‘రెవెన్యూ’పై కన్ను
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:48 AM
గుడివాడ మున్సిపాల్టీలో కాసుల వర్షం కురిపించే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు ఇద్దరు ఉద్యోగులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. రాజకీయ నేతల అండదండలతో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేతల సిఫారసులతో మళ్లీ ఇక్కడికి వచ్చిన వీరిపై అవినీతి ఆరోపణలు ఉండటంతో కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తే మంచిదన్న ఆలోచన కూటమి నేతల నుంచి వ్యక్తమవుతోంది.
-గుడివాడ మున్సిపాల్టీలో ఆర్‌ఐ పోస్టుకు పోటాపోటీ
-అవినీతి ఆరోపణలున్న ఇద్దరు ఉద్యోగుల పైరవీలు
-బీజేపీ ఎమ్మెల్యే, జనసేన నేతల సిఫారసులతో ఇక్కడికి..
- కొత్త వారికి ఇస్తే మంచిదంటున్న కూటమి నేతలు
గుడివాడ మున్సిపాల్టీలో కాసుల వర్షం కురిపించే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు ఇద్దరు ఉద్యోగులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. రాజకీయ నేతల అండదండలతో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేతల సిఫారసులతో మళ్లీ ఇక్కడికి వచ్చిన వీరిపై అవినీతి ఆరోపణలు ఉండటంతో కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తే మంచిదన్న ఆలోచన కూటమి నేతల నుంచి వ్యక్తమవుతోంది.
ఆంధ్రజ్యోతి-గుడివాడ: పురపాలక సంఘంలో పన్ను వసూలు, కొత్తగా పన్నులు విధించడం, ఖాళీస్థలాల నుంచి పన్నులు రాబట్టడం, మ్యుటేషన్‌లు, మున్సిపల్ దుకాణాల లీజులు, మార్కెట్ ఆశీలు, లీజులు, వాల్యూషన్ సర్టిఫికేట్‌ల జారీ వంటి ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ రెవెన్యూ అధికారి, ఇన్‌స్పెక్టర్ కనుసన్నల్లోనే జరుగుతాయి. అందుకే ‘రెవెన్యూ’లో కీలకమైన ఈ సీటుపై అందరి కన్ను ఉంటుంది. ఒక్కసారి పోస్టింగ్ దక్కించుకుంటే చాలు ఆర్థికంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదనే భావనతో మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
రికార్డులు కాల్చేసిన చరిత్ర ఒకరిది!
ఆర్‌ఐ పోస్టుకు పోటీ పడుతున్న ఉద్యోగుల్లో ఒకరు గతంలో రెవెన్యూ విభాగంలో పని చేసిన కాలంలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని, దానిని కప్పిపుచ్చుకునేందుకు సదరు ఉద్యోగి అప్పట్లో ఏకంగా రెవెన్యూ రికార్డులను షార్ట్‌సర్క్యూట్ పేరుతో కాల్చేసినట్టు ఆ కార్యాలయ వర్గాల్లో విస్తృత్తంగా ప్రచారం సాగింది. పబ్లిక్ హెల్త్ విభాగంలో రికార్డులను ట్యాంపరింగ్ చేసి విధులకు హాజరుకాని కొందరు ఉద్యోగుల పేరు మీద ఎనిమిది నెలల జీతాలు తన సొంత ఖాతాలోకి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పటి మున్సిపల్ కమిషనర్ శామ్యూల్, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు సదరు ఉద్యోగికి ఎనిమిది ఇంక్రిమెంట్‌లను కట్ చేసి చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ-సేవాలో జరిగిన నిధుల మళ్లింపులో కూడా సదరు ఉద్యోగి పాత్ర స్పష్టంగా ఉందని ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే అప్పటి మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు సదరు ఉద్యోగి గుడివాడ రాకూడదని పట్టుపట్టారు. బలవంతంగా వేరే మున్సిపాల్టీకి బదిలీ చేయించారు. కూటమి ప్రభుత్వం రావడంతో బీజేపీ ఎమ్మెల్యే సిఫారసుతో తిరిగి గుడివాడ మున్సిపాల్టీకి బదిలీపై వచ్చి ఆర్.ఐ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
మాజీ మంత్రికి నమ్మినబంటు మరొకరు!
ఆర్‌ఐ పోస్టుకు పోటీ పడుతున్న ఉద్యోగుల్లో మరొకరు మాజీ మంత్రి కొడాలి నాని, ఆయన ముఖ్య అనుచరుడు శశిలకు నమ్మినబంటుగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ పాలనలో వారు చెప్పిందే తడవుగా ఆనాడు టిడ్కో లబ్ధిదారుల జాబితాలో సుమారు 1600 మంది లబ్ధిదారుల పేర్లను మార్చి స్వామిభక్తి చాటుకున్నారు. ఆనాడు కీలకమైన టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేసిన మున్సిపల్ ఉద్యోగి, రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్‌లు ఫ్లాట్‌ను బట్టి అర్హత లేని లబ్ధిదారుల నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేసి వైసీపీ నాయకులకు ఆర్థిక తోడ్పాటు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు ఉద్యోగి కూడా టిడ్కో గృహాలను అమ్ముకున్నారని వదంతులున్నాయి. ఈయన జనసేన జిల్లా నేతల సిఫారసుతో బదిలీపై గుడివాడ వచ్చి ఆర్‌ఐ సీటు కోసం విశ్వప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే మున్సిపాల్టీలో ప్రాధాన్యత కలిగిన రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ పోస్టును అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరికి కాకుండా కొత్తవారికి ఇస్తే మంచిదనే భావన కూటమి నాయకుల్లో వ్యక్తమవుతోంది. కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ మాత్రం ఆర్‌ఐ పోస్టు ఎవరికి కేటాయించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.
Updated Date - Oct 22 , 2024 | 12:48 AM