బుగ్గవాగు ప్రాంగణం.. అంధకారం
ABN, Publish Date - Nov 17 , 2024 | 01:20 AM
లక్షలాది ఎకరాలకు సాగు నీరందించే.. అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా మారే.. మంచికల్లు బుగ్గవాగు రిజర్వాయర్ ప్రాంగణం గాఢాంధకారంలో ఉంది.
అలంకార ప్రాయంగా విద్యుత్ పోల్స్
పట్టించుకోని పాలకులు, అధికారులు
రెంటచింతల, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): లక్షలాది ఎకరాలకు సాగు నీరందించే.. అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా మారే.. మంచికల్లు బుగ్గవాగు రిజర్వాయర్ ప్రాంగణం గాఢాంధకారంలో ఉంది. లక్షలాది రూపాయల ప్రజాధనం నీటి పాలై ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రెంటచింతల మండలం మంచికల్లు గ్రామ పరిధిలో 3300 ఎకరాల్లో బుగ్గవాగు రిజర్వాయర్‌ను నిర్మించారు. గుంటూరు ప్రకాశం జిల్లాల పరిధిలోని 11 లక్షల 17 వేల ఎకరాలకు సాగునీరందిస్తుంది. ఇక్కడ 170 డెకరేటివ్ పోల్స్, 40 సింగిల్ ఆర్స్ పోల్స్, 6 హైమాస్క్ లైట్లు, త్రీఫేజ్ కరెంట్ ట్రాన్స్‌పార్మర్ ఏర్పాటు చేశారు. అయితే మిరుమిట్లు గొలిపే కాంతితో బుగ్గవాగు ధగధగ మెరిసిపోతుందని భావిస్తే తప్పులో కాలేసినట్లే. ఇక్కడ విద్యుత సౌకర్యాలు ఉన్నా అవి వినియోగంలో లేవు. ట్రాన్సఫార్మర్ నుంచి విద్యుత సరఫరా లేక సాయంత్రం అయితే అంధకారం అలుముకుంటుంది. గత పాలకుల పనితీరును వెక్కిరించేలా తుప్పు పట్టిన షట్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్ దర్శనమిస్తాయి. 6 షట్టర్లపై భాగాన లైట్లు ఉన్నా వెలిగిన దాఖలాలు లేవు. నాగార్జునసాగర్ కుడికాల్వ కింద బుగ్గవాగు రిజర్వాయరు నిర్మాణ పనులు 1955లో ప్రారంభించి 1967లో ముగించారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తాత తిరుమలయ్య కృషి ఫలితంగా ప్రాజెక్టు పట్టాలెక్కింది. అప్పటి ఉప ప్రధాన మొరార్జీ దేశాయ్ 1967 జులై 16న ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రారంభంలో 4.5 టీఎంసీల నీరు నిల్వ చేసినప్పటికీ కాలక్రమేణా పూడిక పేరుకుపోవడంతో 3.463 టీఎంసీలకు మించి నీరు నిల్వ చేసే అవకాశం లేకుండాపోయింది. చిట్టడవిలా ఉండే రిజర్వాయర్ ప్రాంతం పాములకు ఆవాసంగా మారింది. రాత్రి వేళల్లో చిమ్ము చీకట్లు అలుముకోవడంతో విధులు నిర్వహించే వాచ్‌మన్, లస్కర్లకు ఎంతో ఇబ్బందికరంగా మారింది.
ఆధునికీకరణపై సీఎం దృష్టికి
బుగ్గవాగు రిజర్వాయరు ఆఽధునికీకరణ, ఇక్కడి సమస్యల గురించి సీఎం చంద్రబాబుకు దృష్టికి తీసుకెళ్తాను. పర్యాటక కేంద్రంగా చేయడానికి అన్ని హంగులున్నాయి. పాపికొండలు తరహాలో బుగ్గవాగు, టెయిల్‌పాండ్ రిజర్వాయర్‌ను అభివృద్ధి చేసి బోట్ సౌకర్యం కల్పించాలనే విషయాన్ని ఎమ్మెల్యే యరపతినేనితో కలిసి సీఎం చంద్రబాబు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు వివరిస్తాను. - బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే మాచర్ల
Updated Date - Nov 17 , 2024 | 01:20 AM