ఉగ్రంగా.. గోదావరి
ABN, Publish Date - Sep 12 , 2024 | 03:30 AM
రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి). పోలవరం,సెప్టెంబరు 11: గోదావరి ఉగ్రరూపం దాల్చింది.
ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో హెచ్చరిక
బ్యారేజీ వద్ద 15 అడుగుల నీటి మట్టం
14,82,519 క్యూసెక్కులు సముద్రంలోకి
భద్రాచలం వద్ద తగ్గుముఖం
రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి). పోలవరం,సెప్టెంబరు 11: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోలవరం స్పిల్‌వే నుంచి సుమారు 12 లక్షల క్యూసెక్కుల వరద రాజమహేంద్రవరం అఖండ గోదావరిలోకి వస్తోంది. దీంతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద బుధవారం ఉదయం 5 గంటలకు నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మంగళవారం రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం 5 గంటలకు బ్యారేజీ నీటిమట్టం 15 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి దిగువకు 14,82,519 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి వదిలేస్తున్నారు. అటు భద్రాచలం వద్ద వరద బుధవారం మధ్యాహ్నం నుంచి తగ్గుముఖం పట్టింది. అప్పటి వరకూ 50.60 అడుగులకు చేరిన వరద సాయం త్రం 5 గంటలకు 49 అడుగులకు తగ్గింది. కానీ భద్రాచలం నుంచి పాపికొండల మీదుగా పోలవరం స్పిల్‌వే వరకూ భారీగా వరద చేరడంతోపాటు, రాజమహేంద్రవరం అఖండ గోదావరి పోటెత్తడంతో బ్యారేజీ వద్ద వరద ఉగ్రంగానే ఉంది. ఇది బాగా తగ్గాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది. ఈ పరిస్థితుల్లో లంకల్లోని జనాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఘాట్లలో స్నానాలకు ప్రజలు దిగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వినాయక నిమజ్జనాలకు నిబంధనలు
వరద పోటెత్తడంతో వినాయక విగ్రహాల నిమజ్జనాలకు అధికారులు నిబంధనలు విధించారు. ప్రజలెవరూ నేరుగా నిమజ్జనం చేయడానికి వీలులేదని, విగ్రహాలను రేవుల వద్ద అధికార్లకు అప్పగిస్తే వారే నిమజ్జనం చేస్తారని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.
పోలవరం ప్రాజెక్టుకు రాకపోకలు బంద్
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు బుధవారం ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. దీంతో దదపోలవరం ప్రాజెక్టుకి వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో కడెమ్మ వంతెన పూర్తిగా నీట మునిగింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.
శ్రీశైలం గేట్లు మూసివేత
కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
శ్రీశైలం, సెప్టెంబరు 11, విజయవాడ (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి బుధవారం వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో డ్యాం క్రస్టుగేట్లను అధికారులు మూసివేశారు. అయితే జలాశయం ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి జలాశయానికి 1,47,688 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.10 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.5133 టీఎంసీలుగా నమోదైంది. ఏపీ జలవిద్యుత్ కేంద్రం ద్వారా 31,094 క్యూసెక్కులు, తెలంగాణ జల విద్యుత్ కేంద్రం ద్వారా 37,116 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజ్‌కు పెరిగిన ఇన్‌ఫ్లో
ప్రకాశం బ్యారేజ్‌కి మళ్లీ ఇన్‌ఫ్లో పెరిగింది. ఎగువ నుంచి 2.32 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. 2.32 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కాల్వలకు 1709 క్యూసెక్కులు ఇస్తున్నారు. 30 గేట్లను ఏడు అడుగులు, 34 గేట్లను ఆరు అడుగులు మేరకు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఆరు గేట్లను పూర్తిగా కిందికి దించేశారు. పులిచింతల నుంచి ఇన్‌ఫ్లో ఆగిపోయింది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 1,600 క్యూసెక్కుల నీరు బ్యారేజ్‌కి వస్తోంది.
Updated Date - Sep 12 , 2024 | 03:31 AM