేదు. భూమి చదును చేయడానికి 5కోట్ల వరకు చెల్లించినట్టు సమాచారం. దీనిపై వీఎంఆర్‌డీఏ అధికారులను సంప్రతించగా, గతంలో చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని రెండురోజుల క్రితమే సొసైటీ దరఖాస్తు చేసిందని సీయూపీ తెలిపారు. జీవీఎంసీ ఎటువంటి అనుమతులు ఇచ్చిందో తెలుసుకోవడానికి చీఫ్‌ సిటీ ప్లానర్‌ సురేశ్‌కు ఫోన్‌ చేయగా, స్పందించలేదు.

ప్రస్తుతానికి పనులు ఆగాయి: భీమిలి తహసీల్దార్‌

అనుమతులు లేకుండా ఎర్రమట్టి దిబ్బల్లో పనులు జరుగుతున్నాయని భీమిలి తహసీల్దార్‌ దృష్టికి తీసుకువెళ్లగా, మంగళవారమే వెళ్లి పరిశీలించామని, ప్రస్తుతానికి వాటిని ఆపాల్సిందిగా చెప్పామని తెలిపారు. వారికి ఎటువంటి అనుమతులు ఉన్నాయో పరిశీలించి చెబుతామన్నారు. ఇది చారిత్రక వారసత్వ సంపద కలిగిన భూములున్న ప్రాంతం కావడంతో ఢిల్లీ స్థాయిలో అనుమతులు తీసుకోవలసిన అవసరం ఉంది. అవేమీ లేకుండానే గత మూడు నెలలుగా పనులు జరుగుతుంటే అధికారులు కళ్లు మూసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎర్రమట్టి దిబ్బలను తవ్వేసి వేలాది లారీల మట్టిని తరలించుకుపోయినా గనుల శాఖ అధికారులు కళ్లు అప్పగించి చూస్తున్నారు.

Updated Date - Jul 17 , 2024 | 06:09 AM

Advertising
Advertising
<