కోనసీమలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN, Publish Date - May 15 , 2024 | 03:12 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఉడిమూడి శివారుచింతావారిపేట వద్ద మంగళవారం రాత్రి ట్రాక్టర్‌లో ధాన్యం లోడు చేస్తున్న కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.
ధాన్యం లోడు చేస్తున్న కూలీలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
అక్కడిక్కడే నలుగురు మృతి
పలువురికి తీవ్రగాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
పి.గన్నవరం/అంబాజీపేట, మే 14: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఉడిమూడి శివారుచింతావారిపేట వద్ద మంగళవారం రాత్రి ట్రాక్టర్‌లో ధాన్యం లోడు చేస్తున్న కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పి.గన్నవరం మండలం ఆదిమూలవారిపాలెం, గంటి పెదపూడి గ్రామాలకు చెందిన 10 మంది జట్టుకూలీలు మంగళవారం తెల్లవారుజామున ధాన్యం బస్తాలను ట్రాక్టర్‌లో లోడు చేసేందుకు ఉడిమూడి వెళ్లారు. రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో రాజోలు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చింతావారిపేట వద్ద రహదారి పక్కనే ధాన్యం బస్తాలు లోడు చేస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌కి పగ్గం బిగిస్తున్న జట్టు కూలీలు ప్రమాదానికి గురయ్యారు. పి.గన్నవరం మండలం ఆదిమూలవారిపాలేనికి చెందిన చిలకలపూడి మణిబాబు (31), గంటి పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ (32), వాసంశెట్టి సూర్యప్రకాష్ (48), ఈరి కట్టయ్య (46) అక్కడిక్కడే మృతి చెందారు. ఇద్దరు జట్టు కూలీలకు, బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతులను తొలుత పి.గన్నవరం సీహెచ్‌సీ, కొత్తపేట ఏరియా ఆసుపత్రులకు తరలించారు. జట్టు కూలీలు చిలకలపూడి సురేష్, బొరుసు నాని పరిస్థితి విషమంగా ఉండడంతో అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలాన్ని కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ, సీఐ డి.ప్రశాంత్‌కుమార్ పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ పరారయ్యాడు. డ్రైవర్ ఇక్కడకు వచ్చే వరకు మృతదేహాలను తరలించేందుకు వీల్లేదంటూ బంధువులు రహదారిపై బైఠాయించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మృతుల కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - May 15 , 2024 | 03:12 AM