త్రిశంకు స్వర్గంలో.. మీ సేవ
ABN, Publish Date - Nov 17 , 2024 | 01:21 AM
విద్యార్థులకు ధృవీకరణపత్రాలు.. బర్త్, డెత్ సర్టిఫికెట్లు కావాల్సి వస్తే మీ సేవా కేంద్రాలు. ఓటరు కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే మీ సేవా కేంద్రాలు. ఇంటి పన్నులు, నీటి పన్నులు, విద్యుత్ బిల్లులు కట్టాలన్నా మీ సేవా కేంద్రాలు.. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి టీడీపీ హయాంలో చంద్రబాబు మీ సేవా కేంద్రాలను ప్రవేశపెట్టారు. ప్రజలకు వివిధ రకాల ప్రభుత్వ సేవలు అందించేలా వీటిని తీర్చిదిద్దారు.
ఆదాయం లేక ఆపరేటర్ల అవస్థలు
నడపలేక.. మూసివేయలేక అయోమయం
దెబ్బతీసిన వైసీపీ ప్రభుత్వం.. కూటమిపైనే ఆశలు
(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి)
విద్యార్థులకు ధృవీకరణపత్రాలు.. బర్త్, డెత్ సర్టిఫికెట్లు కావాల్సి వస్తే మీ సేవా కేంద్రాలు. ఓటరు కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే మీ సేవా కేంద్రాలు. ఇంటి పన్నులు, నీటి పన్నులు, విద్యుత్ బిల్లులు కట్టాలన్నా మీ సేవా కేంద్రాలు.. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి టీడీపీ హయాంలో చంద్రబాబు మీ సేవా కేంద్రాలను ప్రవేశపెట్టారు. ప్రజలకు వివిధ రకాల ప్రభుత్వ సేవలు అందించేలా వీటిని తీర్చిదిద్దారు. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సేవా కేంద్రాలను నిర్వీర్యం చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వ ఆదరణ లేక త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అంతంత మాత్రంగా ఉన్న సర్వీసులతో ఆదాయం లేక ఆపరేటర్లు అవస్థలు పడుతున్నారు. అటు నడపలేక, ఇటు మూసివేయలేక అయోమయంలో ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మీసేవలను పూర్తిగా దెబ్బతీయగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం మీసేవలకు పూర్వవైభవం తీసుకువస్తుందని ఆపరేటర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు పౌరసేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్, టీసీఎస్ భాగస్వామ్యంలో మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు మొదటి సారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన సమయంలోనే దశల వారీగా మీ సేవా కేంద్రాల్లో టెక్నాలజీ ఆధారిత పౌర ేసవలు అందుబాటులోకి వచ్చాయి. 2019లో గ్రామ సచివాలయాలు ఏర్పాటయ్యాక మీసేవా కేంద్రాల అవసరం తగ్గిపోయింది. మీ ేసవా కేంద్రాల నిర్వహకులు హైకోర్టును ఆశ్రయించడంతో వాటిని కొనసాగించాలని ఆదేశించడంతో కొన్ని చోట్ల అవి కొనసాగుతున్నాయి. 2014-19 వరకు దాదాపు 350 రకాల సేవల్ని మీ ేసవా కేంద్రాల్లో అందించేవారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల రాకతో అంతకు ముందు ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాలు మరుగున పడిపోయాయి. రిజిరేస్టషన్ శాఖకు సంబంధించి ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్, ఆస్తులకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు, ఆస్తులు, వ్యవసాయ భూముల కొనుగోళ్లలో మ్యూటేషన్ పత్రాలను కూడా మీ సేవా కేంద్రాల్లో జారీ చేసేవారు. ప్రస్తుతం ఈ తరహా సేవలను రద్దు చేశారు. గతంలో రాష్ట్రంలో ఎక్కడి ఆస్తులకు ఎక్కడైనా ఈసీలు పొందే వెసులుబాటు ఉండేది. సచివాలయాల రాకతో అవన్నీ మాయమయ్యాయి. మీ సేవల్లో రద్దయిన సేవలను సచివాలయాల్లో అందిస్తున్నారా అంటే అది కూడా లేదు. దీంతో ప్రజలు తిరిగి మీ సేవా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు చేయాల్సిన ఉద్యోగాలు, విధులపై జాబ్ ఛార్ట్‌ను ఖరారు చేయకపోవడమే ఈ రకమైన సమస్యకు కారణం అవుతోంది. సచివాలయాల్లో జారీ చేసే ధృవీకరణ పత్రాల విషయంలో మరో సాంకేతిక సమస్య ఎదురవుతోంది. మీ సేవా కేంద్రాల్లో నిర్ణీత రుసుము చెల్లిస్తే ఎన్ని కాపీలైనా ప్రింట్ చేసే అవకాశం ఉంటుంది. సచివాలయాల్లో ప్రస్తుతం డిజిటల్ కాపీలను మాత్రమే జారీ చేస్తున్నారు. క్యాస్ట్, ఇన్‌కమ్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ వంటి వాటికి ఒక్క కాపీ మాత్రమే మంజూరు చేస్తున్నారు. సచివాలయాల్లో జారీ చేసే డిజిటల్ కాపీలను మీ ేసవా కేంద్రాల్లో ప్రింట్ తీసుకోవాలని సిబ్బంది ఉచిత సలహాలు ఇస్తున్నారు. పీడీఎఫ్ కాపీలకు ఎవరైనా నకిలీ పత్రాలను సృష్టిస్తే తాము చిక్కుల్లో పడతామని, సచివాలయాలు జారీ చేసే పత్రాలను ముద్రించడానికి మీ ేసవా కేంద్రాలు నిరాకరిస్తున్నాయి. సచివాలయాలు, మీ ేసవా కేంద్రాల మధ్య నెలకొన్న గందరగోళంతో అర్జీదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్‌కల్యాణ్, యువగళం పాదయాత్రలో లోకేశ్ గత ఎన్నికలకు ముందు కలిసిన ఆపరేటర్లకు మీ సేవలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో మీసేవలపై పట్టున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వాటికి పూర్వవైభవం తెస్తారని భావిస్తున్నారు.
అన్ని వేళాలా అందుబాట్లో సేవలు
మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు అనేక రకాల సేవలు అందుబాటులో ఉండేవి. ఇవి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మీ సేవా కేంద్రాలు నిర్విరామంగా పని చేస్తుండేవి. దీంతో వివిధ రకాల సర్టిఫికెట్లు, పన్నులు, వివిధ రకాల బిల్లుల చెల్లింపులకు ఈ కేంద్రాలు ప్రజలకు సౌకర్యంగా ఉండేవి. అనేక ఏళ్లపాటు ప్రజలకు సేవలందించిన మీ సేవలకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది. సచివాలయాలు ఏర్పడిన తొలినాళ్లలో మీ సేవా కేంద్రాల్లో ఇచ్చిన సర్టిఫికెట్లు చెల్లవని, అధికారులు కూడా సచివాలయాలను ప్రోత్సహిస్తూ వచ్చారు. అప్పటి ప్రభుత్వం కూడా మీసేవా కేంద్రాలను పరిగణనలోకి తీసుకోరాదని హెచ్చరించడంతో అధికారులు కూడా మీసేవలను దూరం పెట్టారు. దీంతో మీ సేవలకు ప్రజలు కూడా దూరమయ్యారు. ఈ క్రమంలో మీసేవా కేంద్రాల పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్ధిక ఇక్కట్లతో కొందరు కేంద్రాలను నడపలేక మూసివేశారు. సచివాలయాలలో సేవలు ఉన్నా అవి ఉదయం పది నుంచి సాయంత్రం 5గంటల వరకే అందుబాటులో ఉంటాయి. ఈ కారణంగా వివిధ పనులు, ఉద్యోగాలకు వెళ్లే వారికి ఆశించిన విధంగా సచివాలయాల సేవలు ఉపయోగపడడం లేదనే విమర్శలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించడం లేదనే ఆరోపణలున్నాయి.
పౌర సేవల్లో అంతులేని నిర్లక్ష్యం
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ప్రతిష్ఠాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సుపరిపాలన నినాదంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసినా పౌర సేవల్లో అంతులేని నిర్లక్ష్యం ఉంది. సచివాలయాల సిబ్బందిలో జవాబుదారీతనం తీసుకురాకుండానే ఐదేళ్లు గడిచిపోయాయి. దశల వారీగా 500కుపైగా పౌరసేవల్ని సచివాలయాల్లో అందిస్తామని ప్రకటించిన గత ప్రభుత్వం అమలులో చతికిల పడింది. రెవెన్యూ, వ్యవసాయ, పౌరసరఫరాలు, విద్యుత్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ వంటి సేవల్ని అందిస్తామన్నా ఆయా శాఖల నుంచి అధికారాలను మాత్రం సచివాలయాలకు బదలాయించలేదు. సాంకేతికంగా చెప్పాలంటే సచివాలయ సిబ్బందికి ఎలాంటి అధికారాలు లేవు. కేవలం దరఖాస్తుల్ని ప్రాసెస్ చేయడానికి మాత్రమే వారు పరిమితమయ్యారు. కూటమి ప్రభుత్వంలో ఇంటింటికి పెన్షన్ల పంపిణీకే సిబ్బంది పరిమితమయ్యారన్న వాదన ఉంది.
Updated Date - Nov 17 , 2024 | 01:21 AM