Chandrababu : మక్కెలు విరగ్గొడతాం
ABN, Publish Date - Sep 26 , 2024 | 04:23 AM
అనంతపురం జిల్లాలో రామాలయానికి చెందిన రథానికి నిప్పంటించిన ఘటనతో పాటు ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనపైనా సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరదల నష్టం రూ.7,600 కోట్లు
4 లక్షల మందికి రూ.602 కోట్ల పరిహారం విడుదల
దాతల నుంచి ప్రభుత్వానికి రూ.400 కోట్ల విరాళాలు
30 నాటికి బాధితులకు పరిహారం పంపిణీ పూర్తి
సాయంపై కేంద్రంలో ఇంకా కసరత్తు జరుగుతోంది: సీఎం
శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఊరుకోం
ఒళ్లు దగ్గర పెట్టుకోమని హెచ్చరిస్తున్నాం
క్రిమినల్ బ్రెయిన్‌తో వస్తే వదిలిపెట్టేది లేదు
చొక్కా పట్టుకొని తీసుకెళ్తాం
నేరాలు చేయాలనుకుంటే అదే చివరి రోజు
బోట్లను నదిలోకి వదిలి ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేసే ప్రయత్నం వెనుక వైసీపీ ఉంది
ఈ పని చేసినందుకు క్షమాపణ చెప్పరా?
ఇప్పుడు మళ్లీ అనంతలో రథం తగలబెట్టారు
అమరావతి/విజయవాడ, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలో రామాలయానికి చెందిన రథానికి నిప్పంటించిన ఘటనతో పాటు ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనపైనా సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల్లో నష్టపోయిన 4లక్షల మంది బాధితులకు బుధవారం రూ.602 కోట్ల పరిహారాన్ని విడుదల చేసిన సందర్భంగా విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘బోట్లను నదిలోకి వదిలి ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేసే ప్రయత్నం వెనుక వైసీపీ ఉంది. అందులో అనుమానమే అక్కర్లేదు. వీళ్లకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. వీళ్లు చేసివేరే వాళ్లపై రుద్దుతారు. కృష్ణానదిలో విపరీతమైన వేగంతో వరద ప్రవహిస్తున్నప్పడు 40 టన్నుల బరువున్న బోట్లను వదిలారు... అవి విపరీతమైన వేగంతో వచ్చి బ్యారేజీ స్తంభాలను ఢీకొట్టి ప్రాజెక్టు కూలిపోవాలని వారి ఆలోచన. కానీ అవి గేట్లపై ఉండే కౌంటర్ వెయిట్‌కు తగలడంతో అవి విరిగిపోయాయి. ఆ బోట్లను తీయడానికి నాలుగైదు రోజులు ఎంతో శ్రమపడాల్సి వచ్చింది. ఈ పని చేసినందుకు క్షమాపణ చెప్పరా? వాటిపై మీ బొమ్మలు, మీ పార్టీ రంగులు వేసుకున్నారు. ఆంబోతుల్లా దేశంపైకి వదిలి చూస్తూ కూర్చుంటారా? ఆ ప్రాజెక్టు కూలిపోతే ఎన్ని గ్రామాలు కొట్టుకుపోతాయి? ఎంత ప్రాణనష్టం వాటిల్లుతుంది. మీరు చేసిన పనులతో బుడమేరు కింద 6లక్షల మంది నరకయాతన అనుభవించారు. ఇప్పుడు మళ్లీ అనంతపురంలో రథం తగలబెట్టారు. ఒళ్లు దగ్గర పెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. బీ కేర్‌ఫుల్. ప్రతిచోటా సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాం. ఇలాంటి నేరాలు చేస్తే మక్కెలు విరగ్గొడతాం. ఇంటినుంచి బయటకు వచ్చిన మరుక్షణం చొక్కా పట్టుకొని తీసుకెళ్తాం. ఎంత గొప్పవాడైనా వదిలిపెట్టేది లే దు. ఎవరైనా దారి తప్పి నేరాలు చేయాలనుకుంటే అదే వారికి చివరి రోజు అవుతుం ది. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదు’ అని చంద్రబాబు హెచ్చరించారు.
వరదల నష్టం రూ.7,600 కోట్లు: సీఎం
ఇటీవల రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు కలిపి రూ.7,600 కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. వరదల్లో నష్టపోయిన 4లక్షల మంది బాధితులకు బుధవారం రూ.602 కోట్ల పరిహారాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘భారీవర్షాలు, వరదల ప్రభావం రాష్ట్రమంతా ఉంది. మొత్తం 16 జిల్లాల్లోని 902గ్రామాలు, కొన్ని నగరాలు, పట్టణాలు ప్రభావితమయ్యాయి. ఈ ప్రభావం 12 లక్షల మందిపై పడింది. 74 మంది మరణించారు. విజయవాడ చుట్టుపక్కల 45మంది మరణించారు. బాధితులను ఆదుకోవడానికి ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.400కోట్ల విరాళాలు వచ్చాయి. వీల్‌చైర్లలో వచ్చి మరీ విరాళాలు ఇచ్చి వెళ్లారు. పాఠశాలల్లో విద్యార్థులు కూడా ఇచ్చారు. ఇది ఊహించనంత స్పందన. దాతలు అందరికీ నా పాదాభివందనం. విజయవాడలో వరద తీవ్రత చాలా అధికంగా ఉంది. బాధితులను ఆదుకోవడానికి పది రోజుల్లో 1.15కోట్ల ఆహార పొట్లాలు, 1.30కోట్ల నీళ్ల సీసాలు పంపిణీ చేశాం. 5వేల టన్నుల కూరగాయలు సబ్సిడీ ధరలకు విక్రయించాం. 150 డ్రోన్లను వాడాం. 75 వేల ఇళ్లలో బురదతో పాటు 330 కి.మీ. రోడ్లను ఫైర్‌ఇంజన్లతో శుభ్రం చేయించాం. 2లక్షల మందికి వైద్య సహాయం అందించాం. వరదల్లో వచ్చి పడిన మట్టి, చెత్తను ఎత్తి తరలిస్తే 20వేల టన్నులు అయింది. బాగా శుభ్రం చేయడం వల్ల వ్యాధులు ప్రబలడం తగ్గింది’ అని చంద్రబాబు వివరించారు. వరదల్లో నష్టపోయిన వారికి చరిత్రలో ఏనాడూ లేనంత నష్టపరిహారం ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. ‘నీటమునిగిన గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లకు రూ.11వేలు ఇవ్వాలని కేంద్రం సూచించింది. మేం రూ.25వేలు ఇచ్చాం. చిన్న కిరాణా షాపులు, పరిశ్రమలకు రూ.25వేల నుంచి రూ. 50వేల వరకూ ఇచ్చాం. బ్యాంకులు ఇప్పటికి రూ.500కోట్ల మేర రుణాలు రీషెడ్యూల్ చేయడంతో పాటు కొన్ని కొత్త రుణాలు ఇచ్చాయి. బీమా కంపెనీలు ఈ నెల 30నాటికి వంద శాతం క్లెయిమ్‌లను పరిష్కరించాలని ఆదేశించాం. ఆ తేదీతో వరద బాధితుల సహాయానికి సంబంధించి అన్ని పనులు పూర్తికావాలని లక్ష్యంగా పెట్టుకొన్నాం. ఆ రోజు సాయంత్రం బాగా పనిచేసినవారికి అభినందన కార్యక్రమం నిర్వహిస్తాం’ అని ఆయన చెప్పారు.
Updated Date - Sep 26 , 2024 | 04:35 AM