పాఠశాల నిర్వహణ సరిగా ఉండాలి
ABN, Publish Date - Nov 21 , 2024 | 12:56 AM
పాఠశాలల నిర్వాహణ సరిగా ఉండాలని, విద్యార్ధులు చక్కగా చదువుకునే అవకాశాలు కల్పించాలని కలెక్టర్ జె.వెంకటమురళి తెలిపారు.
బాపట్ల, రేపల్లె, నవంబరు20 (ఆంధ్రజ్యోతి) : పాఠశాలల నిర్వాహణ సరిగా ఉండాలని, విద్యార్ధులు చక్కగా చదువుకునే అవకాశాలు కల్పించాలని కలెక్టర్ జె.వెంకటమురళి తెలిపారు. బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్, చెరుకుపల్లి మండలంలోని చెరుకుపల్లి, గుళ్ళపల్లి, కావూరులోని ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయా పాఠశాలలోని పరిసరాలను పరిశీలించిన ఆయన ఉపాధ్యాయులకు పలుసూచనలు చేశారు. తరగతి గదులలో విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య, హాజరైనవారి సంఖ్య, ఆటస్థలాన్ని పరిశీలించారు. కొత్తగా నిర్మాణం చేపట్టిన భవనం త్వరగా పూర్తి చేయటానికి గుత్తేదారుడికి ఆదేశాలివ్వాలని సూచించారు. చెరుకుపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కె.లక్ష్మీ నారాయణను ఆ పాఠశాలకు సంబంధించిన టీచీంగ్, నాన్‌టీచీంగ్ స్టాప్ వివరాలు, పేరెంట్‌మీటింగ్ నిర్వాహణ, క్రీడాప్రాంగణం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రహరీ పునర్ నిర్మాణానికి తీసుకున్న చర్యలు, టాయిలెట్ల పరిశీలన వాటి నిర్వాహణ, మధ్యాహ్నభోజనానికి సంబంధించిన వంట గదిని పరిశీలించారు. అదేవిధంగా చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నిర్వాహణపై ఆరా తీశారు. కావూరు ఉన్నత పాఠశాలను సందర్శించి తల్లిదండ్రుల సమావేశాల నిర్వహణపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీపీవో ప్రభాకర్, జిల్లా ఇన్‌చార్జి విద్యాశాఖాధికారి ఎ.శ్రీనివాసరావు, బాపట్ల మున్సిపల్ కమిషనర్ జి.రఘునాధరెడ్డి, బాపట్ల ఆర్‌డివో పి.గ్లోరియా, బాపట్ల తహసీల్దార్ షేక్ సలీమా, ఇనచార్జ్ ఆర్డివో చంద్రశేఖర్‌నాయుడు, పీపీవో ప్రభాకరరావు, ఎంఈవో లాజర్, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీవో సుభాని పాల్గొన్నారు.
Updated Date - Nov 21 , 2024 | 12:56 AM