8,113 కోట్ల షాక్
ABN, Publish Date - Oct 01 , 2024 | 03:23 AM
జగన్ గద్దె దిగిపోయినా ఆయన నిర్వాకాలు జనాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. విద్యుత్ కొనుగోలులో అనుసరించిన అడ్డగోలు విధానాల భారం జనం నెత్తిన పడుతూనే ఉంది.
వెంటాడుతున్న జగన్ పాపాలు!
2023-24లో 11,826 కోట్ల వసూలుకూ అభ్యర్థన
రెండూ కలిపితే వినియోగదారులపై రూ.20,096 కోట్ల భారం
సర్‌చార్జీల వడ్డనకు సిద్ధమైన డిస్కమ్‌లు
18న ఏపీఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణ
గత ఏడాది ఏప్రిల్లోనే డిస్కమ్‌ల వినతి
ఎన్నికల ముందు బాదుడు ‘వాయిదా’
8,113 కోట్లపై ఏడాదిన్నరకు స్పందించిన కమిషన్
భగ్గుమంటున్న పార్టీలు, ప్రజాసంఘాలు
ఇంధన సర్దుబాటు చార్జీ.... ఈ పేరు వింటేనే విద్యుత్ వినియోగదారుల వెన్నులో వణుకు పుడుతుంది. ఎప్పుడో వాడుకున్న కరెంటుకు ఇప్పుడు ‘అదనపు’ బాదుడు! జగన్ సర్కారు ఒకే సమయంలో అనేక ‘సర్‌చార్జీ’లతో షాకులు ఇచ్చింది. రెండేళ్లకు సంబంధించిన సర్‌చార్జీ వసూలుపై ఎన్నికల ముందు మౌనంగా ఉన్న విద్యుత్ నియంత్రణ కమిషన్... ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణకు రంగం సిద్ధం చేసింది.
అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జగన్ గద్దె దిగిపోయినా ఆయన నిర్వాకాలు జనాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. విద్యుత్ కొనుగోలులో అనుసరించిన అడ్డగోలు విధానాల భారం జనం నెత్తిన పడుతూనే ఉంది. ఒక్క ఏడాదిలోనే జగన్ చేసిన పాపాల తాలూకు రూ.8,113.60 కోట్ల బాదుడు జనం నెత్తిన పడుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోళ్ల కోసం చేసిన ఈ మొత్తాన్ని ‘సర్దుబాటు’ పేరుతో వసూలు చేసేందుకు ప్రజాభిప్రాయం సేకరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) సిద్ధమైంది. అక్టోబరు 18న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటామని సోమవారం ఓ ప్రకటన జారీ చేసింది.
ఎన్నికల ముందు ‘వాయిదా’
2022-23లో విద్యుత్, బొగ్గు కొనుగోళ్ల అదనపు భారాన్ని వినియోగదారుల నుంచి సర్దుబాటు చేసుకుంటామని గత ఏడాది ఏప్రిల్లోనే డిస్కంలు కోరాయి. ఈ మేరకు ఏపీఈఆర్‌సీలో ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ దరఖాస్తు చేశాయి. కానీ, ఈఆర్‌సీ స్పందించలేదు. తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.11,826.42 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల వసూలుకు కూడా డిస్కంలు అనుమతులు కోరాయి. గత ఏడాది డిసెంబరు నాటికే ఈఆర్‌సీ అనుమతులు ఇవ్వాల్సి ఉన్నా స్పందించలేదు. దీంతో... సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ బాదుడు ‘వాయిదా’ పడింది. దీంతో రెండేళ్లకూ కలిపి మొత్తం రూ.20,096.36 కోట్లకు చేరింది. ఇందులో 2022-23నాటి రూ.8,113.60 కోట్ల వసూలుపై కమిషన్ తాజాగా ప్రజాభిప్రాయం కోరింది. కాగా.. ఇదే సమయంలో యూనిట్‌కు 40 పైసల చొప్పున ప్రతి వినియోగదారుడి నుంచి ‘ఆటోమేటిక్ పాస్ త్రూ’ ద్వారా నెలవారీ బిల్లుల్లో అదనంగా డిస్కంలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటివరకు రూ.2,869 కోట్ల వరకు బాదాయి.
భరించలేని బాదుడు...
2014-19 కాలానికి రూ.3,669 కోట్లను జగన్ ప్రభుత్వ హయాంలో వసూలు చేశారు. అదేవిధంగా 2020-21 కాలానికి రూ.4,572 కోట్ల ‘మైన్‌స’ను డిస్కంలు చూపాయి. దీనిని 2022-23నాటి విద్యుత్ బిల్లుల్లో తగ్గించారు. కానీ రూ.3,669 కోట్ల వసూలు కొనసాగడంతో కుదించిన మొత్తాల ప్రభావం కనిపించలేదు. 2021-22లో మరో 3,554.58 కోట్లను సర్దుబాటు చార్జీల కింద వసూలు చేసుకుంటామని డిస్కంలు కోరగా.. రూ.3,082.99 కోట్ల వసూలుకు కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగన్ హయాంలో విద్యుత్‌చార్జీల బాదుడు భారీగా పెరగడంతో ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. అయినా.. 2019-20 నుంచి పెంచుతున్న విద్యుత్ చార్జీలు, ఇంధన కొనుగోళ్లు, ఇంధన సర్దుబాటు చార్జీలకు అదనంగా.. 2022-23 కాలానికి ఏకంగా 8,113.60 కోట్లు వసూలు చేసుకుంటామని డిస్కంలు కోరాయి. ఈ అభ్యర్థనపై ఏడాదిన్నరదాకా ఈఆర్‌సీ నిర్ణయం తీసుకోకుండా తాజాగా ప్రజాభిప్రాయ ప్రకటన చేసింది.
రాష్ట్రప్రభుత్వమే భరించాలి: సీహెచ్ బాబూరావు
2022-23విద్యుత్ సర్దుబాటు చార్జీలను ప్రభుత్వమే భరించాలని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చార్జీలను పెంచబోమంటూ కూటమి హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ఆర్థిక ఒడిదొడుకుల నేపథ్యంలో ప్రభుత్వం 2022-23 నాటి రూ.8,113 కోట్లు.. 2023-24లో 11,826.42 కోట్లు.. మొత్తం రూ.20.096.36 కోట్ల భారం భరించగలదా అనే సందేహాలు నెలకొన్నాయి.
Updated Date - Oct 01 , 2024 | 03:23 AM