ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులకు.. రాయితీలు

ABN, Publish Date - Nov 29 , 2024 | 12:51 AM

గడచిన ఐదేళ్లూ రైతుల సంక్షేమాన్ని విస్మరించడమే కాకుండా వ్యవసాయాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన ఘనత వైసీపీది. 2014--19 మధ్య కొనసాగిన అనేక పథకాలకు గత పాలకులు మంగళం పాడారు.

వైసీపీ ప్రభుత్వంలో అటకెక్కిన పథకాలు పునరుద్ధరణ

ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లొనూ పెద్ద ఎత్తున కేటాయింపులు

గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు రూ.700 కోట్ల వరకు లబ్ధి

(బాపట్ల, ఆంధ్రజ్యోతి)

గడచిన ఐదేళ్లూ రైతుల సంక్షేమాన్ని విస్మరించడమే కాకుండా వ్యవసాయాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన ఘనత వైసీపీది. 2014--19 మధ్య కొనసాగిన అనేక పథకాలకు గత పాలకులు మంగళం పాడారు. ఇక కౌలు రైతులకు అందించే రుణాల విషయంలో నిబంధనాల చట్రంలో వారిని బిగించేశారు. విత్తన రాయితీలు, వ్యవసాయ అనుబంధ పాడిపరిశ్రమకు ఊతమిచ్చే అనేక కార్యక్రమాలను అటకెక్కించిన గత పాలకులు అన్నదాతల వెన్ను విరిచారు. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉండేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ క్రమంలో గతంలో రైతులకు అందించిన అన్ని రాయితీలను తిరిగి పునరుద్ధరించింది. ఇందుకు సంబంధించి రైతు సేవా కేంద్రాలు రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నాయి. మొన్నటి బడ్జెట్‌లో కూడా వ్యవసాయానికి పెద్ద పీట వేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వం రైతులకు కావాల్సిన యంత్రపరికరాలను వ్యక్తిగతంగా రాయితీపై అందించేది. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి చెప్పి గ్రూపుల పేరిట వైసీపీ శ్రేణులకు లబ్ధి చేకూర్చింది. ప్రస్తుతం యంత్ర పరికరాలను తిరిగి రైతులకు వ్యక్తిగతంగా అందించడానికే కూటమి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. తైవాన్‌ స్ర్పేయర్ల విషయంలో రైతులకు 8 నుంచి 10 వేల వరకు రాయితీని అందించడానికి కూటమి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. రైతులకు కావాల్సిన ట్రాక్టర్‌, నూర్పిడి యంత్రాలతో పాటు అత్యాధునికంగా మార్కెట్‌లోకి వచ్చిన వ్యవసాయ అనుబంధ యంత్రాలను రాయితీపై అందించే విధంగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో దాదాపు రూ.220 కోట్ల వరకు వ్యయం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు

కౌలు రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి..

గత ప్రభుత్వ హయాంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన కౌలు రైతులను ఆదుకోవడానికి కూటమి పాలకులు ప్రత్యేక దృష్టిసారించారు. కేవలం సీసీఆర్‌సీ కార్డుల జారీతో సరిపెట్టకుండా రుణాలను కూడా వారి దరికి చేర్చేలా ఆదేశాలు జారీ చేశారు. కౌలు రైతులను ఆదుకోవడంలో తమతో పాటు బ్యాంకర్లు కూడా కలిసిరావాలని పాలకులు కోరారు. గడచిన ఐదేళ్లలో ఏ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనూ ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వంద కోట్లకు మించి కౌలు రైతులకు రుణాలివ్వలేదు. అలాంటిది ఈ ఆర్థికసంవత్సరంలో దాదాపు రూ.220 కోట్ల వరకు రుణాల ద్వారా కౌలు రైతులు లబ్ధి పొందనున్నారు

ఉద్యాన సాగు రాయితీలు..

ఉద్యాన పంటలకు అందించే రాయితీల విషయంలో కూడా ఓ లక్ష్యంలో అధికారులు ముందుకెళుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గుంటూరు, బాపట్ల, పల్పాడు మూడు జిల్లాల పరిధిలో కలిపి దాదాపు రూ.90 కోట్ల వరకు ఉద్యాన సాగుకు ప్రోత్సాహకాలు అందించే విధంగా కార్యాచరణ రూపొందించారు. ఉద్యాన సమగ్ర అభివృద్ధి మిషన్‌ కింద పండ్ల తోటల పెంపకం, కోల్డ్‌ స్టోరేజ్‌ల ఏర్పాటు, ఎఫ్‌పీవోలో ఉన్న సభ్యులకు శిక్షణ ఇచ్చి మెరుగైన మార్కెటింగ్‌ చేసుకునే సదుపాయిం కల్పించడం ఇందులో ముఖ్యమైనవి. మల్పింగ్‌ షీట్లు, పందిళ్ల నిర్వహణకు తోడు విస్తరణ వంటి అనేక పథకాలకు కేంద్రం అందించే మొత్తాలకు మ్యాచింగ్‌ గ్రాంటు జత చేసి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన రైతులకు అందించనుంది

రాయితీపై విత్తనాలు...

50 శాతం రాయితీపై విత్తనాలు అందించే పథకానికి కూడా గత ప్రభుత్వం తూట్లు పొడిచింది. రాయితీని పదిశాతానికి పరిమితం చేసి రెండేళ్ల పాటు అందించిన వైసీపీ ప్రభుత్వం ఆ తర్వాత దానికి కూడా పూర్తిగా మానేసింది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోనే విత్తనాలు పంపిణీ చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. సాగుదారులపై ఎకరానికి దాదాపు 5 నుంచి ఆరు వేల వరకు ఈ రాయితీ విత్తనాల వల్ల భారం తగ్గనుంది. దీని వల్ల ప్రభుత్వంపై మూడు జిల్లాల పరిధిలో అదనంగా పడే భారం దాదాపు రూ.120 కోట్ల వరకు ఉండొచ్చనేది అంచనా.

భూసార పరీక్షలు.. అగ్రి ల్యాబ్‌లు..

ఏ పంటకు నేల అనువుగా ఉంటుందో శాస్త్రీయ పరీక్షల్లో అధ్యయనం చేసి వాటి ఫలితాలను రైతులకు అందించడం ద్వారా వారికి ప్రభుత్వం మేలు చేసినట్లవుతోంది. కానీ గడచిన ఐదేళ్లలో ఒక్క శాంపిల్‌ను కూడా పరీక్ష జరిపి రైతులకు ఫలితాలను అందించిన దాఖలాలే లేవు. ఇక అగ్రిల్యాబ్‌లు సంగతి చెప్పక్కర్లేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తొలినాళ్లలోనే భూసార పరీక్షలపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా నిర్వహణ ఖర్చులకు నిధులను సైతం జారీ చేసింది. ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన వ్యవసాయ బడ్జెట్‌లో కూడా అన్నదాతల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కేటాయింపుల జరిపిన సంగతి తెలిసిందే. వీటిలో ముఖ్యంగా కరకట్టల పటిష్టతతో పాటు కాల్వల్లో పూడికతీతలు ప్రధానంగా ఉన్నాయి. వీటికి తోడు రైతు సంక్షేమం కోసం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వివిధ పథకాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల వరకు వ్యయం చేసే విధంగా కేటాయింపులు దక్కనుండడంతో అన్నదాతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 29 , 2024 | 12:51 AM