వరద నిధులు.. ‘కృష్ణా’ర్పణం
ABN, Publish Date - Nov 18 , 2024 | 01:34 AM
కృష్ణానదికి ఇటీవల రికార్డు స్థాయిలో వచ్చిన వరదతో కరకట్ట అంచులకు నీరు చేరింది.
అవసరమైనవి వదిలేసి ఇష్టారీతిన పనులు
కొరవడిన పర్యవేక్షణతో అనవసరపు పనులు
జంగిల్ క్లియరెన్స్ పేరుతో తూతూమంత్రంగా
కరకట్టకు ఇరువైపులా నీడనిచ్చే చెట్ల తొలగింపు
వరద పనులు అంటే వరదకి ముందో.. వరద సమయంలో అత్యవసరంగానో చేస్తారు. కానీ నీటిపారుదల శాఖ మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా చేస్తుంది. నిధులు ఉన్నాయి.. పనులు చేస్తున్నామన్నట్లు చేస్తున్నారే కానీ అవి అవసరమా.. వాటి వల్ల ఉపయోగమా అన్న విషయాలను పట్టించుకోవడంలేదు. వరద వచ్చిపోయిన నెలల తర్వాత వరద పనుల పేరుతో తూతూమంత్రంగా చేస్తోంది. పనికిరాని కంప చెట్లను తొలగించాల్సిందిపోయి కరకట్టకు ఇరువైపులా నీడనిస్తున్న వృక్షాలను నేలకూల్చేస్తున్నారు. ఏ పని ఏ తరహాలో చెయ్యాలనే సూచనలు చేసే నాథుడేలేడు. ఆర్‌సీ విభాగంలో సిబ్బంది కొరత, ఉన్న సిబ్బంది, అధికారులు కొత్తగా బదిలీపై వచ్చిన వారు కావడంతో పనులపై పర్యవేక్షణ లోపించింది. ఎక్సకవేటర్ ఆపరేటర్‌కు ఏది చేస్తే అదే పనిగా గాలికొదిలేశారు.
తెనాలి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): కృష్ణానదికి ఇటీవల రికార్డు స్థాయిలో వచ్చిన వరదతో కరకట్ట అంచులకు నీరు చేరింది. మరికొన్నిచోట్ల పైనుంచి కూడా ప్రవహించింది. ఆ సమయంలో అత్యవసర మరమ్మతులకు ప్రభుత్వం కుడి, ఎడమ కరకట్టలకు రూ.48 లక్షలు కేటాయించింది. వరద వచ్చాక కేవలం ఇసుక మూటలు, అత్యవసరమనుకున్నచోట ఎక్సకవేటర్లతో కట్టలు సరిచేశారు. మిగిలిన నిధులతో కరకట్టకు ఇరువైపులా పెరిగిన ముళ్ల కంపను తొలగించడం, పేరుకుపోయిన మట్టి, ఇసుకను వెలుపలకు నెట్టేయడం, చెత్త కుప్పలను తొలగించడం వంటి పనులు చెయ్యాలి. కరకట్ట అంచులు ఎక్కడైనా బలహీనంగా ఉంటే వాటిని మట్టితో బలపరిచే పనులు చెయ్యాలి. అయితే వరద సమయంలో ఇసుక మూటలువేసే పనులు చేసిన అధికారులు ఆ తర్వాత మిగిలిన నిధులతో పనులు చేశామనిపించే విఽధంగా తూతూమంత్రంగా చేయడం విశేషం. అసలు పనికి బదులు అనవసరపు పనులు చేయడంపై విమర్శలు వస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.
భయం భయంగా కరకట్ట
కరకట్టకు ఇరువైపులా ఇంగ్లీష్ తుమ్మ, ఇతర ముళ్ల పొదలు దట్టంగా అల్లుకుపోయాయి. కుడి కరకట్టకు వారధి నుంచి పెనుమూడి వరకు చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. వీటి కారణంగా వరద సహాయ చర్యలకి, కరకట్ట అత్యవసర పనులకు ఇబ్బందిపడాల్సి వచ్చింది. కరకట్ట ఆధునికీకరణ జరిగిన ప్రాంతంలోనే ఇలా ఉంటే, పనులు ఆగిపోయిన ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది. వారధి దగ్గర కరకట్ట ప్రారంభమైన దగ్గర కొంతమేర విస్తరణ జరగలేదు. అయినా ఇక్కడ కంప చెట్ల సమస్య రాలేదు. విస్తరణ జరిగిన చిర్రావూరు-కొల్లిపర మధ్య మరింత దారుణంగా మారింది. దుగ్గిరాల మండలం పెదకొండూరు దగ్గర రోడ్డు అధ్వానంగా ఉంటే, కంప పెరిగి మరింత సమస్యగా మారింది. కరకట్ట ఆధునికీకరణకు ముందే పెదకొండూరు-వల్లభాపురం మధ్య డబుల్ రోడ్డు నిర్మాణం జరిగింది. దీంతో 4 కిలోమీటర్ల రోడ్డపై ఆధునికీకరణ సమయంలో ఒక్క పని కూడా చెయ్యలేదు. దీంతో ఈ ప్రాంతంలో రెండు వైపులా ముళ్ల కంప కమ్మేసి, రోడ్డు కుచించుకుపోయింది. కొల్లిపర-చిలుమూరు మధ్య కొన్నిచోట్ల కంప పెరిగింది. కొల్లూరు-ఈపూరు, దోనేపూడి-వెల్లటూరు మధ్య రోడ్డు పనులు జరగలేదు. దీంతో కమ్మేసిన చెట్లను కూడా తొలగించే చర్యలు చేపట్టలేదు. ఈ ప్రాంతాల్లో మనిషి అడుగు పెట్టడం కూడా గగనమే. ఇటువంటి చోట్ల ఒక్కపని కూడా చెయ్యలేదు. జంగిల్ క్లియరెన్స్ అవసరం ఉన్నచోట కాకుండా కంపచెట్లు పెద్దగా లేనిచోట పనులు చేశామనిపించుకోవడం విశేషం.
ముళ్లకంప వదిలేసి..
కృష్ణానదికి కుడి కరకట్టపై వారధి నుంచి మున్నంగి వరకు 20 కి.మీటర్ల మేర జంగిల్ క్లియరెన్స్, కరకట్ట కోత, బలహీనపడటం వంటి చోట్ల మరమ్మతులు చెయ్యాలి. దీనికోసం రూ.9 లక్షల వరకు మంజూరు చేశారు. అయితే వరద సమయంలో పెదకొండూరు-వల్లభాపురం మధ్య కొన్నిచోట్ల మాత్రమే ఇసుక మూటలు వేశారు. వరద సమయంలో కంప తొలగింపు అవకాశమేలేదు. దీంతో వరద తర్వాత ఇప్పుడు ఈ పనులు చేపట్టారు. అయితే చేస్తున్న కొద్దిపనులు కూడా సంపూర్ణంగా చేయడంలేదు. రోడ్డుపైకి అడుగు వెడల్పులో మట్టిపేరుకుపోయి దానిపై కంప మొలచినా కనీసం దానిని కూడా తొలగించడంలేదు. కరకట్టకు ఇరువైపులా ఏడేళ్ల నుంచి పెంచుతున్న చెట్లను నేలకూల్చడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాతూరు, చిర్రావూరు, గొడవర్రు, అత్తలూరివారిపాలెం, వల్లభాపురం ప్రాంతాల్లో నీడనిచ్చే చెట్లను నేలకూల్చేశారు. అడ్డొచ్చిన కొమ్మలు కాకుండా కరకట్టకు మూడు నుంచి ఐదు అడుగుల దూరంలో ఉన్న చెట్లను కూడా వేళ్లతో తొలగిస్తున్నారు. దీనిపై ఆర్‌సీ విభాగం జేఈ విజయరాజును ప్రశ్నిస్తే చెట్లు కొట్టేయమని చెప్పలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. వరద పనులు అప్పట్లో అత్యవసరం అనుకున్నవి చేశామని, మిగిలిన పనులను ప్రస్తుతం చేస్తున్నామని చెప్పారు.
Updated Date - Nov 18 , 2024 | 01:34 AM