అక్రమ నిర్మాణాలు కూల్చివేత
ABN, Publish Date - Nov 24 , 2024 | 01:10 AM
లాం గ్రామంలోని జగనన్న కాలనీకి పక్కనే ఉన్న కొండ పోరంబోకు స్థలాల్లోని ఆక్రమణలను రెవెన్యూ, పోలీసు, పంచాయతీ సిబ్బంది శనివారం కూల్చివేశారు. కొండపోరంబోకు స్థలాలను అక్రమించుకుని చేపట్టిన అక్రమ నిర్మాణాలు గత కొంతకాలంగా పెరిగిపోతున్నాయి.
పోలీసుల బందోబస్తు మధ్య తొలగింపు
కోర్టు ఉత్తర్వుల ప్రకారమేనన్న తహసీల్దారు
తాడికొండ, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): లాం గ్రామంలోని జగనన్న కాలనీకి పక్కనే ఉన్న కొండ పోరంబోకు స్థలాల్లోని ఆక్రమణలను రెవెన్యూ, పోలీసు, పంచాయతీ సిబ్బంది శనివారం కూల్చివేశారు. కొండపోరంబోకు స్థలాలను అక్రమించుకుని చేపట్టిన అక్రమ నిర్మాణాలు గత కొంతకాలంగా పెరిగిపోతున్నాయి. ఈక్రమంలో పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది ఎక్స్‌కవేటర్ సహాయంతో వాటిని కూల్చేశారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి కూల్చివేతల పక్రియ జరిగింది. సుమారు 30 నిర్మాణాలను కూల్చివేశారు. రెండు, మూడు రోజులు గడువులో ఇళ్లు ఖాళీ చేయాలని నివాసం ఉన్న వారిని ఆదేశించారు. నివాసాలపే ఖాళీ చేయని పక్షంలో చర్యలు తీసుకుంటామని తహసీల్దారు నాసరయ్య హెచ్చరించారు. కొందరు కోర్టులను ఆశ్రయించి నిర్మాణాలు తొలగించకుండా స్టేలు తీసుకువచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు. గత వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అమ్ముకుని జేబులు నింపుకున్నారు. అప్పట్లో స్థలాలను అక్రమించుకున్న వారికి పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆక్రమణలపై టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లగా వాటిని తొలగించాలని ఆదేశించినా అప్పటి అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇదే అదునుగా వైసీపీ నేతలు నకిలీ పొజిషన సర్టిఫికెట్లను తయారు చేయించి స్థలాలను విక్రయించారు. ఈ క్రమంలో మరోసారి ఆక్రమణల తొలగింపుపై హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చారు. నకిలీ పొజిషన సర్టిఫికెట్ల జారీపై విచారణ చేస్తే ఎన్నో అక్రమాలు బయటకు వస్తాయని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు.
Updated Date - Nov 24 , 2024 | 01:10 AM