ష్..
ABN, Publish Date - May 12 , 2024 | 01:19 AM
సార్వత్రిక ఎన్నికల ప్రచారం పరిసమాప్తమైంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు శనివారం సాయంత్రం 6 గంటలకు నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. కాగా చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలు, రోడ్ షోలు, సభలతో హోరెత్తించి ఎన్నికల ప్రచారానికి ముగింపు పలికారు.
మూగబోయిన ఎన్నికల మైకులు
ఓటర్లకు ప్రలోభాల ఎరలో అభ్యర్థులు
పోల్ మేనేజ్‌మెంట్‌పై రాజకీయ పార్టీల దృష్టి
గుంటూరు, బాపట్ల, మే 11 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల ప్రచారం పరిసమాప్తమైంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు శనివారం సాయంత్రం 6 గంటలకు నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. కాగా చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలు, రోడ్ షోలు, సభలతో హోరెత్తించి ఎన్నికల ప్రచారానికి ముగింపు పలికారు. దీంతో ఎన్నికల మైకులు మూగబోయాయి. దాదాపు రెండు నెలలుగా ప్రచార హోరుతో దద్దరిల్లిన గ్రామాలు, పట్టణాలన్నీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. ఓటరు దేవుళ్లను ప్రనన్నం చేసుకోవడానికి చివరి ప్రయత్నంగా శనివారం సాయంత్రం వరకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఇంతకాలం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి మండుటెండల్లో ప్రచారం చేసిన నేతలు రహస్యమంతనాలు, ప్రలోభాలపై దృష్టిసారించేందుకు ప్రణాళికలు రూపొందించుని రంగంలోకి దిగారు. పోలింగ్‌కు కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున బూతల వారీగా బలాబలాలపై మరోమారు సమీక్ష జరుపుకునే పనిని ఆదివారం నేతలు చేయనున్నారు. ప్రతికూలంగా ఉన్న చోట్ల రహస్యమంతనాలు జరపడానికి ప్రణాళికలు రచించి దానికి అనుగుణంగా అడుగులు వేయనున్నారు. ప్రచార గడువు ముగియడంతో జెండాలు, కండువాలు లేకుండా గ్రామాల్లో, పట్టణాల్లో నేతలతో పాటు వారి అనుచరులు తిరగడానికి ప్రణాళికలు రచించారు. రాత్రివేళల్లో ఓటరు స్లిప్పుతో పాటు ఓటుకు రేటుతో నగదు పంపిణీని నేతల అనుచరులు పంచుతున్నారు. ఓటుకు రూ.1,500 నుంచి 2,000 వరకు ఇస్తూ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలను ముమ్మరంగా చేశారు. మద్యం దుకాణాలకు సాయంత్రం 6 గంటల నుంచి ఎక్సైజ్ అధికారులు సీలు వేశారు.
సుదీర్ఘంగా ఎన్నికల ప్రక్రియ
ఈ దఫా ఎన్నికల ప్రచారం సుదీర్ఘంగా సాగింది. షెడ్యూల్ మార్చి 16న విడుదల కాగా నోటిఫికేషన్ నెలా రెండు రోజుల తర్వాత ఏప్రిల్ 18న విడుదలైంది. అప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. గత ఎన్నికల్లో తొలి విడతలోనే పోలింగ్ జరగ్గా ఈ దఫా నాల్గో దశలో జరగబోతున్నాయి. రాజకీయ పార్టీలకు ఎక్కువ సమయం లభించడంతో నియోజకవర్గాల వారీగా సభలు, రోడ్ షోలను పార్టీల అధ్యక్షులు నిర్వహించారు. దాదాపుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలల్లో ఏదో ఒక రూపంలో ప్రచారం చేశారు. ఎన్‌డీఏ కూటమి తరపున ప్రధాని నరేంద్రమోదీ, టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితరులు తొలి అడుగు చిలకలూరిపేట నియోజకవర్గంలోని బొప్పూడి ఆంజనేయస్వామి పాదాల చెంత నుంచి ప్రచారం ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రచార సభలు, రోడ్ షోలతో ప్రధాన పార్టీల నాయకులు హోరెత్తించారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం పేరుతో బహిరంగ సభలు నిర్వహించారు. గుంటూరులో చంద్రబాబు రోడ్ షోకు వేలాదిగా ప్రజలు హాజరై మద్దతు తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తెనాలి, పొన్నూరుల్లో ప్రచార సభలు, రోడ్‌షోలు నిర్వహించి కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్లను చైతన్యపరిచారు. కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ షర్మిల గుంటూరు, బాపట్ల, చీరాల, రేపల్లెలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించారు. కాగా అధికార యంత్రాంగం రెండు నెలలపై నుంచి ఎన్నికల నిర్వహణ పైనే పూర్తిగా నిమగ్నమైంది. పోస్టల్ బ్యాలెట్ సందర్భంగా కొంత సమస్యలు ఎదురైనప్పటికీ గడువుని పెంచి అందరూ ఓటుహక్కు వినియోగించుకునేలా చేశారు. ఈ ఎన్నికల్లో ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన హోంఓటింగ్‌ని సజావుగా నిర్వహించారు.
Updated Date - May 12 , 2024 | 01:19 AM