స్తంభించిన ‘గంగవరం’
ABN, Publish Date - Apr 19 , 2024 | 04:45 AM
విశాఖపట్నంలోని అదానీ గంగవరం పోర్టులో నిర్వాసిత కార్మికులు చేస్తున్న ఆందోళన తొమ్మిదో రోజు కు చేరింది. దీంతో పోర్టులో కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. అక్కడి నుంచి విశాఖపట్నం
కొనసాగుతున్న కార్మికుల ఆందోళన.. 9 రోజులైనా పట్టించుకోని యాజమాన్యం
ఉన్నతాధికారుల జోక్యంతోనూ ఫలితం శూన్యం
నిర్వాసిత కార్మికులను వదిలించుకునే యత్నం
గుజరాత్ నుంచే మంతనాలు..
పోర్టులో నిలిచిన కార్యకలాపాలు.. స్టీల్ ప్లాంట్‌కు సమస్య
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలోని అదానీ గంగవరం పోర్టులో నిర్వాసిత కార్మికులు చేస్తున్న ఆందోళన తొమ్మిదో రోజు కు చేరింది. దీంతో పోర్టులో కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. అక్కడి నుంచి విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు ఏ ముడి పదార్థమూ వెళ్లడం లేదు. తమకు కనీ స వేతనాలు ఇవ్వాలని, ఏదైనా ప్రమాదం జరిగితే ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించాలని, ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాల నే డిమాండ్లతో పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నా రు. పోర్టు యాజమాన్యం ఇప్పటివరకు వీరితో చర్చలు జరపలేదు. మరోవైపు స్టీల్‌ప్లాంటుకు బొగ్గు, లైమ్‌స్టోన్, ముడి ఇనుము అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేయడం లేదు. గంగవరం, దిబ్బపాలెం మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయించి గంగవరం పోర్టుకు అప్పగించారు. ఆయా గ్రామాల్లో 600 మందికి మూడు దశ ల్లో పోర్టులో కార్మికులుగా పనిచేయడానికి అవకాశం కల్పించారు. 14 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారికి రూ.18 వేలు, పదేళ్ల నుంచి చేస్తున్న వారికి రూ.16 వేలు, ఏడేళ్ల నుంచి ఉన్న వారికి రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారు. పోర్టులో ఏదైనా ప్రమాదం జరిగితే ఈఎ్‌సఐ ఆస్పత్రికి పంపించి యాజమాన్యం చేతులు దులుపుకుంటోంది. దీనినే కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కనీస వేతనాల చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 8 నెలల క్రితం 64 రోజుల పాటు ఆందోళన చేస్తే పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, కలెక్టర్ మల్లికార్జున చర్చలు జరిపి విరమింపజేశారు. ఎవరికై నా ప్రమాదం జరిగితే సమీప కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించాలని, కార్మికుడు చనిపోతే ఆ కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించడానికి, ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకుంది. కానీ, దాన్ని ఇప్పటివరకూ అమలు చేయలేదు. గట్టిగా నిలదీస్తే... గుజరాత్‌లోని ముంద్రా పోర్టు యాజమాన్యానికి లేఖ రాశామ ని, వారు ఏది చెబితే అదే చేస్తామని అంటున్నారు. యాజమాన్య వైఖరికి విసిగిపోయిన కార్మికులు 8 రోజుల క్రితం పోర్టు గేట్లకు తాళాలు వేసి, మెరుపు ఆందోళనకు దిగారు. లోపల సుమారు 200 మంది కార్మికులు ఉండిపోయారు. వారికి బయట ఆందోళన చేస్తున్నవారే చందాలు వేసుకొని భోజనాలు పంపుతున్నారు. పోర్టు కార్మికుల ఆందోళనతో విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు ముడిపదార్థాల సమస్య ఏర్పడింది. దీం తో ప్లాంటు యాజమాన్యం అభ్యర్థన మేరకు కలెక్టర్ పోర్టు కార్మికులను చర్చలకు పిలిచారు. పోర్టు అధికారులను కూడా రప్పించారు. గత సమావేశపు తీర్మానా లు ఎందుకు అమలు చేయలేదని కలెక్టర్ ప్రశ్నిస్తే... దానిపై తాము ఏమీ సంతకాలు చేయలేదని, అమలు చేయాల్సిన అవసరం లేదని వారు సమాధానమిచ్చా రు. దాంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని యాజమాన్యం ఏది చెబితే అదే చేస్తున్నారు తప్పితే ఇక్కడ వీరి చేతిలో ఏమీ లేదని గ్రహించి ఆయన కూడా చేతులెత్తేశారు. ఎన్నికలు ముగిసేంత వరకు తాము ఏమీ చేయలేమని స్పష్టంచేశారు.
ఫ్యాక్టరీస్ చట్టంలోకి తేవాలని డిమాండ్
ఆందోళనతో పోర్టులో కార్యకలాపాలు స్తంభించిపోవడంతో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ బుధవారం కార్మికులతో చర్చలు జరిపారు. నిర్వాసిత కార్మికులకు కనీస వేతనం రూ.36 వేలు ఇవ్వాలని, పోర్టు కార్మికులను ఫ్యాక్టరీస్ చట్టం పరిధిలోకి తీసుకువచ్చి, అన్నిరకాల సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ఆయన గుజరాత్‌లోని అదానీ యాజమాన్యానికి తెలియజేశారు. అటు నుంచి వ్యతిరేకత వచ్చింది. నిర్వాసిత మత్స్యకార గ్రామాలకు చెందినవారు కార్మికులుగా పోర్టులో ఉంటే ఆందోళనలు జరుగుతూనే ఉంటాయని, కాబట్టి వారిని శాశ్వతంగా వదిలించుకోవాలని అదానీ యాజమాన్యం నిర్ణయించింది. ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోవడానికి ఎంత కావాలో చెప్పాలని బుధవారం రాత్రి మూడు దశల్లో చర్చలు జరిపింది. ఒక్కొక్కరికి రూ.50 లక్షలు ఇస్తే ఉద్యోగాలు మానేసి వెళ్లిపోతామని కార్మికుల కమిటీ నాయకులు పోలీస్ కమిషనర్ రవిశంకర్‌కు తెలిపారు.
స్టీల్ ప్లాంటుకు విషమ పరీక్ష..!
‘గంగవరం’ నుంచి అందని బొగ్గు.. నిలిచిన ఉత్పత్తి
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు విషమ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్లాంటు నడపడానికి అత్యంత ముఖ్యమైన కోకింగ్ కోల్ సరఫరా నిలిచిపోవడంతో దాని ప్రభావం అన్ని విభాగాలపైనా పడిం ది. ఉత్పత్తి దాదాపు నిలిచిపోయింది. ప్రత్యామ్నా య మార్గాల్లో బొగ్గును సమకూర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ముడి పదార్థాలు సరఫరా చేయాల్సిన అదానీ గంగవరం పో ర్టు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. పోర్టులో కార్మికులు చేస్తున్న ఆందోళనను విరమింపజేయడానికి ఒక్క అడుగు కూడా ముందుకువేయడం లేదు. దీంతో ఏమి చేయాలో పాలుపోక కర్మాగారం యాజమాన్యం విశాఖ పోర్టు నుంచి బొగ్గు తెప్పించుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇవి ఎంతవరకు ఫలిస్తాయనేది వేచి చూడాలి. మరోవైపు బొగ్గు సరఫరా లేక థర్మల్ పవర్ ప్లాంటు, రెండు కోక్ ఓవెన్ బ్యాటరీలు, రెండు బ్లాస్ట్ ఫర్నేసులు, రెండు సింటర్ ప్లాంట్లను మూసేశారు. కోక్ ఓవెన్ బ్యాటరీల ద్వారా వచ్చే వృథా వాయువులతో చాలా యూనిట్లను నడిపిస్తున్నారు. ్జకాగా, ఉక్కు కర్మాగారం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుంటే సాయం చేయాల్సింది పోయి.. విద్యుత్ బిల్లు బకాయి రూ.92 కోట్లు తక్షణమే చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.
Updated Date - Apr 19 , 2024 | 04:45 AM