తంటాలు పడి తరలించినా.. టాటా!
ABN, Publish Date - Apr 04 , 2024 | 05:12 AM
తన బలం నిరూపించుకునేందుకు వైసీపీ నానా తంటాలు పడినా ఫలించలేదు. ఏకంగా వెయ్యికిపైగా ఆర్టీసీ బస్సులు, వందల సంఖ్యలో ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు, జీపులు, కార్లలో జనాల్ని పెద్దఎత్తున తరలించారు.
జగన్ రాకముందే కొందరు.. వచ్చాక ఇంకొందరు
మాట్లాడుతుండగా పూర్తిగా వెళ్లిపోయిన ప్రజలు
పూతలపట్టు సభ కోసం 1500 బస్సులు
ఎండదెబ్బకు బస్సు కూడా దిగని మహిళలు
వేడెక్కిన వాటర్ ప్యాకెట్లను ముట్టుకోలేని స్థితి
రోడ్‌షో పేరిట బస్సులో నుంచే అభివాదం
రోడ్‌షో జరిగిన ప్రాంతాల్లో చెట్ల నరికివేత
ప్రజలకు తప్పని ట్రాఫిక్ ఇబ్బందులు
చిత్తూరు, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): తన బలం నిరూపించుకునేందుకు వైసీపీ నానా తంటాలు పడినా ఫలించలేదు. ఏకంగా వెయ్యికిపైగా ఆర్టీసీ బస్సులు, వందల సంఖ్యలో ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు, జీపులు, కార్లలో జనాల్ని పెద్దఎత్తున తరలించారు. స్థానిక వైసీపీ నాయకుల ఒత్తిడి మేరకు బస్సుల్లో జనాలు వచ్చినా సీఎం జగన్ బహిరంగ సభ ప్రాంగణానికి వెళ్లలేదు. వెళ్లిన వారిలోనూ చాలామంది జగన్ ప్రసంగానికి ముందే వెనుతిరిగారు. ఇక జగన్ ప్రసంగించే సమయంలో ప్రాంగణమంతా ఖాళీ అయిపోయింది. చిత్తూరు జిల్లా పూతలపట్టులో జరిగిన ‘మేమంతా సిద్ధం’ ఎన్నికల ప్రచార బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. చిత్తూరు నగరంలోని పలు నర్సింగ్, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థుల్ని కూడా బస్సుల్లో తరలించారు. వారితో జగన్ ఫ్లకార్డులను పట్టించి నినాదాలు చేయించారు.
మండుటెండ.. వేడి వేడి వాటర్ ప్యాకెట్లు..
షెడ్యూల్ మేరకు పూతలపట్టు మండలం మూర్తిగారివూరు సమీపంలోని బహిరంగ సభ బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు నిర్వహించాల్సి ఉంది. జగన్ సభా ప్రాంగణానికి సుమారు 5.45 గంటలకు చేరుకున్నారు. దీంతో సభా ప్రాంగణం వద్ద ప్రజలు సుమారు ఆరు గంటలు వేచి చూశారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మహిళలు బస్సుల్లో నుంచి కిందికి కూడా దిగలేదు. వచ్చిన బస్సులో నుంచి కిందికి దిగకుండా అలాగే మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు.
బస్సు దిగని సీఎం
చిత్తూరు జిల్లాలో బుధవారం జరిగిన బస్సు యాత్రలో సీఎం జగన్ బహిరంగ సభ వద్ద తప్ప.. ఎక్కడా బస్సులో నుంచి దిగలేదు. బస్సులో నుంచే అభివాదం చేసుకుంటూ వెళ్లారు. మార్గమధ్యంలో బస్సుపైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించలేదు. బస్సులో నుంచి బయటికి రాకపోవడంతో ప్రజల్లో, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఇదిలాఉండగా, ఆయన ప్రయాణించే ప్రాంతాల్లో చెట్లను తొలగించేశారు. సదుం మండలంలో భారీ చెట్ల కొమ్మలు కత్తిరించారు. సదుం- కల్లూరు ప్రధాన రహదారిలో తాతల నాటి చింత చెట్టు కొమ్మలూ పూర్తిగా తొలగించారు. సదుం- సోమల రహదారిలో జాండ్రపేట వద్ద చెట్ల కొమ్మలు తీసేశారు.
4 గంటలు హైవే స్తంభన
మంత్రి పెద్దిరెడ్డి సొంతూరు సదుం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర రోడ్ షో పూతలపట్టు మండలం తేనెపల్లె టోల్‌గేట్ వద్ద భోజన విరామానికి ఆగింది. రోడ్ షో అంతా చిత్తూరు-పీలేరు నేషనల్ హైవే మీద సాగడంతో పోలీసులు ఆ మార్గాన్ని పూర్తిగా క్లోజ్ చేశారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి రంగంపేట క్రాస్ వద్ద వాహనాలను పీలేరు వైపు వెళ్లకుండా ఆపేశారు. జగన్ కాన్వాయ్ 5.30 గంటలకు బహిరంగ సభకు బయల్దేరాక వాహనాలను అనుమతించారు. సుమారు నాలుగు గంటల పాటు వాహనదారులు ఎండలో ఇబ్బందులు పడ్డారు.
బాబు వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయించారట!
పూతలపట్టు సభలో సీఎం జగన్ అబద్ధాలు
పవన్ సరిపోడని మోదీని తెచ్చుకున్నారు
చంద్రబాబును చంద్రముఖి పెట్టెలో బంధించాలి
పూతలపట్టు, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పూతలపట్టులో జరిగిన ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్ కళ్లు ఆర్పకుండా అబద్ధాలు వల్లించారు. చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయించారని వ్యాఖ్యానించారు. నిజానికి, వలంటీర్లు వైసీపీ ప్రచారాల్లో నేరుగా పాల్గొంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. దీనిపై టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, ఎన్నికలసంఘం పెన్షన్లు, రేషన్ పంపిణీలో వలంటీర్లను దూరం పెట్టాలని ఆదేశించడం తెలిసిందే. దీన్ని అదునుగా చేసుకుని వైసీపీ రాజకీయం చేస్తోంది. తాజాగా జగన్ మరో నాటకానికి తెర తీశారు. అసలు వలంటీర్ల వ్యవస్థ రద్దు కాకున్నా, చంద్రబాబు ఆ వ్యవస్థను రద్దు చేశారని అబద్ధాలు చెప్పారు. మళ్లీ వైసీపీ వస్తే వలంటీర్ల వ్యవస్థతో సంక్షేమ పథకాలను ఇంటికి అందిస్తానన్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్దతు సరిపోక మోదీని కూడా తెచ్చుకున్నారన్నారు. చంద్రబాబును చంద్రముఖిలా పెట్టెలో పెట్టి బంధించి తాళం వేయాలన్నారు.
6 కిలోమీటర్లు... 35 నిమిషాలు
మండుటెండలో ప్రయాణికులు, జనాలకు నరకం
తిరుపతి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ఆరు కిలోమీటర్ల స్వల్ప దూరాన్ని దాటడానికి అరగంటకుపైగా సమయం తీసుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర తీరుతో సామాన్య జనం, ప్రయాణికులు గంటల కొద్దీ నరకం చవిచూశారు. చిత్తూరు జిల్లాలో బుధవారం పుంగనూరు నియోజకవర్గం నుంచి పూతలపట్టు నియోజకవర్గానికి వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో ఆరు కిలోమీటర్ల దూరం తిరుపతి జిల్లా మీదుగా బస్సు యాత్ర సాగింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని సదుం మండలం అమ్మగారిపల్లి నుంచి పూతలపట్టుకు వెళ్లడానికి చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పదిపుట్లవారిబైలు గ్రామం వద్ద తిరుపతి జిల్లాలో ప్రవేశించాలి. షెడ్యూలు ప్రకారం ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్ర ఇక్కడకు చేరుకోవాలి. అయితే, జగన్ మఽధ్యాహ్నం 1.45 గంటలకు వచ్చారు. అక్కడనుంచి ఆరు కిలోమీటర్లు ప్రయాణించి అదే మండలం పత్తిపాటివారిపల్లి వద్ద జిల్లా దాటి తిరిగి చిత్తూరు జిల్లాలో ప్రవేశించాలి. ఈ దూరాన్ని అధిగమించడానికి ఆయనకు 35 నిమిషాలు పట్టింది. 2.20గంటలకు సీఎం బస్సు జిల్లా దాటిన తర్వాత ట్రాఫిక్ పునరుద్ధరణకు మరో గంట పట్టింది. అయితే, సీఎంకు పోలీసులు బందోబస్తు పేరిట అతికి పోయి ఉదయం 11 గంటల నుంచే చిత్తూరు-కడప జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. ఈ మార్గంలో కల్లూరు వద్ద జాతీయ రహదారిని క్రాస్ చేసే పుంగనూరు-తిరుపతి ప్రధాన రహదారిలో కూడా వాహనాల రాకపోకలను ఆపేశారు. దీంతో సుమారు నాలుగున్నర గంటల పాటు కిలోమీటర్ల కొద్దీ వాహనాలు ఆగిపోయి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వేసవిలో మఽధ్యాహ్నం గంటలకొద్దీ ఎండకు, ఉక్కపోతకు నానా అగచాట్లు పడ్డారు. మరోవైపు ఇదే పరిధిలో ఉదయం తొమ్మిది గంటల నుంచే మఽధ్యాహ్నం 2.30 గంటల వరకూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సీఎం బస్సు ప్రయాణించే మార్గంలో పలుచోట్ల విద్యుత్ తీగలు రోడ్డును క్రాస్ చేస్తున్న కారణంగా ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో రోడ్డుపై చిక్కుకుపోయిన ప్రయాణికులతోపాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పదిపుట్ల బైలు, పేరసానిపల్లి, గుండ్లగుట్టపల్లి, దామలచెరువు, పత్తిపాటివారిపల్లి తదితర గ్రామాల ప్రజలు ఐదున్నర గంటల పాటు విద్యుత్ సరఫరా లేక అసౌకర్యానికి లోనయ్యారు. ఆ మార్గంలోని ప్రభుత్వ స్కూళ్లను మధ్యాహ్నం 12.30 గంటలకు మూయాల్సి ఉండగా 11 గంటలకే పిల్లలను పంపించేశారు.
డబ్బు, మద్యం పంపిణీ
జగన్ సభకు ప్రజలను తరలించడానికి వైసీపీ నాయకులు డబ్బుల వరద పారించారు. వార్డుల్లో, గ్రామాల్లో స్థానిక నాయకులకు లక్ష్యాలు పెట్టి మరీ జనాల్ని తరలించారు. ఒక్కో వార్డుకు, ఒక్కో పంచాయతీకి రూ.లక్ష వరకు చెల్లించి జనాల్ని తరలించినట్లు తెలుస్తోంది. హాజరైన ప్రతి వ్యక్తికి రూ.300తోపాటు బిర్యానీ, బగారా రైస్, మద్యం అందించారు. మరోవైపు కనీసం తాగేందుకు మంచి నీళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు వైసీపీ నాయకుల్ని తిట్టుపోశారు.
Updated Date - Apr 04 , 2024 | 05:12 AM