AP Politics: రాజకీయాలకు దూరమవ్వడానికి అసలు కారణమేంటో చెప్పిన గల్లా జయదేవ్
ABN, Publish Date - Feb 05 , 2024 | 05:21 PM
రాజకీయాల్లో ఉండే వ్యాపారవేత్తలకు వేధింపులు తగవని ఎంపీ గల్లా జయదేవ్(Galla Jayadev) అన్నారు. సోమవారం నాడు లోక్‌సభలో మాట్లాడుతూ... రాముడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత తిరిగొచ్చినట్లు తానూ మళ్లీ రాజకీయాల్లో వస్తానని.. ఈసారి మరింత బలంగా తిరిగి వస్తానని స్పష్టం చేశారు..
ఢిల్లీ: కొన్నిరోజుల క్రితం గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సభలో ఆయన మనసులోని మాటలను పంచుకున్నారు. ఈ సమావేశంలో ఎంపీ గల్లా జయదేవ్(Galla Jayadev) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే రాజకీయాలకు ఎందుకు దూరం అవుతున్నాననే విషయాన్ని జయదేవ్ ఈరోజు(సోమవారం) లోక్‌సభలో వివరించారు.
వేధింపులు తగవు..
రాజకీయాల్లో ఉండే వ్యాపారవేత్తలకు వేధింపులు తగవని ఎంపీ గల్లా జయదేవ్(Galla Jayadev) అన్నారు. సోమవారం నాడు లోక్‌సభలో మాట్లాడుతూ... రాముడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత తిరిగొచ్చినట్లు తానూ మళ్లీ రాజకీయాల్లో వస్తానని.. ఈసారి మరింత బలంగా తిరిగి వస్తానని స్పష్టం చేశారు. రాజకీయాలకు తాత్కాలికంగా మాత్రమే దూరమవుతున్నానని తెలిపారు. రాజకీయాల్లో తను కొనసాగాలనుకోక పోవడానికి ప్రధాన కారణం రెండు పడవలపై ప్రయాణించదలచుకోకపోవడమేనని.. తనకు అనేక పరిమితులు కూడా ఉన్నాయని అన్నారు. రాజకీయ ప్రక్రియలో వ్యాపారవేత్తలు చాలా ముఖ్యమైన భాగమని భావిస్తున్నానని తెలిపారు.
ఇక్కడ ఆ పరిస్థితి లేదు..
అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాపారవేత్తలు రాజకీయాల్లో భాగం కావాలని ప్రోత్సహిస్తారని.. మన దేశంలో ఆ పరిస్థతి లేదని తన మనసులోని మాటను పంచుకున్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యాపారవేత్తలైన రాజకీయనేతలు మాట్లాడితే వారి కంపెనీలపై ప్రతీకార దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. చట్టాలకు లోబడి వ్యాపారాలు చేసుకున్నా రాజకీయ కారణాలతో వేధింపులు అధికమవుతున్నాయన్నారు. ప్రస్తుత లోక్‌సభలో 20% మంది వ్యాపారవేత్తలున్నారు...వారందరిదీ తనలాంటి ఆవేదనేనని తెలిపారు. విభజన హామీలను అమలు చేయాలని.. పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 75శాతం పూర్తయిన పోలవరం.. ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్న చంధంగా తయారైందని గల్లా జయదేవ్ అన్నారు.
Updated Date - Feb 05 , 2024 | 06:29 PM