తాడేపల్లికి ఏసీబీ సీఐయూ విభాగం తరలింపు
ABN, Publish Date - Nov 30 , 2024 | 03:22 AM
విజయవాడ ఆర్టీసీ బస్టాండు ప్రాంగణం-ఎన్టీఆర్ పరిపాలన భవనంలో ఉన్న అవినీతి నిరోధక శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోని కీలకమైన సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్(సీఐయూ) విభాగాన్ని తాడేపల్లికి తరలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కీలకమైన కేసుల దర్యాప్తుకు ఆటంకాలు కూడదనే..!
అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): విజయవాడ ఆర్టీసీ బస్టాండు ప్రాంగణం-ఎన్టీఆర్ పరిపాలన భవనంలో ఉన్న అవినీతి నిరోధక శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోని కీలకమైన సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్(సీఐయూ) విభాగాన్ని తాడేపల్లికి తరలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన కేసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలూ కలగకుండా ఈ విభాగాన్ని వేరేచోటుకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో ఏపీకి వచ్చిన ప్రభుత్వ కార్యాలయాలకు ఆర్టీసీ యాజమాన్యం భవనాలను అద్దెకు ఇచ్చింది. ఏసీబీ(డీజీ) హెడ్ ఆఫీస్ బెజవాడ బస్టాండ్‌లోని రెండో అంతస్తు, మూడో అంతస్తుల్లో సుమారు 12వేల చదరపు అడుగుల్లో కొలువైంది. అయితే అదే భవనంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో ఏసీబీ వ్యవహారాలు, వ్యూహాలు, సోదాల విషయం బయటికి తెలుస్తోందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీలోని కీలకమైన సీఐయూ విభాగాన్ని తాడేపల్లిలోని పూజిత అపార్ట్‌మెంట్‌లోగల నిర్మల భవన్‌లోకి మార్చేందుకు ప్రభు త్వం అనుమతిచ్చింది. సుమారు ఏడువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనానికి అడుగుకు రూ.29.50ల చొప్పున అద్దె చెల్లించేందుకు సమ్మతిస్తూ శుక్రవారం సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Updated Date - Nov 30 , 2024 | 03:22 AM