మెడికల్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు
ABN, Publish Date - Nov 24 , 2024 | 01:14 AM
రాష్ట్రంలో మెడికల్ టూరిజం అభివృద్ధికి అద్భుత అవకాశాలు ఉన్నాయి. అతి తక్కువ ఖర్చుతో చక్కటి వైద్యసేవలు అందించే సత్తా మన తెలుగు వైద్యులకు ఉంది.. అని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
మెడికల్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు
తక్కువ ప్యాకేజీలకే వైద్య సేవలు అందించవచ్చు
ఐఎంఏ రాష్ట్ర సదస్సులో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని
గుంటూరు మెడికల్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మెడికల్ టూరిజం అభివృద్ధికి అద్భుత అవకాశాలు ఉన్నాయి. అతి తక్కువ ఖర్చుతో చక్కటి వైద్యసేవలు అందించే సత్తా మన తెలుగు వైద్యులకు ఉంది.. అని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు వైద్య కళాశాల జింకానా ఆడిటోరియంలో శనివారం రాత్రి జరిగిన ఇండియన మెడికల్ అసోసియేషన(ఐఎంఏ) రాష్ట్ర శాఖ 66వ వార్షిక సదస్సులో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ గార్లపాటి నందకిషోర్‌ను కేంద్రమంత్రి అభినందించారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ విదేశాలతో పోలిస్తే మన దేశంలో చౌకగా వైద్యసేవలు అందుబాట్లో ఉన్నట్లు తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకుని ఏపీలో మెడికల్ టూరిజం అభివృద్ధి కృషి చేయాలని చెప్పారు. రాష్ట్రంలో నిష్ణాతులైన వైద్యనిపుణులు విదేశీ రోగులను ఆకర్షిస్తే తక్కువ ప్యాకేజీలకే వైద్య సేవలు అందించవచ్చన్నారు. దీని వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. వైద్యులపై జరుగుతున్న దాడులను నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి తగిన పరిష్కార మార్గం కనుగొంటానని హామీ ఇచ్చారు.
ఆసక్తికరంగా సాగిన సైంటిఫిక్ సెషన
ఐఎంఏ ఏపీకాన 2024లో జరిగిన సైంటిఫిక్ సెషన ఆసక్తికరంగా జరిగింది. వైద్య రంగంలో కృత్రిమ మేధ పాత్ర అనే అంశంపై ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ పోతినేని రమేష్‌బాబు ప్రసంగించారు. హృద్రోగ వైద్య రంగంలో మనిషి కన్ను చూడలేని అంశాలను కృత్రిమ మేధతో తెలుసుకోవచ్చన్నారు. అత్యవసర చికిత్స, గుండెపోటును ఖచ్చితంగా నిర్ధారించగల ట్రాన్సమిషన ఈసీజీ టెక్నాలజీ ఏఐతో అందుబాట్లోకి వచ్చినట్లు చెప్పారు. రక్తనాళాల్లో 80 శాతం పూడికలు ఉన్నా స్టెంట్ అవసరమా? లేదా? అనే అంశాన్ని ఏఐతో ఖచ్చితంగా నిర్ధారించవచ్చని తెలిపారు. మోకీళ్ల మార్పిడిలో రోబోటక్ పాత్ర అనే అంశంపై సాయిభాస్కర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ సాంకేతికత వినియోగం పెరిగే కొద్దీ పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. మోకీళ్ల అరుగుదల రోగులకు పర్సనలైజ్డ్ రోబోటిక్ నీ ఆర్ధోప్లాస్టీ, ఇతర శస్త్రచికిత్సలపై డాక్టర్ వై సుబ్రహ్మణ్యం ప్రసంగించారు. హెచఐవీ చికిత్సల్లో నూతన అంశాలపై డాక్టర్ రేవూరి హరికృష్ణ, నూతన ఔషధాలతో ఆరోగ్య పరిరక్షణపై డాక్టర్ కొంగర శ్రీకాంత ప్రసంగించారు. యాంటీబయోటిక్ మందుల దుర్వినియోగం అరికడతామని, ప్రజల్లో అవగాహన కల్పిస్తామని వైద్యులు ప్రతిజ్ఞ చేశారు. సీనియర్ వైద్యులు కొండబోలు బసవపున్నయ్య, జీవీ కృష్ణారావు, మద్దినేని గోపాలకృష్ణలను కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జీ నందకిషోర్ సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌వీ అశోకన, జాతీయ కార్యదర్శి డాక్టర్ అనిల్‌కుమార్ వీ నాయక్, జాతీయ మాజీ అధ్యక్షుడు డాక్టర్ జీ సమరం, ఏపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ జయచంద్రనాయుడు, తెలంగాణ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ద్వారకానాధ్‌రెడ్డి, సదస్సు ఆర్గనైజింగ్ కమిటీల ప్రతినిధులు ఈదర కృష్ణమూర్తి, వై సుబ్బారాయుడు, టీ సేవకుమార్, బీ సాయికృష్ణ, సీహెచ విశ్వేశ్వరరావు, పీవీఎస్ హరిత తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 24 , 2024 | 01:14 AM