ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాలమ్‌-6.. సరిదిద్దారు

ABN, Publish Date - Nov 17 , 2024 | 01:19 AM

భూముల రికార్డులను కంప్యూటరీకరించే సమయంలో జరిగిన పొరపాట్లు రైతుల మెడకు గుదిబండలా మారాయి.

మూడేళ్ల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం

తెనాలిలో రెవెన్యూ శాఖ ప్రయోగం విజయవంతం

ఈ దిశగా అంతటా పరిష్కారం చూపితే ఫిర్యాదులు తగ్గినట్లే

భూ రికార్డుల ఆధునికీకరణలో జరిగిన పొరపాట్లు.. వైసీపీ హయాంలో చేసిన తప్పులు.. భూ యజమానులకు గుదిబండగా మారాయి. తరతరాల నుంచి వచ్చినా.. రెక్కల కష్టంతో కొనుగోలు చేసినా.. అవి ప్రభుత్వ భూములుగా చూపించడంతో యజమానులు విలవిలలాడిపోయారు. క్రయవిక్రయాలు లేక అల్లాడిపోయారు. కాలమ్‌ నంబరు-6లో సవరణ.. వేల మంది భూ యజమానులకు సంకటంగా మారింది. అత్యవసర సమయంలో అమ్ముకుంటే ఆర్థికంగా అండగా ఉంటుందనుకున్న భరోసాతో ఉన్న యజమానులకు అడంగల్‌లో జరిగిన లోపాలు కొరకరాని కొయ్యగా మారాయి. ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారులు సమస్యపై దృష్టి సారించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజా ఫిర్యాదులు పరిష్కారానికి శ్రీకారం చుడితే, ఇందులో అందుతున్న ఫిర్యాదుల్లో ఈ తరహావే 60 శాతం ఉన్నాయంటే సమస్య తీవ్రతకు అద్దంపడుతుంది. ఈ తరుణంలో గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు దీనిపై దృష్టిపెట్టారు. తప్పు జరిగిన మూలాలనే సరిదిద్దే కార్యక్రమం చేపట్టడంతో రైతుల సమస్యకు పరిష్కారం లభించింది.

తెనాలి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): భూముల రికార్డులను కంప్యూటరీకరించే సమయంలో జరిగిన పొరపాట్లు రైతుల మెడకు గుదిబండలా మారాయి. రైతులకు అడంగల్‌లోని కాలమ్‌ నంబరు-6లో జరిగిన లోపాలు కొరకరాని కొయ్యగా మారాయి. అమ్మబోతే ప్రభుత్వ భూమిని నువ్వెట్లా అమ్ముతావని రిజిస్ట్రేషన్‌ శాఖ తిప్పి పంపితే, పట్టా ఉండి, సర్వ హక్కులూ ఉన్నా ఇదేం ఖర్మంటూ రైతులు ఆవేదన వర్ణనాతీతం. ఇది ఏదో ఒక్క మండలానికో.. గ్రామానికో పరిమితం కాలేదు. రాష్ట్రం మొత్తంమీద ఇదే పరిస్థితి. భూ రికార్డుల కంప్యూటరీకరణ సమయంలో కొందరు సిబ్బంది నిర్లక్ష్యం, త్వరితగతిన పూర్తి చెయ్యాలన్న అప్పటి అధికారుల ఒత్తిడితో రైతుల భూ హక్కులకు ఇబ్బందులు వచ్చిపడ్డాయి. 2012కు ముందు క్రక్స్‌ అనే సాఫ్ట్‌వేర్‌తో మాన్యువల్‌గా భూ రికార్డులను తయారు చేసేది. 2012లో వెబ్‌లాండ్‌ సాఫ్ట్‌వేర్‌ రావడంతో అన్ని రికార్డులను కంప్యూటరీకరించారు. అయితే ఆ సమయంలో అందుబాటులో ఉన్న రికార్డులను ఉన్నవి ఉన్నట్లు ఎక్కించేస్తే, అందుబాటులో లేనివి, ఉన్నా పొరపాటు కారణంగా కాలం నంబరు 6లో తప్పుగా నమోదు చేశారు. ఇక్కడ ప్రభుత్వ భూమా? పట్టా భూమా అని ఉండాల్సి ఉంటే, దాని స్థానంలో రైతులకు అన్ని హక్కులున్నా, ప్రభుత్వ భూమిగా నమోదు చేసేశారు. వైసీపీ సర్కారు వచ్చాక ఇంకొన్ని కావాలనే స్థానిక నేతల ఒత్తిడితో మార్చేశారు. గతంలో ఇలాంటి తప్పులను సవరించడానికి తహసీల్దార్లకు అవకాశం ఉండేది. అయితే దీనివల్లే సమస్యలు ఎక్కువ అవుతున్నాయని తెలిసి కలెక్టర్‌, జేసీ స్థాయి అధికారి అనుమతి లేకుంటే భూముల రికార్డుల్లో మార్పులకు వీలు లేకుండా లాక్‌ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ క్రమంలో తప్పులను సరిదిద్దండి మహాప్రభో అంటూ వైసీపీ ప్రభుత్వంలో రైతులు చెప్పులరిగేలా కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకున్న నాథుడే లేడు. నంబరు - 6 సమస్యకు ఆర్‌.ఎస్‌.ఆర్‌ ఆధారంగా మార్పులు చేసే అవకాశం ఉన్నా అధికారులు ఆ దిశగా చేసిందేలేదు. పైగా రైతుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు కావాలనే దరఖాస్తులో లోపాలు చూపించి మూడేళ్లుగా తిప్పుతూనే వచ్చారు.

సీఎంకు అందిన అర్జీతో.. తెనాలిలో తీగలాగితే

తెనాలికి చెందిన ఖాజాబీ అనే మహిళ తన కుమారుడి ఆరోగ్యం సరిగాలేదని, తనకున్న భూమిని అమ్మితేనే వైద్యం చేయించుకుని బతికించుకోగలని రికార్డుల లోపాలను సరిచేయాలని రెండు నెలల క్రితం సీఎం చంద్రబాబుకు అర్జీ పెట్టారు. ఇదే తరహాలో తెనాలి నుంచి 49 మంది అర్జీలు అందాయి. అయితే సీఎంకు అర్జీ ఇచ్చినా ఖాజాబీ సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో పదిరోజుల క్రితం కుమారుడు చనిపోయాడని ఖాజాబీ తెనాలి తహసీల్దార్‌ను కలిసి కన్నీరు పెట్టుకుంది. దీనికితోడు సీఎం నుంచి ఈ తరహా అర్జీలపై పరిష్కారానికి ఒత్తిడి రావటంతో దీనిపై తహసీల్దార్‌ గోపాలకృష్ణ స్పందించారు. అసలు సమస్యపై కసరత్తు చేస్తే, ఒక్క తెనాలి మండలంలోనే 5,808 భూ రికార్డుల్లో లోపాలు జరిగినట్లు గుర్తించారు. అటు నరసరావుపేట సబ్‌ డివిజన్‌ పరిధిలోనూ అక్కడి అధికారులు మరో వెయ్యి మంది, గుంటూరు డివిజన్‌ పరిధిలో మరో 1600 రైతుల రికార్డుల్లో లోపాలను ప్రాఽథమికంగా గుర్తించారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో ఏ సర్వే నంబరు భూమి ఏ విభాగంలో ఉందనేది స్పష్టంగా ఉండటంతో రైతులను తిప్పాల్సిన పనిలేకుండా సవరించవచ్చన్న విషయాన్ని తెలుసుకున్నారు. ఇదే విషయాన్ని తెనాలి సబ్‌కలెక్టర్‌ సంజనా సింహ, గుంటూరు జేసీ భార్గవ్‌ తేజ దృష్టికి తీసుకువెళ్లారు. వారుకూడా సానుకూలంగా స్పందించారు. దీంతో కేవలం పక్షం రోజుల్లో మూడేళ్లనాటి సమస్యకు పరిష్కారం చూపారు. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే తరహా చర్యలకు రెవెన్యూ అధికారులు ముందుకు వస్తే రైతుల కష్టానికి ఊరట లభించినట్టే. తెనాలిలో గుర్తించిన 5,808 రైతుల రికార్డుల్లో 5,763 మంది రికార్డులను సరిదిద్దారు. మరో 45 మంది రైతులకు సంబంధించిన రికార్డుల విషయంలో సాంకేతిక ఇబ్బందులు ఉండటంతో జేసీ దృష్టికి తీసుకువెళ్లామని, వాటికి కూడా త్వరలో పరిష్కారం లభిస్తుందని తహసీల్దార్‌ గోపాలకృష్ణ ఆంధ్రజ్యోతికి తెలిపారు.

పరిష్కారం లభించింది

అనారోగ్యంతో ఉన్న కుమారుడు ఫకీర్‌ను బతికించుకునేందుకు 2.61 ఎకరాల భూమిని అమ్ముకోవాలనుకుంటే ప్రభుత్వ భూమి కింద ఉంది అమ్మడానికి కుదరదన్నారు. సంవత్సరంన్నర నుంచి తిరిగినా పట్టించుకున్నవారులేరు. గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అర్జీ పెట్టుకున్నాం. ఆయన స్పందించినా కొందరు అధికారులు లంచాల ఆశతో మా అర్జీకి పరిష్కారం చూపలేదు. పది రోజుల క్రితం మా అబ్బాయి చనిపోయాడు. అదే విషయాన్ని మళ్లీ సీఎం దృష్టికి తీసుకువెళదామని అనుకుంటున్న తరుణంలో రికార్డులు సరిచేశారని, సమస్య పరిష్కారం అయిందని తహసీల్దార్‌ చల్లని కబురు చెప్పారు. నాతోపాటే చాలామంది కష్టం తీరిందని తెలిసి సంతోషపడ్డాం. నాకు ఉపయోగపడకపోయినా, మిగిలినవారి అవసరాలకైనా అండగా ఉంటుందనుకున్నాం. - ఖాజాబీ, తెనాలి

ఎన్నిసార్లు తిరిగామో

మా భూమిపై మాకు హక్కులేదన్నారు. అడంగల్‌లో చూస్తే ప్రభుత్వ భూమి అని చూపిస్తుంటే, అధికారులను కలసి విన్నవిస్తే, చూస్తాం, చేస్తాం అంటూ మూడేళ్లుగా తిప్పారు. ఎట్టకేలకు సమస్యకు పరిష్కారం లభించింది. చిన్న సవరణకు సంవత్సరాలు పట్టింది. నిజంగా అధికారులు మనస్పూర్తిగా చేస్తే మాకు ఇటువంటి సమస్యలు ఉండవు. - వి.పద్మలత, బుర్రిపాలెం

రైతులకు మేలు జరిగితే చాలని

నేను తెనాలి తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టాక వచ్చిన ఫిర్యాదుల్లో అధికశాతం భూములకు సంబంధించినవే. ఈ క్రమంలో రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పడం సరికాదని, లోపం ఎక్కడనేది అన్వేషిస్తే అసలు పొరపాటు బయటపడింది. దీనిపై జిల్లా అధికారులకు విన్నవిస్తే సానుకూలంగా స్పందించారు. జేసీ ప్రత్యేక ఉత్తర్వులిచ్చారు. సిబ్బంది రాత్రి పగలు తేడా లేకుండా ఆన్‌లైన్‌ రికార్డులను సరిచేశారు. మూడేళ్లుగా తిరిగిన రైతులు ఇప్పుడు సంతోషంతో ఉన్నారు. - గోపాలకృష్ణ, తమసీల్దార్‌, తెనాలి

Updated Date - Nov 17 , 2024 | 01:19 AM