ముమ్మరంగా ఎక్సైజ్ తనిఖీలు
ABN, Publish Date - Nov 23 , 2024 | 01:07 AM
బెల్టు దుకాణాలు, మద్యం దుకాణాల్లో లూజు విక్రయాలు, ఎమ్మార్పీలపై గుంటూరు, పల్నాడు జిల్లాల్లో శుక్రవారం సీఐల నేతృత్వంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
అమ్మకాలు, ధరలపై ప్రత్యేకంగా పరిశీలన
20 బెల్టుషాపులపై కేసులు.. 15 మంది అరెస్టు
ఆంధ్రజ్యోతిలో కథనంతో ఎక్సైజ్ అధికారుల్లో కదలిక
బెల్టు షాపులపై ఉక్కుపాదం : డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాస్
తెనాలి క్రైం, గంటూరు(కార్పొరేషన్), నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): బెల్టు దుకాణాలు, మద్యం దుకాణాల్లో లూజు విక్రయాలు, ఎమ్మార్పీలపై గుంటూరు, పల్నాడు జిల్లాల్లో శుక్రవారం సీఐల నేతృత్వంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. శుక్రవారం ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో వాడవాడలా మద్యం అనే శీర్షికన ప్రచురితమైన ప్రత్యేక కథనంపై ఎక్సైజ్ డీసీ డాక్టర్ కె.శ్రీనివాసులు స్పందించారు. గుంటూరు జిల్లాలో మొత్తం ఆరు బెల్టు షాపులపై కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. 9.27 లీటర్ల మద్యాన్ని, 7.80 లీటర్ల బీరును సీజ్ చేశారు. చిలకలూరిపేట, పెదకూరపాడు, వినుకొండ, పిడుగురాళ్ల ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఏడు బెల్టు షాపులపై కేసులు నమోదు చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. 10.80 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. మాచర్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎన్‌డీపీఎల్ కేసు నమోదైంది. 8 బీర్ బాటిళ్లను కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారు. మాచర్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఆరు సారా కేసులు నమోదు చేసి ఒకర్ని అరెస్టు చేశారు. రెండు లీటర్ల సారాని స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీకి వాడే ముడిపదార్థాలను ధ్వంసం చేశారు.
రంగంలోకి ప్రత్యేక నిఘా బృందాలు
మద్యం బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపినట్లు, ఇప్పటికే ప్రత్యేక నిఘా బృందాలు రంగంలోకి దిగాయని ఎక్సైజ్ డీసీ డాక్టర్ కె.శ్రీనివాస్ తెలిపారు. తెనాలిలోని ఎక్సైజ్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఎక్సైజ్ పాలసీని పరిశీలించిన అనంతరమే ప్రభుత్వం రాష్ట్రంలో ఉత్తమమైన మద్యం పాలసీని తీసుకు వచ్చిందన్నారు. నెల రోజుల్లో 235 కేసులు నమోదు చేశామని, మద్యం అక్రమ అమ్మకందారులు 215 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఒక వ్యక్తి వద్ద మూడు బాటిల్స్ కంటే మించి ఉండకూదదన్నారు. మద్యం అక్రమ అమ్మకాలు చేసినా, ప్రోత్సహించినా ఆ దుకాణదారుడికి రూ.5 లక్షల పెనాల్టీ విధిస్తామని తెలిపారు. రెండోసారి కేసు నమోదైతే షాపు లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. గతంలో మద్యం ధరల భారం ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం అందుబాటు ధరలు ఉండటంతో అమ్మకాలు పెరిగాయన్నారు. బెల్ట్‌షాపులపై తనిఖీలకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ వి.అరుణకుమారి, సీఐ యం.యశోధరదేవి, ఎస్‌ఐలు, ఫణికుమార్, శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Nov 23 , 2024 | 01:07 AM