ల్యాండ్ టైటిలింగ్ ముసుగులో దోపిడీ
ABN, Publish Date - May 07 , 2024 | 03:58 AM
ల్యాండ్ టైటిలింగ్ చట్టం ముసుగులో సుమారు రూ.100 కోట్లకుపైగా కాంట్రాక్టును క్రిటికల్ రివర్ సంస్థకు కట్టబెట్టినట్లు వెల్లడైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ అన్నారు.
క్రిటికల్ రివర్ కంపెనీకి రూ.100 కోట్లు దోచిపెట్టిన జగన్: నీలాయపాలెం
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): ల్యాండ్ టైటిలింగ్ చట్టం ముసుగులో సుమారు రూ.100 కోట్లకుపైగా కాంట్రాక్టును క్రిటికల్ రివర్ సంస్థకు కట్టబెట్టినట్లు వెల్లడైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ అన్నారు. సోమవారం మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘క్రిటికల్ రివర్ సంస్థ సోమవారం తెలుగు దినపత్రికల్లో బహిరంగ ప్రకటన ఇచ్చింది. రివర్స్ టెండరింగ్ ఆధారంగా తమకు ల్యాండ్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టు వచ్చిందని పేర్కొంది. దీంతో రివర్స్ ముసుగులో దోపిడీ జరిగిందని వెల్లడైంది. ప్రజల ఆస్తి క్రయ విక్రయ డిజిటలైజ్డ్ పత్రాలను నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ)లో భద్రపరుచుకోవడానికి ఇబ్బంది ఏమిటి? అన్న ప్రశ్నకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి జవాబు లేదు. ఉచితంగా ఎన్‌ఐసీ ఇస్తామన్న సాఫ్ట్‌వేర్‌ను కాదని, 1996లో పెట్టిన కార్డ్ సిస్టం కంటే కార్డ్ 2.0 కింద మరింత అభివృద్ధి చేసిన సాప్ట్‌వేర్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చి సంస్థలను ఆహ్వానించింది. కేవలం రూ.49 కోట్ల టర్నోవర్ మాత్రమే ఉన్న ఈ సంస్థకు రెండు కాంట్రాక్టుల పేరుతో మొత్తం రూ.134 కోట్లు కట్టబెట్టారు. ఆ సంస్థ చేతికి రాష్ట్రంలోని పౌరుల ఆస్తి పత్రాల డిజిటలైజేషన్, స్టోరేజీ, సెక్యూరిటీ ఇచ్చేస్తున్నారంటే భయంతో పాటు మన ఆస్తులు ఏమై పోతాయోనన్న వణుకు నిలువెల్ల ఆవరిస్తోంది. ప్రజల ఆస్తుల పత్రాలకు సంబంధించిన భద్రత బాధ్యత అంత చిన్న సంస్థకు ఎలా అప్పగిస్తారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని రద్దు చేస్తాం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు అనుంబంధంగా ఇచ్చిన ప్రతి పని టెండరూ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది’ అని విజయ్‌కుమార్ పేర్కొన్నారు.
Updated Date - May 07 , 2024 | 07:18 AM