ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కబ్జా చేస్తే.. కటకటాలే

ABN, Publish Date - Nov 15 , 2024 | 01:46 AM

ల్యాండ్‌ మాఫియాను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రభుత్వం పగడ్బందీ చట్టాన్ని తీసుకొస్తున్నది.

తప్పించుకునే వీలులేకుండా పగడ్బందీ చట్టం

నిందితులకు అత్యంత తీవ్రమైన శిక్షలు.. ఆస్తుల సీజ్‌

బాధితులకు భారీగా పరిహారం చెల్లింపునకు చర్యలు

భూ కబ్జా కేసుల కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక కోర్టులు

నేడు అసెంబ్లీలో ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రొహిబిషన్‌ యాక్ట్‌ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం

గుంటూరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ల్యాండ్‌ మాఫియాను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రభుత్వం పగడ్బందీ చట్టాన్ని తీసుకొస్తున్నది. భూకబ్జాలకు పాల్పడ్డారో ఖతం అయినట్లే. ల్యాండ్‌ మాఫియాను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రభుత్వం పగడ్బందీ చట్టాన్ని తీసుకొస్తుంది. భూ కబ్జాదారుల మెడకు ఉచ్చు బిగించబోతోంది. అర్థబలం... అంగబలంతో రెచ్చిపోయిన ల్యాండ్‌ మాఫియా కట్టడే లక్ష్యంగా సామాన్యుల ఆస్తులకు రక్షణ కవచం లాగా నూతన ఆక్రమణల నిషేధిత చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తోంది. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో శుక్రవారం ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రొహిబిషన్‌ యాక్ట్‌ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఇష్టారీతిన భూకబ్జాలతో ప్రజ, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని గుంటూరు జిల్లాతో పాటు అటు పల్నాడు, ఇటు బాపట్ల జిల్లాల్లో ల్యాండి మాఫియాకు సంబంధించి అక్రమార్కులు రాజకీయ పలుకుబడితో పాటు పోలీసులను గుప్పెట్లో పెట్టుకుని యథేచ్ఛగా తమ కార్యకలాపాలను కొనసాగించేవారు. ఎవరైనా వీరి అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వారిపై తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేసేవారు. కోర్టులకు వెళితే ఎన్నేళ్ళకు కేసు తేలుతుందో అర్థం కాక కొందరు, కోర్టులకు వెళ్ళలేక మరికొందరు, కోట్ల ఖరీదైన ఆస్తులను వదులుకోలేక ఇంకొందరు అలాగని న్యాయపోరాటం చేయలేక సతమతమవుతూ వచ్చారు. అంతేకాక ఎవరైనా వారిని ధీటుగా ఎదుర్కొని పోలీసులకు ఫిర్యాదు చేసినా చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని ేస్టషన్‌ బెయిల్‌పై వచ్చి ఆయా భూ యజమానులకు హెచ్చరికలు చేస్తూ తమ భూకబ్జాల పర్వం కొనసాగిస్తూ వచ్చారు. కొన్ని సందర్బాల్లో ల్యాండ్‌ మాఫియా, పోలీసులు చేతులు కలిపి భూ కబ్జాలను తెలివిగా సివిల్‌ వివాదం అంటూ ఉన్నతాధికారులను, చివరకు చట్టాన్ని సైతం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసి కోట్ల ఖరీదైన అమాయకుల భూములను అప్పనంగా కొట్టేసిన ఉదంతాలెన్నో ఉన్నాయి.

గడిచిన ఐదేళ్లులో రెచ్చిపోయిన భూమాఫియా..

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో భూమాఫియా రెచ్చిపోయింది. అధికార పార్టీ నేతలు, పోలీసులను తమ గుప్పెట్లో పెట్టుకుని ఖరీదైన భూములను కొట్టేశారు. ఒకవైపు ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు, చుక్కల భూములు వంటి వాటిని సైతం తమ మాయాజాలంతో చేతులు మార్చుకున్నారు. పేదలు, అమాయకుల ఆస్తులను తప్పుడు రిజిస్ట్రేషన్లతో వశం చేసుకున్నారు. ప్రశ్నించిన వారిపై ఎస్సీ, ఎస్టీ సహా తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ, జనసేన రాష్ట్ర కార్యాలయాల్లో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభించారు. మరోవైపు లోకేశ్‌ కూడా తన నివాసంలో బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరిస్తున్నారు. గడిచిన ఐదు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న ఫిర్యాదుల్లో 80 శాతానికి పైగా ల్యాండ్‌ మాఫియా సాగించిన భూకబ్జాలపైనే కావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. మరోవైపు నాడు అధికారాన్ని వెలగబెట్టిన వారిలో అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక పదవుల్లో ఉన్న నాయకులు, వైసీపీ ముఖ్య నేతలు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను తమ పేరిట, అనుయాయుల పేరిట, బినామీ పేర్లతో కొట్టేశారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం ల్యాండ్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుని పకడ్బందీగా భూకబ్జా నిషేధిత చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై ఈ నెల 4న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో మంత్రి మండలి ఆమోదముద్ర కూడా వేసింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిని ఆమోదించనున్నారు. ఈ నేపథ్యంలో రానున్న కొద్ది నెలల్లో ఈ చట్టం అమల్లోకి రాబోతుంది.

ఎస్పీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

భూకబ్జాలకు సంబంధించి ప్రతి సోమవారం బాధితులు పెద్దసంఖ్యలో గుంటూరు, బాపట్ల, పల్నాడు ఎస్పీ కార్యాలయాల్లో జరిగే గ్రీవెన్స్‌లకు పోటెత్తుతున్నారు. ఎస్పీల గ్రీవెన్స్‌కు వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికం భూకబ్జాలకు సంబంధించినవే ఉంటుండటం గమనార్హం. ఎస్పీ కార్యాలయం నుంచి సంబందిత స్టేషన్‌లకు వెళ్ళినా పోలీసులు సివిల్‌ వివాదమని పక్కన పెట్టేస్తున్నారు. దీంతో బాదితుల గోడు వినేవారే కరువవుతున్నారు. కోట్ల ఖరీదైన సామాన్యుల భూములను చట్టంలో ఉన్న లొసుగులను, రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని కొట్టేశారు. సంచలనం సృష్టించిన గుంటూరు శ్యామలానగర్‌లో జరిగిన భూకబ్జా వ్యవహారం మొదలు ఇటీవల వరకు ఎన్నో ఉదంతాలు చోటుచేసుకున్నాయి. శ్యామలానగర్‌లో జరిగిన భూకబ్జా వ్యవహారంలో ఏకంగా డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది సస్పెన్షన్‌కు గురైన వ్యవహారం తీవ్ర కలకలం రేపిన విషయం విధితమే. ఆ తర్వాత గుంటూరు పలకలూరు రోడ్డులోను ఇదే తరహాలో అనేక భూకబ్జా ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఆరు నెలల్లోనే విచారణ పూర్తయ్యేలా చట్టం

అమాయకులు, వృద్ధులు, ఎన్‌ఆర్‌ఐల భూములపై కన్నేసి తప్పుడు డాక్యుమెంట్లు సృస్టించి డబుల్‌ రిజిస్టే్ట్రషన్‌ చేసి వివాదం సృష్టిస్తే కోర్టుల చుట్టూ తిరగలేక వారే దారికి వస్తారులే అని ఇప్పటిదాకా భూములు కొల్లగొట్టిన ల్యాండ్‌ మాఫియా ఆటలు ఇక సాగవు. కొత్తగా వస్తున్న ఈ చట్టం ప్రకారం ఏ వివాదమైనా ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు మాదిరిగా కేసు కొట్టేయడం కాదు. భూమి ఆక్రమించినట్లు తేలితే నిందితుడిపై కఠిన చర్యలు ఉండనున్నాయి. నిందితుడికి కనీసం 10 నుంచి 14 ఏళ్లకు తక్కువ కాకుండా జైలుశిక్ష విధించనున్నారు. అంతేకాదు ఆక్రమించిన భూమి విలువతో పాటు మూడు రెట్ల వరకు నిందితుడి నుంచి నష్ట పరిహారం వసూలు చేయనున్నారు. ఇందుకుగాను ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఆయా కోర్టుల్లో కేవలం భూ కబ్జా కేసులు మాత్రమే విచారించనున్నారు. భూ ఆక్రమణలకు సంబందించి ఆయా కోర్టులే నేరుగా సుమోటోగా కేసులు విచారణ చేపట్టే అధికారాలు కూడా కల్పించనున్నారు. భూకబ్జాలకు పాల్పడే మాఫియాకు ఏ మాత్రం అవకాశం, లొసుగులకు ఆస్కారం లేకుండా నూతన చట్టాన్ని తీసుకురాబోతున్నారు.

Updated Date - Nov 15 , 2024 | 01:46 AM