YS Jagan : గోబెల్సే సిగ్గుపడేలా..
ABN, Publish Date - Aug 05 , 2024 | 04:40 AM
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పాలించే నాయకుడికి విజన్ ఉండాలి. అలాగే జనరంజక, పారదర్శక పాలన అందించాలంటే సమర్థత ఉండాలి. జగన్‌కు ఈ రెండు లక్షణాలూ లేవని ఓటర్లు తీర్పు చెప్పేశారు.
అబద్ధాలే పునాదిగా జగన్ రాజకీయం
చిత్తుగా ఓడినా మారని వైనం
బాబు ప్రభుత్వంపై విషప్రచారం
36 మంది రాజకీయ హత్యలట
ప్రభుత్వం పేర్లు అడిగితే సైలెంట్
ఇంకా ఎన్నెన్నో ఆరోపణలు ప్రభుత్వం కఠినంగా
ఉండాలంటున్న టీడీపీ శ్రేణులు
చర్యల్లేకుంటే నష్టమని హెచ్చరిక
జగన్ వైఖరితో సొంత పార్టీలోనూ అసంతృప్తి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పాలించే నాయకుడికి విజన్ ఉండాలి. అలాగే జనరంజక, పారదర్శక పాలన అందించాలంటే సమర్థత ఉండాలి. జగన్‌కు ఈ రెండు లక్షణాలూ లేవని ఓటర్లు తీర్పు చెప్పేశారు. అయినా ఆయన మారలేదు. మళ్లీ అబద్ధాల పునాదులపైనే రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ, ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్య కేసుపై నాటకం, పింక్ డైమండ్ కట్టుకథ.. ఇలా జగన్, ఆయన పార్టీ వారు ఎన్నో అబద్ధాలు చెప్పారు. 35 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని అడ్డగోలు ఆరోపణలు చేశారు. చంద్రబాబు రూ.6 లక్షల కోట్ల అవినీతి చేశారంటూ ఏకంగా ఒక పుస్తకం వేశారు. జగనే స్వయంగా ఆరోపణలు చేయడంతో పాటు గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదులు కూడా చేశారు. జనం నమ్మేవరకు ఒకే అబద్ధాన్ని వందచోట్ల, వందసార్లు, వంద మంది చేత వంద రకాలుగా చెప్పించారు. ఈ అబద్ధపు పునాదుల మీదే వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చింది. జగన్ చేసిన ఆరోపణల్లో ఒక్కదాన్ని కూడా నిరూపించలేకపోయారు. గత ఐదేళ్లూ అడ్డగోలుగా పాలన చేశారు. జగన్ నిజస్వరూపం తెలియడంతో ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు. దీంతో మళ్లీ అబద్ధాలతో చంద్రబాబు ప్రభుత్వంపై విషం చిమ్మాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ ఢిల్లీ వెళ్లి గోల చేశారు. వారి పేర్లు, ఎఫ్‌ఐఆర్‌లు ఇవ్వాలని ప్రభుత్వం అడిగితే అటువైపు నుంచి సమాధానం లేదు. జగన్ సైలెంట్ అయ్యారు. కానీ, సోషల్ మీడియాలో ప్రచారం ఆగడం లేదు.
ఈ అబద్ధాల ప్రచారాన్ని ప్రభుత్వం సరిగ్గా ఎదుర్కోలేకపోతోందని, కఠినంగా వ్యవహరించలేపోతోందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఈ వ్యవహారంలో జగన్ తీరుపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ గోబెల్స్ భూతం మరింత భయంకరంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. జగన్‌కు నోటీసులు ఇస్తామని ప్రభుత్వం చెప్పినా, దానికనుగుణంగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదంటూ వాపోతున్నాయి. చంద్రబాబు అధికారం చేపట్టి రెండు నెలలు కూడా కాకముందే 36 రాజకీయ హత్యలు జరిగాయని, సూపర్ సిక్స్ అమలు చేయడం లేదని, ఇసుక ఉచితం కాదని, కమ్మ సామాజిక వర్గం వారికి పోస్టింగుల్లో ప్రాధాన్యమంటూ గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టారు. వీటిపై ప్రతి రోజు వైసీపీ నుంచి ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయకపోతే పార్టీకి నష్టం తప్పదంటూ టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అన్నీ అబద్ధాలే గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు పింక్ డైమండ్ పోయిందన్న అబద్ధాన్ని జనాల్లోకి ఎక్కించడానికి అప్పటి టీటీడీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులను వైసీపీ రంగంలోకి దించింది. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నియమించిన రెండు కమిషన్లు 1952 నుంచి టీటీడీ రికార్డులు పరిశీలించి అసలు పింక్ డైమండ్ అనేదే లేదని నిర్ధారించాయి.
టీడీపీ ప్రభుత్వ హయాంలో 35 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారన్న అబద్ధాన్ని జగన్ విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజలను నమ్మించగలిగారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం మాత్రం ‘మనం ఇవ్వలేదు కదా ఎందుకులే స్పందించడం’ అని సైలెంట్‌గా ఉండిపోయింది. ఫలితంగా 2019 ఎన్నికల్లో నష్టపోయింది. తర్వాత అసెంబ్లీలో జగన్ ప్రభుత్వమే స్వయంగా ఆ 35 మంది మొత్తం కమ్మ సామాజిక వర్గంవారు కాదని చెప్పారు. జగన్ చెప్పిన అబద్ధాలు మచ్చుకుకొన్ని...
విశాఖ విమానాశ్రయంలో జగన్ తనపై చేయించుకున్న కోడికత్తి దాడిని టీడీపీకి ముడిపెట్టారు.
సొంత బాబాయి హత్యకు గురైతే చంద్రబాబే చంపించారంటూ విపరీతమైన ప్రచారం చేశారు. ఈ కేసులో జగన్ సోదరుడు వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి నిందితులుగా ఉన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని 2019కి ముందు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మరిచిపోయారు.
ముస్లిం రిజర్వేషన్లపై రాష్ట్రంలో ఒకలా మాట్లాడి, పార్లమెంటులో అందుకు విరుద్ధంగా బిల్లుపెట్టిన బీజేపీకి మద్దతిచ్చారు.
విశాఖలో పెట్టుబడుల సదస్సు పెట్టి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ఖరీదైన అబద్ధం చెప్పారు. దీనివల్ల రూపాయి కూడా రాకపోగా, ఆ సదస్సు నిర్వహణకు పెట్టిన ఖర్చులు కూడా దండగేనని అంటున్నారు.
మద్యపాన నిషేధమని చెప్పి ఆ వ్యాపారాన్ని తాకట్టు పెట్టి రూ.50,000 కోట్ల అప్పులు తెచ్చారు. పైగా మద్యం వినియోగం తగ్గిందంటూ అసెంబ్లీలో అసత్యపు ప్రకటన చేశారు.
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం అసెంబ్లీ వేదికగా 3 రాజధానుల ప్రకటన చేశారు.
వారం రోజుల్లో సీపీఎస్ రద్దంటూ ఉద్యోగులను మోసం చేశారు.
జగన్ నిజాలు చెప్పినా నమ్మరేమో
పదేళ్ల నుంచీ జగన్ అబద్ధాలు దగ్గరగా చూసిన వైసీపీ నేతలు ఈ ధోరణి తమ పార్టీకి నష్టం కలిగిస్తుందంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఈ అబద్ధాలే తమను నిండా ముంచాయని, ఇకపై జగన్ నిజాలు చెప్పినా ఎవ్వరూ నమ్మరేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నోట్లో నుంచి ఒక విమర్శ వచ్చిందంటే అది 100 శాతం నిజమై ఉండాల ని అంటున్నారు. ఈ అబద్ధాల వల్ల ప్రజలు తమ పార్టీని ద్వేషిస్తారని, ఇలాగే కొనసాగితే పార్టీ మనుగడకే ప్రమాదమని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Aug 05 , 2024 | 07:57 AM